సెప్టెంబర్‌ 17 ను విద్రోహ దినంగా పాటించండి!!

సీపీఐ (ఎం-ఎల్‌) న్యూడెమోక్రసీ పిలుపు

క్రూర నిజాం రాజ్యంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు మృగ్యమై వెట్టి చాకిరీ అమలైనప్పుడు,దాన్ని తుద ముట్టించడానికి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1948 జూలై 4 న దొడ్డి కొమురయ్య హత్య తో ప్రారంభమయింది. నిజాం ఆగడాలకు వ్యతిరేకంగా ప్రధానంగా తెలుగు భాషా వికాసం కోసం ,తెలుగు మాధ్యమం కోసం ఆంధ్ర మహాసభ ఏర్పడిరది. దీనికోసం మాడపాటి హనుమంతరావు లాంటి పెద్దలు 20వ శతాబ్దం ప్రారంభం నుండే గొప్ప ఉద్యమాలు సాగించారు. ఆంధ్ర మహాసభ  క్రమంగా కమ్యూనిస్ట్‌ పార్టీ గా  రూపాంతరం చెంది దున్నే వాడికే భూమి నినాదం తో ఉద్యమించడమే గాకుండా నిజామ్‌ రాచరిక నియంతృత్వ సర్కార్‌ ను కూల్చివేసే దశకు చేరింది.ఇంతలోనే 1948 సెప్టెంబరు 17న యూనియన్‌ సైన్యాలు తెలంగాణలో  ప్రవేశించాయి. అప్పటికే నిజామ్‌ తన శక్తిని పూర్తిగా కోల్పోయాడు.నేను నిజామ్‌ నే కాదు, ఆయన సృష్టించిన రజాకార్లను కూడా కమ్యూనిస్టుల నాయకత్వాన ప్రజలు మట్టి కరిపించారు.  అప్పటికే నిజామ్‌ అనుకూల జమిందారుల నుండి, భూస్వా ముల నుండి, దేశ్‌ ముఖ్‌  ల నుండి  సుమారు 10 లక్షల ఎకరాలను భూములను ప్రజలు సాధించుకుని, పంచుకొన్నారు. 3 వేల గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలను సాధించుకొన్నారు. ఇది దేశంలో, ప్రపంచంలో గొప్ప భూపోరాటంగా మారింది.

దీన్ని ప్రమాదకరంగా విదేశీ పెట్టుబడిదారులు, దేశంలోని దలారీ వర్గాలు తీవ్రంగా భావించాయి. దీన్ని ఎలాగైనా నిలువరించాలని యూనియన్‌  మిలట్రీని హైదరాబాద్‌ రాష్ట్రంలోకి నెహ్రూ – పటేల్‌ యూనియన్‌ ప్రభుత్వం 1948 సెప్టెంబర్‌ 13 న పంపి దాడికి పాల్పడిరది. నిజానికి యూనియన్‌ సర్కార్‌ నిజామ్‌ నవాబుతో లోపాయికారి ఒప్పందం చేసుకొవడంవల్లనే, సరిగ్గా నాలుగు రోజులకే నిజామ్‌ రాజు  కేంద్ర హోం మంత్రి వల్లబ్‌ బాయ్‌ పటేల్‌ ముందు లొంగిపోయాడు. కానీ తెలంగాణ రాజ్యం లో యూనియన్‌ సైన్యాలు మూడేండ్ల తర్వాత గానీ వెల్లిపోలేదు. ఈ కాలమంతా  తెలంగాణపై యూనియన్‌ సైన్యం నిజామ్‌ ని మించిన బీభత్సాన్ని, నియంతృత్వాన్ని అమలు చేసింది. దీంతో అప్పటికే గ్రామాల నుండి హైదరాబాద్‌ కు పారిపోయిన భూస్వాములు, నిజామ్‌ ఏజెంట్లు, జమిందార్లు, దేశ్‌ ముఖ్లు గ్రామాలకి వచ్చి, ప్రజల స్వాధీనంలో గల  భూములను  స్వాధీనం చేసుకున్నారు. భూముల కోసం సాయుధంగా పోరాడుతున్న ప్రజలని ఊచకోత కోసారు.పిండ రూపంలో ఏర్పడుతున్న కమ్యునిస్టు ప్రభుత్వాన్ని అత్యంత కిరాతకంగా దాడి చేసి, అంతమొందించారు.

