ఈనాటి నాయకులు, ప్రభుత్వాలు గతంలో ఎవరూ ఏమీ చేయలేదని, జరిగినదంతా అభివృద్ధి కాదని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. ఇది శాస్త్రవేత్తల స్వార్థ రహిత కృషిని, ప్రగతిని, ఫలితాలను చిన్నచూపు చూడటం అవుతుంది. అంతేకాకుండా అశాస్త్రీయ భావాల ప్రచారం ప్రజల్లో ఊపందుకుంటోంది. ప్రజల సొమ్ముతో నడిచే విశ్వవిద్యాలయాల్లో అశాస్త్రీయ జ్యోతిష్యాన్ని (ఆస్ట్రాలజీ), భూత వైద్యాన్ని పాఠ్యాంశాలుగా ప్రవేశపెడుతున్నారు. పురాణ గ్రంథాల్లో ఉన్న అంశాలను నిజమైన సైన్స్ అని ప్రచారం చేయడానికి సూడో సైంటిస్టులు పూనుకుంటున్నారు. దీనివల్ల గత కాలపు సైన్స్ ప్రగతికి అవరోధం ఏర్పడి, మున్ముందు సైన్స్ అభివృద్ధికి విఘాతం ఏర్పడుతుంది.
మనకు స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతోంది. ఈ 75 ఏళ్లలో శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం ప్రపంచంలో మొదటి మూడు ర్యాంకుల్లో స్థానం సంపాదించిందంటే దానికి కారణం స్వాతంత్య్రం తొలి రోజుల్లో ఆనాటి నాయకులు, శాస్త్రవేత్తలు ప్రభుత్వం ఆధ్వర్యంలో వేసిన సైన్స్ పునాదిరాళ్లే కారణం. ఆధునిక దేవాలయాలుగా పేర్కొన్న నాగార్జునసాగర్ ఇతర సాగునీటి పథకాలు, అనేక జాతీయ శాస్త్ర పరిశోధనా సంస్థలు ఉన్నాయి. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం తదితర స్వయం సాధికారత ఆహార పథకాల్లో ముందడుగు వేశాం. అలాగే ఉన్నతస్థాయి విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ రంగంలో అనేక ఫ్యాక్టరీలు, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఇవన్నీ భారత శాస్త్ర, సాంకేతిక రంగానికి గట్టి పునాది. ఇవన్నీ మహత్తరమైన సైన్స్ సౌధ నిర్మాణానికి, దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేశాయు టెలికం రంగంలోనూ..
అదేవిధంగా టెలికాం రంగం కూడా స్వాతంత్య్రం తరువాత సాంకేతికత కోసం ఇతర దేశాలపై ఆధారపడి ఉండేది. ఒక ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్ కోసం సంవత్సరాల తరబడి నిరీక్షించేవారు. టెలికం రీసెర్చ్ సెంటర్ (టిఆర్‌సి) ద్వారా కీలకమైన అభివృద్ధి సాధించి, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఐఐటిల సంయుక్త ఆధ్వర్యంలో సి-డాట్ సాంకేతికతలో అభివృద్ధి సాధించి, దేశంలో పల్లె పల్లెకు ల్యాండ్‌లైన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సి-డాట్ టెక్నాలజీని మనదేశం ఇతర దేశాలకు అందించింది. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సమాచార సాంకేతిక) రంగంలో ఐబిఎం, ఐసిఎల్ రెండు బహుళజాతి సంస్థల హవా నడిచేది. మన దేశంలో డేటా ప్రాసెసింగ్ మిషన్లను రైల్వేలు, మిలిటరీ విభాగాల్లో వాడేవారు. ఈ విదేశీ సంస్థలు పాత మిషన్లను మనకు పంపి, అధిక అద్దెలు వసూలు చేసేవారు. 1970లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఏర్పాటయ్యింది. ప్రభుత్వరంగ సంస్థలు ఇసిఐఎల్ (ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ఏర్పాటుతో భారతదేశంలో సొంతంగా కంప్యూటర్ తయారీ సులభమైంది.
