‘‘తెలంగాణకు విమోచనమే జరిగితే తెలంగాణ సాయుధ పోరాటంలో లక్షలాదిమంది త్యాగాలు ఎందుకు జరిగినట్లు..? నెహ్రు పటేల్ నేతృత్వంలో హైదరాబాద్ దురాక్రమణకు ఒడిగట్టింది నిజం కాదా..! నిజంగా హైదరాబాద్ రాజ్యం భారతదేశం లో విలీనేమే జరిగితే హైదరాబాద్ ప్రజలకు-భారత ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ఏమైనా ఉందా..! ప్రజలు విలీనం చేసుకోమని ఆహ్వానించారా..! చరిత్ర లో అలాంటి పరిణామాలు ఎక్కడ కూడా జరగలేదు. ప్రపంచంలోనే అత్యంత సిరిసంపదలు కలిగిన రాజ్యాలలో హైదరాబాద్ ఏడవ రాజ్యం. అలాంటి సంపద ఉన్న హైదరాబాద్ ప్రాంతాన్ని ఎలాగైనా ఆక్రమించుకోవాలని సైనిక చర్య ద్వారా దురాక్రమణకు పాల్పడిందనేది చారిత్రక వాస్తవం. అంతిమంగా హైదరాబాద్ రాజ్యానికి జరిగినది ముమ్మాటికి విద్రోహమే.’’
ప్రపంచ పటంలో హైదరాబాద్ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది.తెలంగాణ గడ్డమీద జరిగిన సాయుధ రైతాంగ పోరాటం పీడిత ప్రజల ఆత్మగౌరవానికి ప్రతిబింబం.పోరాటం ప్రజలది,త్యాగాలు ప్రజలవి, చరిత్ర ప్రజలది …కాని పాలకులు తమదే చరిత్ర అన్నట్లు గా వ్యవహరిస్తున్నారు.కాబట్టి సెప్టెంబర్17 పైన పూడిక తీయాల్సిన బాధ్యత తెలంగాణ పౌర సమాజం పై ఉంది. సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినది..నిజామ్ పాలన కింద 224 సంవత్సరాలకు పైబడి తెలంగాణ ప్రజలు కఠోరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు.ప్రజలు సామాజిక పీడనలను అనుభవిస్తూ దుర్భరమైన జీవితాలను కొనసాగించారు.తెలంగాణ లో ఉన్న భూస్వాములు,దేశ్ ముఖ్ లు,దేశ్ పాండే లు జమిందారులు,జాగీర్ధారులు నిజామ్ అననూయులుగా కొనసాగుతూ పీడిత ప్రజల పై దాష్టీకాలు కొనసాగించారు.తెలంగాణ భూస్వాములు ఆర్ధిక దోపిడి కి అడ్డు అదుపు లేదు.సామాజిక వివక్షతలను నిరంతరాయంగా కొనసాగించారు.అనేక వృత్తుల వారు శారీరక, సామాజిక పీడనలను అనుభవించారు. నిజామ్ పాలన లో 1920-22,1930-33 సంవత్సరాలలో తీవ్రమైన కరువు కాటకాలతో తెలంగాణ లో సంక్షోభం ఏర్పడింది.పన్నులు కట్టలేని రైతుల భూములను బలవంతంగా జమీందారులు తమ ఆధీనంలో కి తెచ్చుకుంటున్నారు.ఇలా సూర్యాపేట జిల్లాలో ఎర్రబాడు జమీందారు లక్షా యాభై వేల ఎకరాలు , మరొక జమీందారు విస్నూరు రామచంద్రారెడ్డి నలభై వేల ఎకరాలు స్వాధీనం లోకి తెచ్చుకున్నారు.
1929 నాటికి ఆహార సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా చుట్టుముట్టింది.అప్పటికే తెలంగాణ లో వాణిజ్య పంటలకు ప్రత్యేకత ప్రాధాన్యత ఏర్పడి ఉంది.ఇందులో భాగంగానే వేరుశనగ ,ఆముదం అత్యధిక విస్తీర్ణంలో సాగు అయ్యింది. ఆముదం ఎగుమతి బాగా పెరిగింది..ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.కాని’’ఆహార సంక్షోభం’’ మూలంగా అనతికాలంలోనే వాణిజ్య పంటలపై తీవ్రమైన ప్రభావం చూపి అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ తగ్గింది.ప్రజల ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తమయారైంది.కష్ఠ కాలంలో ప్రజలను ఆదుకోవాల్సింది పోయి దీనికి తోడు శిస్తులు అధికం అయ్యాయి.రైతాంగం అధికమైన శిస్తుల భారంతో కుటుంబాలు చితికి పోయాయి. అధిక భారాన్ని భరించలేని రైతులు, వ్యవసాయ కూలీలు ఆకలి మంటలతో,మాడిన కడుపులతో భూస్వాములకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం,వెట్టిచాకిరి నుండి విముక్తి కోసం ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో పోరాటం ప్రారంభించారు.
