- పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- త్వరలోనే సీఎం కేసీఆర్ తో చర్చించి తీపి కబురు అందిస్తాం
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- కొల్లూరులో మూడో విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు
పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలన్న సమున్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంలో భాగంగా పటాన్ చెరు నియోజకవర్గంలో నిర్మించిన ఇళ్లలో స్థానికులకు 10 శాతం ఇల్లు కేటాయించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి పటాన్ చెరు ప్రజలకు తీపి కబురు అందిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు కేసీఆర్ నగర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిహెచ్‌ఎంసి పరిధిలోని పటాన్ చెరు, నాంపల్లి, గోషామహల్, కూకట్ పల్లి, ఖైరతాబాద్, చార్మినార్ నియోజకవర్గాలకు చెందిన 6067 మంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు రాండమైజేషన్ పద్ధతి ద్వారా ఇళ్లను కేటాయించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్, సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజు జయపాల్ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రూపాయి ఖర్చు లేకుండా, పైసా అప్పు లేకుండా 70 లక్షల రూపాయల విలువైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిరుపేదలకు అందించిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. పూర్తి పారదర్శకతతో ఆశ్రిత పక్షపాతం లేకుండా అర్హులైన లబ్ధిదారులకే వీటిని కేటాయించడం జరిగిందని తెలిపారు.
పటాన్ చెరు నియోజకవర్గం అంటేనే మినీ ఇండియా అని, నిరుపేద ప్రజలు ఎక్కువమంది జీవనం కొనసాగిస్తున్నారని, ఇందుకు అనుగుణంగా స్థానిక కోటాలో 10% ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందని, త్వరలోనే సానుకూల నిర్ణయం రాబోతుందని తెలిపారు. ఇల్లు రాలేని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి సొంతింటి కలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందిస్తూ, గ్రామీణ ప్రాంతాలలో 75 గజాల స్థలాన్ని అందించడంతోపాటు సొంత స్థలం ఉన్నవారికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు నిర్మించుకునేందుకు మూడు లక్షల రూపాయలు అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే నిరుపేదల సంక్షేమానికి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్ ను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సింధు ఆదర్శ్ రెడ్డి, పుష్ప నగేష్, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.