ఈనాటి నాయకులు గత 75 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధీ చెందలేదని, ఈనాడు చేస్తున్న అభివృద్ధే నిజమైనదని పేర్కొనడం హాస్యాస్పదం. ఈనాడు వేల కోట్ల రూపాయలతో నిలువెత్తు విగ్రహాలు, మందిరాలు, భవనాలు కడుతూ సైన్స్ పరంగా అభివృద్ధి చెందడం ఆగి, తిరోగమనం వైపుగా సాగుతున్న నేపథ్యంలో గత కాలపు సైన్సు పునాదులపై నిర్మించుకున్న ఈ సైన్స్ సౌధాన్ని నిలబెట్టుకొందామా? వదిలేసుకుందామా? అన్న ప్రశ్న మొదలవుతోంది.ఐఎన్‌ఎస్ విక్రాంత్ అతిపెద్ద స్వదేశీ యుద్ధనౌక. 46 వేల కోట్ల రూపాయల వ్యయంతో.. పూర్తి భారతీయ సాంకేతికతతో మనదేశంలోనే తయారైన ఈ నౌక గతవారం జలప్రవేశం చేసింది. 2022 నాటికి మన నౌకాదళంలో విమాన వాహక యుద్ధనౌకగా ప్రవేశం చేయబోతోంది. ఇది మనదేశ శాస్త్ర సాంకేతిక ఘనత. ఈ నౌక నిర్మాణానికి బీజం 2009లో పడితే అసలైన పునాది స్వాతంత్య్రం తొలినాళ్లలోనే పడింది. కాబట్టి మనం చూస్తున్న అభివృద్ధంతా ఈనాటిది కాదు. 75 ఏళ్ల నుంచి నిరంతరం జరుగుతున్న అభివృద్ధి మాత్రమే.
ఐన్‌స్టీన్ మహాశయుడు ‘ఈనాటి నా అంతః బాహ్య సౌకర్యవంతమైన జీవితమంతా కొన్ని వందల ఏళ్ల అనేకమంది శ్రమజీవుల ఫలితమే. ప్రతిరోజూ వారిని స్మరిస్తూ ఉంటాను’ అన్నారు. అలాగే మన అభివృద్ధి గత 75 ఏళ్లపాటు నిరంతరం జరుగుతూ వస్తున్నదే. దీనిని ఒకసారి మనమంతా సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రపంచంలో 1945-50 మధ్య దాదాపు వందకుపైగా దేశాలు వలసపాలన నుండి స్వాతంత్య్రం పొంది, స్వతంత్ర దేశాలుగా అవతరించాయి. కానీ వీటిలో శాస్త్రీయ పరిశోధన, అభివృద్ధి ద్వారా దేశ నిర్మాణానికి పెద్దపీట వేసిన కొద్ది దేశాల్లో భారత్ ఒకటి. ఆధునిక భావాలు, హేతువాద దృక్పథం, ప్రపంచ అవగాహన గల ఆనాటి నాయకులు, ప్రభుత్వం ఆధ్వర్యంలో శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ధి చేశారు. ఆవిధంగా దేశప్రగతికి గట్టి పునాది వేశారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి భారతదేశం వివిధ రంగాల్లో స్వావలంబన, సాధికారత సాధించింది.
ఈ అభివృద్ధి స్వాతంత్య్రం తరువాత మనదేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తగిన ఆర్థిక వనరులను సమీకరించడం ద్వారా జరిగిన ప్రయోగ ఫలితాలే. భారతదేశం ఆధునికంగా ఎదగడానికి ఉన్నత విద్య, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధే ముఖ్యమని ఆనాటి నాయకులు భావించారు. ఈ రంగానికి స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) లో 0.1 శాతం మాత్రమే కేటాయించారు. కానీ దశాబ్ది కాలంలో ఈ కేటాయింపులు 0.5 శాతానికి పెరిగింది. శాంతి స్వరూప్ భట్నాగర్, హోమీ జహంగీర్ బాబా, మహలనోబిస్ తదితర ప్రఖ్యాత శాస్త్రవేత్తలు అనేక పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేశారు. అంతేకాక ఎన్నో ప్రభుత్వ పథకాలు రూపొందించారు.
