న్యూదిల్లీ, డిసెంబర్ 1 : సుప్రీంకోర్టులో మరోసారి పూర్తి మహిళా ధర్మాసనం ఏర్పాటైంది. చరిత్రలో ఇది మూడోసారి కావడం గమనార్హం. జస్టిస్ హిమా కొహ్లీ, జస్టిస్ ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ బుధవారం నియమించారు. గురువారం నుండి ఈ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. వివాహ వివాదాలకు సంబంధించిన 10 బదిలీ పిటిషన్లు, పది బెయిల్ పిటిషన్‌లను విచారించనున్నారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం 27 మంది న్యాయమూర్తులు ఉండగా, ముగ్గురు మహిళా న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు.
వారు జస్టిస్ హిమా కొహ్లీ, బి.వి. నాగరత్న, జస్టిస్ త్రివేదిలు. వీరిలో జస్టిస్ కొహ్లీ పదవీకాలం సెప్టెంబర్ 2024తో ముగియనుంది. జస్టిస్‌త్రివేది పదవీకాలం 2025వరకు ఉంది. జస్టిస్ నాగరత్న పదవీకాలం 2027 వరకు ఉండగా, ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో కూడా ఉన్నారు. 2027లో ఆమె 36రోజుల పాటు సిజెఐగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
అప్పుడు సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఘనతను సాధిస్తారు. 2013లో మొదటిసారి జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజనా ప్రకాష్ దేశారులతో సుప్రీంకోర్టులో మహిళా బెంచ్ ఏర్పాటైంది. 2018 సెప్టెంబర్ 5న జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో రెండో సారి ధర్మాసనం ఏర్పాటై పలు విచారణలు చేపట్టింది.