అలా నాలుగు వేల మంది పోరాటయోధులను , గెరిల్లాలను,ప్రజలను పొట్టన పెట్టుకుంటే అది తెలంగాణకు విమోచన అని బీజేపీ కేంద్ర ప్రభుత్వం భావించి విమోచన ఉత్సవాలకు పిలుపు నివ్వడం  చరిత్రను పూర్తిగా వక్రీకరించడమే.. ! 3 వేల మందిని యూనియన్‌ సైన్యం ఊచకోత కోస్తే, 5 వేల మంది స్త్రీలను చెరిస్తే,వేల మందిని చిత్రవధ చేస్తే దీన్ని వజ్రోత్సవ పండుగగా ఎలా చేసుకుంటారు? అంతే కాదు, తాను చేసిన నేరాలకు గాను ప్రజల చేతుల్లో కుక్క చావు చావాల్సిన నిజామ్‌ రాజు ను రాజ ప్రముఖుడిగా ప్రకటిస్తూ , రాజభరణాల పేరిట సంవత్సరానికి ఒకటిన్నర కోట్ల పరిహారం చెల్లించారు. నిజామ్‌ రాజ్యంలో  కరుడైన ఖాశిం రజ్వీని పాకిస్తాన్‌ కు సురక్షితంగా పంపారు. మరట్వాడ ప్రాంతంలో 2 లక్షల మంది ఏ పాపం తెలవని అమాయక, సాధారణ ముస్లిం ప్రజలను ఊచకోత కోసిన రజాకార్ల నాయకుడు ఖాశిం రజ్వీని క్షమించి వదిలెయ్యడం ఎవరి మెప్పుకోసం? నిజానికి సెప్టెంబరు 17 హైదరాబాద్‌ రాజ్యం ప్రజలు ఆర్థిక, రాజకీయ, సామాజిక దాడులకు గురయిన చీకటి రోజు  మాత్రమే! ఈ రోజు ప్రజలు ధన, మాన ప్రాణాలను కోల్పోయారు. లక్షలాది ఎకరాల భూములతో పాటు,వారు సాధించుకున్న అనేకానేక విజయాలను హరించిన రోజు అది. అందుకే అది ప్రజలకు విద్రోహం జరిగిన  రోజుగానే భావించాలి.   ప్రజలను మతం పేరిట విభజించి పాలించడానికి నాటి నుండి నేటి  వరకు  సెప్టెంబర్‌ 17 విద్రోహాన్ని విమోచనగా  నమ్మించే కుట్రలను బీజేపీ పార్టీ నాయకులు సాగిస్తున్నారు. కమ్యునిస్టులు వీరోచితంగా సాగించిన ఈ మహోన్నత భూమి పోరాటాన్ని వక్రీకరించి, చరిత్రను తారుమారు చేయచూస్తున్నారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వమే రంగం లోకి దిగి విమోచన దినోత్సవం పేరిట ఏడాది పాటు ఉత్సవాలకు ముందుకు వచ్చింది.

తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ, ఆర్‌.ఎస్‌.ఎస్‌ హిందూత్వ మతోన్మాద శక్తులు సెప్టెంబరు 17 విమోచన దినాన్ని సంవత్సర కాలం పాటు జరపాలనీ, తెలంగాణలో విద్వేషాన్ని సృష్టించాలని కుట్రలకు, కుతంత్రాలకు దిగుతున్నారు. తెగించి పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధానాలకు పాల్పడుతున్నారు. ప్రజా సమస్యల నుండి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించడానికి, తద్వారా  రానున్న ఎన్నికల్లో లబ్ది పొందడానికి ఫాసిస్టు పద్ధతుల్లో ముందుకూ వస్తున్నారు.ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాలి, ప్రతిఘటించాలి. రాష్ట్రంలో టి.ఆర్‌.ఎస్‌- కేసిఆర్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై రోజు రోజు కూ ప్రజా వ్యతిరేకత బాగా పెరుగుతుంది. ఈ  ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను సంఘటితం కాకుండా, పోరాడకుండా ఉండడానికి  సెప్టెంబరు 17ను కేసిఆర్‌ రాజకీయ ఎత్తుగడగా వాడు కోవడం కోసమే హడావుడిగా జాతీయతా సమైక్యతా దినంగా సెప్టెంబర్‌17 న పాటించాలని పిలుపునిచ్చాడు. చరిత్రను సరిగ్గా పరిశీలించకుండానే చాలా కాలం కిందట నిజామ్‌ రాజు ను గొప్పవాడని పొగిడాడు.ఇప్పుడు అదే రీతిలో లో అవకాశ వాదం తోనే  ఈ తప్పుడు నిర్ధారణకు వచ్చాడు.ఇక సీపీఐ, సీపీఎం పార్టీలు సెప్టెంబరు 17  ను విలీనం జరిగిన రోజుగా భావిస్తూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విజయోత్సవాలు జరపాలని  తమ వర్గ సంకర రాజకీయాలకు అనుగుణంగానే పిలుపు నిచ్చాయి.

సెప్టెంబర్‌ 17 విమోచనం ఎంత మాత్రం కాదనీ, అది ముమ్మాటికీ  తెలంగాణకు విద్రోహమేనని మా పార్టీ దృఢంగా భావిస్తున్నది. ప్రజలు  ఎదుర్కొంటున్న సమస్యలనూ పట్టించు కోకుండా,ప్రజల దృష్టిని మళ్ళించడానికి పాలక వర్గ పార్టీలు  ప్రధానంగా బీజేపీ సాగిస్తున్న చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను గట్టిగా ఎదుర్కొవాలి.వారి హిందూత్వ ప్రచారాలకు మోసపోకుండా సెప్టెంబరు 17ని విద్రోహ దినంగానే జరపాలని ప్రజలను సీపీఐ (ఎం-ఎల్‌) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కోరుతున్నది.
– అశోక్‌, రాష్ట్ర కార్యదర్శి
 సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ      
తెలంగాణ రాష్ట్ర కమిటీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page