ప్లానింగ్ కమిషన్ 1950లో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి పునాది వేసింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్‌ఐ) అనేక ప్రయోగాలు చేసింది. పొట్టి రకాల వరి వంగడాలు కనుగొనడం ద్వారా, భూ సంస్కరణలు, ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా ఆహారధాన్యాల ఉత్పత్తి 34 మిలియన్ టన్నులు పెరిగింది. సాగు భూమి 45 మిలియన్ ఎకరాలకు విస్తరించింది. అంతవరకూ ఆహారధాన్యాల కొరకు ఇతర దేశాలపై ఆధారపడ్డ మనదేశం స్వయం సమృద్ధి సాధించింది. దీనినే ‘’హరిత విప్లవం’’ అని పేర్కొన్నారు. విద్యుదుత్పత్తి 79 మిలియన్ కిలో వాట్లకు పెరిగింది. కానీ అధిక జనాభా పెరుగుదల ఈ అభివృద్ధిని సమానం చేయడం వల్ల మిగులు ఏర్పడలేదు.
ఆహారోత్పత్తిలో..
స్వాతంత్య్రానంతరం ఆహారధాన్యాల తర్వాత పాల ఉత్పత్తులు కూడా పెరిగాయి. అంతవరకూ ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న స్థాయి నుండి పాల ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధిని సాధించారు. వర్గీస్ కురియన్ ఆధ్వర్యంలో యువ ఇంజనీర్ హరిచంద్ దలియ ప్రపంచంలో మొదటిసారి గేదె పాలను పొడిగా తయారుచేసే సాంకేతికతను అభివృద్ధి చేశారు. దీంతో పాల ఉత్పత్తులు పెరిగి మధ్య, దిగువ మధ్యతరగతి పిల్లల్లో పాల వాడకం పెరిగింది. దీనివల్ల తరువాతి సంవత్సరాల్లో పిల్లలు శారీరకంగా, విజ్ఞానపరంగా చాలా సామర్థ్యం గల వారుగా అభివృద్ధి చెందారు.
ప్రభుత్వం నుంచి ప్రైవేటుకు..
స్వాతంత్య్రం వచ్చేనాటికి మనదేశంలో అక్షరాస్యత 12.9 శాతం ఉంది. జీవన ప్రమాణం 32 సంవత్సరాలు. దారిద్రరేఖ దిగువ 80 శాతం మంది ప్రజలు ఉండేవారు. 75 ఏళ్లలో ఆర్థిక రంగం ట్రిలియన్ డాలర్లకు అభివృద్ధి చెందింది. అంతేకాదు ప్రపంచంలోనే ఏడో అతిపెద్ద దేశంగా అవతరించింది. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం అక్షరాస్యత 74.4%, జీవన ప్రమాణం 70 ఏళ్లు. దారిద్ర రేఖకు దిగువన ఆరు శాతం ప్రజలు ఉన్నారు.
మన దేశంలో అసలైన సైన్సు ప్రగతి 1950 నుండి 1975 వరకూ అత్యున్నతంగా జరిగింది. అభివృద్ధి అంతా ప్రభుత్వరంగ సంస్థల ద్వారా, భారత ప్రజల పట్ల అంకితభావం గల తొలినాటి శాస్త్రవేత్తల ద్వారా జరిగింది. కానీ 1975 తర్వాత మనదేశంలో సైన్సు అభివృద్ధి కుంటుపడిందనే చెప్పాలి. దీనికి కారణాలు అనేకం. ప్రభుత్వాలు సైన్స్ అభివృద్ధికి ఇచ్చే నిధుల్లో కోత విధించడం, నయా ఉదారవాద విధానం, పేటెంట్ విధానం వల్ల ప్రైవేటు, కార్పొరేట్ శక్తులు సైన్స్ రంగంలో ప్రవేశించాయి. ప్రైవేటు శక్తుల స్వార్థ ప్రయోజనాలకోసం ప్రజావసరాల పట్ల శీతకన్ను వేయడం వల్ల సైన్స్ అభివృద్ధి కుంటుపడింది. నిలకడలేని ప్రభుత్వాలు, ప్రపంచ బ్యాంకు ఐఎంయఫ్ వల్ల కూడా సైన్స్ అభివృద్ధి కుంటుపడింది.