1944 నాటికి తెలంగాణ లోని గ్రామాలు ‘‘సంఘం’’,ఆంధ్ర మహాసభ అధ్వర్యంలో అనేక రాజకీయ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు.అప్పటికే నిజామ్ నిరంకుశ పాలన లో భాగస్వాములైన హిందూ భూస్వాములు లక్షల ఎకరాలకు అధిపతులయ్యారు.గడీల పాలన ఉత్కృష్ట రూపం దాల్చింది.మెజారిటి ప్రజలు భూ స్వాముల ఆగడాలకు ఆగమైనవారే.కాని ఎప్పటికప్పుడు ‘‘సంఘం’’ అధ్వర్యంలో పీడిత ప్రజలకు భరోసానిచ్చేవారు.ఆంధ్రమహాసభలు ప్రజలకు నిరంతరం జాగురకతను చేసేవి. తెలంగాణ లోనిజామ్ పాలనలో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు ఉండేవి కావు.సంఘం రహాస్యంగా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేసేది.1946 నాటికి దేశ్ ముఖ్ లకు వ్యతిరేకంగా సాగిన నిరసన యాత్ర లో పోలీస్ పటేల్ మష్కిన్ అలీ కాల్పుల్లో ‘‘దొడ్డి కొమురయ్య’’మరణించారు.కొమురయ్య అమరత్వం స్ఫూర్తి తో ఈ దొరలను,భూస్వాములను, నిజామ్ ను ఎదుర్కొనడానికి పీడిత ప్రజలు సాయుధ పోరు అత్యావశ్యకం అని ప్రారంభించారు.
ఈ పోరులో నిజామ్ నిరంకుశత్వాన్ని, జమీందారుల దౌర్జన్యాన్ని ఖండిస్తూ తెలంగాణ కళాలు, గళాలు నిత్య నిరసనను కొనసాగించాయి.ఒక వైపు దేశ విభజన,మరొక వైపు తెలంగాణ లో నిజామ్ అననూయులైన భూస్వాములు,దేశ్ ముఖ్ లకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం కొనసాగుతుంది.ఈ నేపథ్యంలో నే 1946 సెప్టెంబర్ 11 న సంఘం అధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రారంభమైనది.ఒక వైపు దేశ విభజన మరొక వైపు హైదరాబాద్ రాజ్యంలో సాయుధ పోరు ప్రారంభమైంది.స్వాతంత్య్ర ప్రకటన తర్వాత హైదరాబాద్ నిజామ్ రక్షణ తంత్రం ప్రయోగించాలనుకున్నారు. అప్పటికే ఖాసిం రజ్వీ సైన్యం తెలంగాణ పల్లెల్లో దౌర్జన్యం ఖాండ కొనసాగిస్తున్నారు.భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యాన్ని ఏలాగైనా తమలో భాగం చేసుకోవాలనే ఆలోచనలను చేస్తున్నారు.అప్పటికే కాశ్మీర్,జూనాఘడ్ లను తమలో భాగం చేసుకున్నారు.సర్ధార్ పటేల్ హైదరాబాద్ మీద ఉన్నంత ఉత్సుకత కాశ్మీర్ విషయంలో లేదని చెప్పాలి.మౌంట్ బాటెన్ 1948 జూన్ లో భారతదేశం విడిచి వెళ్ళాడు.అప్పటివరకు నెహ్రూ, పటేల్ అతనికి గౌరవం ఇచ్చేవారు.ఈ క్రమంలో హైదరాబాద్ రాజ్యంపై పటేల్ ఒక నిర్ణయానికి వచ్చారు. చైనా దేశపు అనుభవాలను ద్రష్టిలో పెట్టుకుని భారతదేశంలో కమ్యూనిస్టులను అణిచివేయాలన్న అంతర్గత ఆలోచనతో పైకి మాత్రం నిజామ్ మరియు ఖాసిం రజ్వీ పై దాడి ఆలోచనలు ప్రారంభించారు.అప్పటికే నిజామ్ తన ‘‘ప్రధానుల’’ ద్వారా భారత ప్రభుత్వం ఆధిపత్యం చేయాలనే ఆలోచనలను భద్రతామండలి కి ఫిర్యాదు చేశారు. నిజామ్ చెపితే వినే వ్యక్తి జిన్నా.కాని అకస్మాత్తుగా జిన్నా మరణం నిజామ్ వెన్ను విరిచింది.భద్రతా మండలి లో చర్చ వచ్చేలోగా భారత యూనియన్ సైన్యాలు బలవంతపు దురాక్రమణ కు హైదరాబాద్ రాజ్యాన్ని మూడువైపులా నుండి 1948 సెప్టెంబర్ 13 న చుట్టు ముట్టాయి.అప్పటికే రజ్వీ సైన్యాలు గ్రామాలపై పడి స్త్రీ లను వివస్త్రలను చేసి వారిని బలవంతగా లోబర్చుకుంటున్నారు.
