- తదుపరి విచారణ వరకు అరెస్ట్ నుంచి మినహాయింపు
- విచారణను ఆగస్ట్ పదికి వాయిదా వేసిన ధర్మాసనం
న్యూ దిల్లీ ,జూలై19: సుప్రీంకోర్టులో నుపుర్ శర్మకు తాత్కాలిక ఊరట లభించింది. వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు తాత్కాలిక ఉపశమనం దక్కింది. కేసు తదుపరి విచారణ వరకు అరెస్ట్ నుంచి మినహాయింపునిస్తూ సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేసులు నమోదయిన రాష్టాల్రు ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్, అసోంలకు సుప్రీంకోర్ట్ నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ ప్రత్యమ్నాయ న్యాయ సహాయాన్ని ఏవిధంగా పొందుతారనేది ప్రస్తుతం తమ ఆందోళనగా ఉందని కోర్ట్ తెలిపింది. న్యాయ ప్రత్యమ్నాలను అన్వేషించే క్రమంలో ప్రతివాదులందరికీ నోటీసులు ఇవ్వనున్నట్టు చెప్పింది. ఈ కేసులో వాదనలు ఆగస్టు 10న వింటామని వెల్లడిస్తూ వాయిదా వేసింది. ప్రాణహాని ఉన్నందున అరెస్ట్ నుంచి మినహాయింపు నూపుర్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రాణహాని కారణంగా న్యాయ సహాయాన్ని పొందడం ఇబ్బందికరంగా మారిందని పిటిషన్లో ఆమె పేర్కొన్నారు. మరోవైపు తనపై నమోదయిన కేసులన్నింటినీ ఒక గ్రూపుగా విచారించాలంటూ దాఖలైన పిటిషన్‌ని పునరుద్ధరిం చాలని ఆమె కోరిన విషయం తెలిసిందే. వెకేషన్ బెంచ్ తనపై చేసిన ప్రతికూల వ్యాఖ్యలను కూడా తొలగించాలని నూపుర్ శర్మ తన పిటిషన్లో కోరారు. ఈ క్రమంలో నుపుర్ ను ఇప్పట్లో అరెస్టు చేయవద్దని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
జస్టిస్ సూర్యకాంత్, జేబీ పర్దివాలాతో కూడిన ధర్మానం ఈ తీర్పు నిచ్చింది. ఆగస్టు 10వ తేదీన మళ్లీ నుపుర్ శర్మ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టనుంది. దేశవ్యాప్తంగా తనపై నమోదైన తొమ్మిది కేసులను ఒకే కేసుగా మార్చాలని నుపుర్ శర్మ కోర్టును సుప్రీంకోర్టును కోరగా, ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టింది. నుపుర్ శర్మచేసిన కామెంట్స్ వల్ల దేశంలో పలు చోట్లల్లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఉదయ్‌పూర్‌లో అయితే ఓ వ్యక్తిని ఏకంగా చంపేశారు.