హైదరాబాద్, జూలై 5 : దాదాపుగా అర్థ శతాబ్దం పాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా సేవలందించిన సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శ్రీహరి పలు ఈనాడు, హిందు, ఫిల్మ్ ఫేర్ వంటి ప్రముఖ పత్రికలలో పని చేశారు. సుమారు 55 ఏళ్ల పాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా చిత్ర పరిశ్రమకు సేవలందించారు. తెలుగు ఫిలిం ఇండస్టీ అనే పుస్తకాన్ని రచించారు. గుడిపూడి శ్రీహరి మరణ వార్త తెలిసి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. గత నవంబర్‌లో శ్రీహరి భార్య లక్ష్మి మరణించారు.
ఆ తరువాత నుంచి ఆయన బాగా కృంగిపోయి చాలా బలహీనంగా తయారయ్యారు. దాంతో ఇంటికే పరిమితమయిన శ్రీహరి, గత వారం ఇంట్లో జారి పడిపొవడం వల్ల తొంటి వెముక విరిగింది. దీంతో నిమ్స్ హాస్పిటల్‌లో చేరిన ఆయనకు విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. కానీ, ఆ తరువాత ఆరోగ్య సమస్యల వల్ల రాత్రి కన్నుమూశారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె వున్నారు.