న్యూదిల్లీ, డిసెంబర్ 1 : సునంద పుష్కర్ మరణం కేసులో పాటియాల హౌస్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా దిల్లీ పోలీసులు అప్పీలు చేయడంతో దిల్లీ హైకోర్టు గురువారం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు నోటీసు జారీ చేసింది. సునంద పుష్కర్ మరణం కేసులో పాటియాల హౌస్ కోర్టు 2021 ఆగస్టు 18న శశి థరూర్‌ను కేసు నుంచి విముక్తుని చేస్తూ తీర్పు చెప్పింది. కాగా ఢిల్లీ పోలీస్ గురువారం ఆ తీర్పును సవాలు చేస్తూ దిల్లీ హైకోర్టులను ఆశ్రయించారు. ఆగస్టు 18, 2021న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా రివిజన్ పిటిషన్‌ను దాఖలు చేయడంలో జాప్యాన్ని క్షమించాలని కోరుతూ పోలీసులు చేసిన దరఖాస్తుపై థరూర్‌ను హైకోర్టు స్పందన కోరింది.
కేసుకు సంబంధించిన కాపీలు, డాక్యుమెంట్లను తమ వద్ద ఉంచుకోవాలని కూడా ఆదేశించింది.న్యాయమూర్తి డికె శర్మ పిటిషన్ కాపీని శశి థరూర్ న్యాయవాదికి అందజేయాల్సిందిగా దిల్లీ పోలీసుల తరఫు న్యాయవాదిని ఆదేశించారు. శశి థరూర్ తరఫు న్యాయవాది తమకు వినతి(ప్లీ) కాపీని పంపలేదని, కావాలనే తప్పుడు ఈమెయిల్‌కు పంపించారని వాదించారు. తదుపరి కేసు విచారణను 2023 ఫిబ్రవరి 7న చేపట్టనున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌లో 2014 జనవరి 17న సునంద పుష్కర్ చనిపోయి ఉండడాన్ని కనుగొన్నారు. అప్పట్లో శశిథరూర్ అధికారిక బంగ్లా మరమ్మతు పనులు జరుగుతుండడంతో శశిథరూర్, ఆయన భార్య సునంద పుష్కర్ అక్కడి లగ్జరీ హోటల్‌లో బస చేశారు.
ఆత్మహత్యకు పురికొల్పడం, క్రూరత్వాన్ని ప్రదర్శించడం వంటి ఐపిసి సంబంధిత అంశాల కింద థరూర్ ద కేసయితే బుక్ చేశారు. కానీ కేసులో ఇప్పటి వరకు అరెస్టయితే చేయలేదు. కాగా ఆ కేసులో తన క్లయింట్ తప్పు చేసినట్లు ఎలాంటి సాక్షాధారాలు లేవని శశిథరూర్ తరఫు న్యాయవాది
వాదించారు.