ప్రైవేటు సంస్థలే సైన్స్ అభివృద్ధి చేయాలంటున్నారు. కానీ అవి ఏమీ చేయటం లేదు. ఉదాహరణకు కోవిడ్‌ను ఎదుర్కోడానికి వాక్సిన్ కోవాగ్జిన్‌ను కనుగొనడంలో ముఖ్యపాత్ర వహించింది.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ‘ఐసిఎంఆర్’, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ‘ఎన్‌ఐవి’ వారు కనుగొన్న వ్యాక్సిన్ తయారీ మాత్రం ప్రైవేట్ సంస్థ భారత్ బయోటెక్ కట్టబెట్టింది ఈ ప్రభుత్వం. వారు దాన్నే అధిక లాభాలతో ప్రభుత్వానికి వ్యాక్సిన్‌ను అమ్మారు. పైపెచ్చు కోవిడ్‌ను ఎదుర్కోవడంలో సరైన శాస్త్రీయ ఆచరణ లేకపోవడంతో ఇంకా అందరికీ టీకాలు వేయడంలో చాలా వెనుకబడే ఉన్నాము.
అశాస్త్రీయ భావాల ప్రచారం..
ఇదిలా ఉంటే ఈనాటి నాయకులు, ప్రభుత్వాలు గతంలో ఎవరూ ఏమీ చేయలేదని, జరిగినదంతా అభివృద్ధి కాదని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. ఇది శాస్త్రవేత్తల స్వార్థ రహిత కృషిని, ప్రగతిని, ఫలితాలను చిన్నచూపు చూడటం అవుతుంది. అంతేకాకుండా అశాస్త్రీయ భావాల ప్రచారం ప్రజల్లో ఊపందుకుంటోంది.
ప్రజల సొమ్ముతో నడిచే విశ్వవిద్యాలయాల్లో అశాస్త్రీయ జ్యోతిష్యాన్ని (ఆస్ట్రాలజీ), భూత వైద్యాన్ని పాఠ్యాంశాలుగా ప్రవేశపెడుతున్నారు. పురాణ గ్రంథాల్లో ఉన్న అంశాలను నిజమైన సైన్స్ అని ప్రచారం చేయడానికి సూడో సైంటిస్టులు పూనుకుంటున్నారు. దీనివల్ల గత కాలపు సైన్స్ ప్రగతికి అవరోధం ఏర్పడి, మున్ముందు సైన్స్ అభివృద్ధికి విఘాతం ఏర్పడుతుంది.
స్థిరమైన అభివృద్ధి లక్ష్యం (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్) ప్రపంచ పట్టికలో డెన్మార్క్ మొదటి స్థానంలో ఉంటే మనం 117వ స్థానంలో ఉన్నాం. ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ (ఇ.పి.ఐ) లో పర్యావరణము, ఆరోగ్యము, వాతావరణం కాలుష్యం, పరిశుభ్రత, తాగునీరు, జీవవైవిధ్యం, ఎకో సిస్టం తదితర అంశాల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా చేసిన లిస్టులో 180 దేశాలలో మన స్థానం 168. పరిశోధనా సంస్థలకు సరిగ్గా నిధులు ప్రభుత్వం కేటాయించడం లేదు.ఇది చాలదన్నట్లు కుహనా శాస్త్రవేత్తలు సూడో సైన్స్ ప్రచారం మొదలు పెడుతున్నారు. సాక్షాత్తు యూనివర్సిటీ కులపతులే మత గ్రంథాల్లోని విషయాలను సైన్స్‌గా ప్రచారం చేస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో భూత వైద్యం, జ్యోతిష్యశాస్త్రం ప్రవేశపెడుతున్నారు. వీటికి కేంద్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటోంది.మదనపల్లిలో విద్యావేత్తలు, అధ్యాపకులు అయిన తల్లిదండ్రులు తమ చేతులారా తమ ఇద్దరు కూతుళ్లనూ చంపుకోవడం, ఐఐటీ క్యాలెండర్‌లో చరిత్రను వక్రీకరించడం, ఓ ఐఐటి ప్రొఫెసర్ ‘మంత్రాలతో దెయ్యాలను పారద్రోలాను’ అని చెప్పడం. ఇవన్నీ భారత శాస్త్రాభివృద్ధిని మసకబారుస్తోంది. అంతర్జాతీయంగా భారతీయ సైన్స్ అభివృద్ధి మరుగునపడుతూ చిన్నచూపుకు గురవుతోంది. మధ్యయుగాల వైపుగా తిరోగమనంలో మన దేశం పయనిస్తోంది.