ఆ సందర్భంలో నిజామ్ నిజాంనిరంకుశత్వాన్ని, రజాకార్ల దౌర్జన్యాన్ని ఖండిస్తూ తెలంగాణలో అనేక రకాల సాహిత్యం, కవిత్వాలు ప్రజలను చైతన్యవంతం చేశాయి.దాదాపుగా ఐదు రోజుల పాటు కొనసాగిన భారత ప్రభుత్వం సైనిక దాడిలో ( ఆపరేషన్ పోలో )1948 సెప్టెంబర్ 17 న నిజాం లొంగుబాటును భారత ప్రభుత్వం ప్రకటించింది.
నిజామ్ లొంగుబాటు, రజ్వీ ఆగడాలు అరికట్టడమే అంతిమ లక్ష్యం భారత ప్రభుత్వానిదైతే 1951 వరకు భారత ప్రభుత్వం సైన్యాలు ఎవరి మీద దాడి కొనసాగించినట్లు…? తెలంగాణ నాయకత్వం అనుమతి లేకుండా ఆంధ్ర నాయకత్వం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట విరమణ ప్రకటన చేశారు..? ఎవరి కోసం చేసినట్లు..? ఇంతటి మహత్తరమైన పోరాటంలో జరిగిన పరిణామాల గూర్చి నెహ్రూ స్నేహితుడైన పండిట్ సుందర్ లాల్ గుడ్ విల్ మిషన్ పేరుతో తెలంగాణ పల్లెల్లో తిరిగి అందరిని అడిగి తెలుసుకున్న వివరాల ఆధారంగా అధికారికంగా 27000 నుండి 40000 మందికి పైగా,అనధికారికంగా రెండు లక్షలకు పైగా అనేక తాడిత పీడిత ప్రజలు మరణించారని తన కమిటీ నివేదిక లో చెప్పారు. సంఘ్ పరివార్ శక్తులు వాదిస్తున్నట్లు విమోచనమైతే ఈ గడ్డపై ఇన్ని త్యాగాలు ఎందుకు జరిగినట్లు..?
ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు విమోచనమని..!విలీనమని..! చరిత్రను వక్రీకరించేవిధంగా అర్థ రహితమైన వాదనలు చేస్తున్నారు.ఏనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మచ్చుకు కానరాని ఆర్.ఎస్.ఎస్,బి.జె.పి (ఆర్యసమాజ్ తప్ప) హైదరాబాద్ విషయంలో ఉన్న ఉరుకులాట.. కాశ్మీర్ విషయంలో ఎందుకు లేదు..? అనే ప్రశ్నకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. నిజామ్ నిజాంలొంగుబాటు తర్వాత అతనికి కావలసిన భరణాన్ని 1948 సెప్టెంబర్ 18 నుండి 1950 జనవరి 25 వరకు రాజు గా నిజామ్ పేరు మీద హైదరాబాద్ పాలన కొనసాగింది.రాజ్ ప్రముఖ్ గా హోదాను ( 1950-1956 ) అనుభవించారు.ఖాసిమ్ రజ్వీని ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష తర్వాత సాదరంగా తాను కోరుకున్న చోటికి భారత ప్రభుత్వం పంపించింది.అలాగే రజ్వి సైన్యం పై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నిజామ్ , ఖాసిమ్ రజ్వీ సైన్యం దాడిలో మరణించిన వారికంటే కమ్యూనిస్టు ల ఏరివేత పేరుతో భారత యూనియన్ సైన్యం చేతిలో ఎక్కువగా ప్రజలు మరణించారనేది చరిత్ర చెపుతున్న సత్యం .ఇదే తరహాలో జె.ఎన్ చౌదరి ,వెల్లోడిల కాలంలో తీవ్ర మారణహోమం జరిగింది.
తెలంగాణకు విమోచనమే జరిగితే తెలంగాణ సాయుధ పోరాటంలో లక్షలాదిమంది త్యాగాలు ఎందుకు జరిగినట్లు..? నెహ్రు పటేల్ నేతృత్వంలో హైదరాబాద్ దురాక్రమణకు ఒడిగట్టింది నిజం కాదా..! నిజంగా హైదరాబాద్ రాజ్యం భారతదేశం లో విలీనేమే జరిగితే హైదరాబాద్ ప్రజలకు-భారత ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ఏమైనా ఉందా..! ప్రజలు విలీనం చేసుకోమని ఆహ్వానించారా..! చరిత్ర లో అలాంటి పరిణామాలు ఎక్కడ కూడా జరగలేదు. ప్రపంచంలోనే అత్యంత సిరిసంపదలు కలిగిన రాజ్యాలలో హైదరాబాద్ ఏడవ రాజ్యం. అలాంటి సంపద ఉన్న హైదరాబాద్ ప్రాంతాన్ని ఎలాగైనా ఆక్రమించుకోవాలని సైనిక చర్య ద్వారా దురాక్రమణకు పాల్పడిందనేది చారిత్రక వాస్తవం. అంతిమంగా హైదరాబాద్ రాజ్యానికి జరిగినది ముమ్మాటికి విద్రోహమే.
– పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192