తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: తాండూరు తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఇండియా సిమెంట్ ప్లాంట్ల పరిసరలలోని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు మరియు గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఆదేశాలను జారీ చేశారు. ఇండియా సిమెంట్ ఉన్నత అధికారి రమేష్ , అధికారులు దక్షిణామూర్తి, పృథ్వీరాజ్ తదితరులు సోమవార హైదరాబాదులోని మంత్రి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. భోకేలతో మంత్రికి సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి అధికారులకు ఇండియా సిమెంట్ పరిశ్రమలున్న తాండూర్ ప్రాంతంలోని ఉద్యోగుల సమస్యలు గురించి వాకాబు చేశారు.ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఇంకెంతకాలం భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవరని గట్టిగా ప్రశ్నించారు. తాండూర్ ప్రాంతంలోని ఇండియా సిమెంట్ తో పాటు ఇతర పరిశ్రమలలో స్థానికులు సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు. అలాగే పరిశ్రమలలో ఉత్పత్తి పెంచి తెలంగాణ రాష్ట్ర ప్రగతికి తోడ్పడాలని అన్నారు. మంత్రి ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తామని ఉన్నతాధికారులు రమేష్, దక్షిణామూర్తి, పృథ్విరాజ్ తెలిపారు. ఇండియా సిమెంట్ కార్మిక సంఘం నాయకుడు కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.