ప్రభుత్వ తిరోగమన చర్యలు..
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశాన్ని శాస్త్రీయపరంగా వెనక్కి తీసుకుపోతోంది. ఈ తిరోగమనంలో సైన్స్‌ని కాదని కుహనా సైన్స్‌కు పట్టం కడుతోంది. దీనివల్ల అభివృద్ధి ఆగిపోవడమే కాక, గతంలో సాధించిన అభివృద్ధినీ ధ్వంసం చేస్తోంది. పైగా ఈ ధ్వంసరచనే అభివృద్ధి అని ప్రచారం చేస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. దీనివల్ల కలిగే నష్టం అపారం. దేశ ప్రజలు మతపరంగా చీల్చబడుతున్నారు. ఈ మత వైరస్ కళాశాలల్లోనూ ప్రవేశిస్తోంది. ప్రజలు అనైక్యతతో కునారిల్లుతుంటే ఆ దేశం ఏవిధంగా అభివృద్ధి సాధిస్తుంది? సైన్స్ పరంగా ఎలాంటి ప్రగతి పొందుతుంది ?దేశంలోని శాస్త్రవేత్తలు, విజ్ఞానవంతులు గతంలో జరిగిన శాస్త్రీయ అభివృద్ధిని వివరిస్తూ ‘’ఇంతవరకూ మనం చూస్తున్న మొత్తం ప్రగతి గతంలో శాస్త్రవేత్తలు, నాయకులు చేసినటువంటి కృషి ఫలితమే…’’ అని గళం విప్పి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇన్ని ఏళ్ల శాస్త్ర సాంకేతికాభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందేటట్లు చేయాలి. వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు తగిన కార్యాచరణ కోసం మేధావులందరూ పూనుకోవాలి.తిరోగమనంలో ఉన్న భారతీయ శాస్త్రీయ రంగాన్ని తిరిగి ప్రగతిపథం వైపు నడిపించాలి. రాబోయే కాలంలో దేశం మరింతగా శాస్త్ర, సాంకేతిక, శాస్త్రీయ దృక్పథంతో సమ సమాజం వైపు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిద్దాం.
ఉక్కు నుంచి ఉపగ్రహాల వరకూ..
చైనాతో 1962లో అనుకోని యుద్ధం వల్ల మిలిటరీ రంగంలో అభివృద్ధికి ఆవశ్యకత పెరిగింది. సోవియట్ యూనియన్ సహకారంతో ఆ రంగంలో తరువాత సంవత్స రాలలో అభివృద్ధి సాధించి, ఆయుధ సంపత్తిని పెంచుకొంది మనదేశం. 1973లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ రెండు వేల కోట్ల మూలధనంతో ఏర్పాటయ్యింది. ఒకేసారి దేశవ్యాప్తంగా ఐదు స్టీల్ ప్లాంట్స్, బిలాయి, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా, బరంపూర్‌లో స్టీల్‌ప్లాంట్స్ నిర్మించారు. దీంతో దేశానికి అవసరమైన ఉక్కు అందుబాటులోకి వచ్చింది. విశాఖలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, సేలంలో అల్లాయి స్టీల్‌ప్లాంట్ నిర్మాణం జరిగింది.
ఇవన్నీ సాకారం కావడానికి కావలసిన మేధోసంపత్తికి పునాదిగా మే 18, 1951లో తొలి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐటి) పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్పూర్‌లో అప్పటి విద్యాశాఖమంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఏర్పాటు చేశారు. తరువాత ముంబయి, చెన్నై, కాన్పూర్, ఢిల్లీలో ఐఐటిలు ఏర్పాటు చేశారు. తరువాత ఆర్‌ఇసి (రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ) లు ఏర్పడి, ప్రస్తుతం ఎన్‌ఐటి (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) గా ఉన్నాయి. 1960 ప్రాంతంలో సోవియట్ యూనియన్ సహకారంతో తుంబ రాకెట్ కేంద్రం ఏర్పాటు చేశారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఐఎస్‌ఆర్‌ఓ) ఏర్పాటు చేసి, 1975లో భారత తొలి ఉపగ్రహం ఆర్యభట్టను సోవియట్ యూనియన్ నుంచి ప్రయోగించారు. ఆ తరువాత అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన ప్రగతి మనందరికీ తెలిసిందే. ఏకధాటిగా ఒకేసారి 104 కృత్రిమ ఉపగ్రహాలను కక్ష్యలో నిలబెట్టింది ఇస్రో. చంద్రుడు, అంగారకుడు (మార్స్) పైకి ఉపగ్రహాలను పంపే స్థాయికి ఎదిగాం. సోవియట్ యూనియన్ సహకారంతో రాకేష్ శర్మను అంతరిక్షంలోకి పంపించాం. చంద్రయాన్, మంగళయాన్ కార్యక్రమాలను నిర్వహించింది. గగన్‌యాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సొంత జిపిఎస్ (జియో పొజిషనింగ్ సిస్టం) ను ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
తిరోగమనంలో ఔషధరంగం..
భారతదేశం ‘’ప్రపంచ ఔషధాగారం’’ (ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్)గా ఎదిగి అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలకు అందుబాటు ధరల్లో మందులను అందిస్తోంది. 1954లో హిందుస్థాన్ యాంటీ బయోటిక్ లిమిటెడ్ ప్రారంభించి తర్వాత ఐడిపిఎల్ (ఇండియన్ డ్రగ్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్) సోవియట్ యూనియన్ సహకారంతో నిర్మించబడింది. ఈ ప్రభుత్వ రంగ సంస్థ, ఇతర భారతీయ ప్రైవేటు సంస్థలు అనేక ప్రయోగాలు చేసి మందులు, జెనరిక్ మందులను తయారు చేశాయి. దీంతో మందుల తయారీలో అంతవరకూ విదేశీ కంపెనీల ఏక ఛత్రాధిపత్యానికి అడ్డుకట్ట వేసి, భారత్ స్వయం సమృద్ధిని సాధించింది.కొరోనా ఎదుర్కోవడంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. మనదేశంలో టీకా తయారీ చేయగలిగిన ఆరు ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. అయితే వాటిని విస్తృతపరచకుండా ప్రభుత్వ నిధులతో ఐసిఎంఆర్ సహకారంతో దేశంలోనే అభివృద్ధి చేసిన కోవాక్సిన్‌పై తప్పనిసరి లైసెన్స్‌ను తీసుకోవడం మానుకుంది. ఇప్పటికీ భారత్ బయోటెక్‌ను కోవాక్సిన్ టీకా గుత్తాధిపత్య నిర్మాతగా ఉండటానికి అనుమతిస్తుంది.
ఈ ప్రైవేట్ కంపెనీకి రూ.1,500 కోట్ల మేరకు ప్రజాధనాన్ని వెచ్చించి, సామర్థ్యాన్ని విస్తరించడానికి దాని గుత్తాధిపత్య స్థానం చెక్కుచెదరకుండా ఉండడానికి సహాయపడింది. అలాగే కోవిషీల్డ్ ఉత్పత్తిదారుడైన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు రూ.3,000 కోట్లను విరాళంగా ఇచ్చింది. ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల గుత్తాధిపత్య ప్రయోజనాల కోసం వ్యవహరించడం అనేది ప్రజారోగ్య విధానాన్ని దెబ్బతీయడమే. అలాగే ప్రభుత్వ ఆధీనంలోని ఐడిపిఎల్‌ని నిర్వీర్యం చేయడంతో ప్రజలకు మరింత చౌకగా మందులు లభించకుండా పోయింది. అంతేకాకుండా డబ్ల్యూటిఓతో పేటెంట్ హక్కుల ఒప్పందంలో భాగస్వామి కావటంతో శరవేగంగా ఔషధ రంగంలో దూసుకుపోతున్న భారత్ బహూళజాతి కంపెనీల ఔట్ సోర్సింగ్ మందుల తయారీ కేంద్రంగా మారింది.
– సి. రామరాజు. రాష్ట్ర కమిటీ సభ్యులు. జన విజ్ఞాన వేదిక తెలంగాణ.((AIPSN))9441967100