స్వయం పాలనతోనే శాసించుకోగలం

  • నిరంతరం తెలంగాణ కోసం ఉద్యమించిన దీప్తి
  • ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌జయంతి నేడు

వరంగల్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్ 5:‌భవిష్యత్తు తెలంగాణలో అభివృద్ధి చాలా శీఘ్రంగా జరుగుతుంది. నీళ్లలో మన వాటా తేలిన తర్వాత జలవనరుల విషయంలో స్వేచ్ఛ ఉంటుంది. స్వయంపాలనలో శాసిస్తాం. ఇతరుల పాలనలో యాచిస్తున్నాం.పెద్ద ప్రాజెక్టుల సంగతి కాసేపు పక్కన పెడితే.. నిజాం కాలంనాటికే తెలంగాణ ప్రాంతంలో గొలుసు చెరువులు చాలా ఉండేవి. ఉద్దేశ పూర్వకంగానే వాటిని నాశనం చేశారు. తెలంగాణ వస్తే మొదటగా ఈ చెరువులను పునరుద్ధరించాలి. అన్నీ సాధ్యం కాకపోవచ్చు.. అయినా వీటిని బాగుచేస్తే.. గ్రాణ వ్యవస్థ సస్యశ్యామలం అవుతుంది. దివంగత ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌సార్‌ ‌కన్న కలలు ఇవి. తెలంగాణ ఏర్పాటు వల్ల స్వయం సమృద్ది సాధిస్తామని బలంగా నమ్మి, జీవితాంతం తెలంగాన ఏర్పాటు కోసం అహరహరం శ్రమించారు. ఇప్పుడు జలవనరుల విషయంలో తెలంగాణలోని కెసిఆర్‌ ‌ప్రభుత్వం అదే చేస్తోంది. ఇక నిజాం కాలంలో విద్య, వైద్యం రెండూ ఉచితమే.. అయితే వీటన్నింటిని వారు నాశనం చేశారు.

అభివృద్ధి అంటారు కానీ వాళ్లు ఇక్కడ ఒక్క ఆసుపత్రినిగానీ, కాలేజీనిగానీ కట్టారా అని జయశంకర్‌ ‌సార్‌ ‌తరచూ ప్రవ్నించేవారు. తెలంగాణ వస్తే ముఖ్యంగా వనరుల కొరత ఉండదు. ఇప్పుడు వాటిని ఇష్టానుసారంగా, అక్రమంగా తరలించుకుపోతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన పైసలు మనం వాడుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే? ఈ ప్రాంతంలో ప్రజాస్వామిక సంస్క•తిని ఉమ్మడి ప్రభుత్వాలు ధ్వంసం చేశాయి. ఉద్యమాలను అణచివేసే పేరుతో బీభత్సం సృష్టించారు. అడుగడుగున పోలీస్‌ ‌రాజ్యమే ఉంది. అందుకే ప్రజాస్వామిక సంస్క•తి తిరిగి స్థాపించబడాలి. అది జరిగితేనే మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. తెలంగాణలో ఇవన్నీ సాధ్యమే.. ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో ఆ చైతన్యం ఉంది కనుక అని మనసారా నమ్మిన వ్యక్తి దివంగత తెలంగాణ సిద్దాంతకర్త కొత్తపల్లి జయశంకర్‌ ‌సార్‌.

‌తెలంగాణ సిద్దాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ ‌కొత్తపల్లి జయశంకర్‌ ఆగష్టు 6, 1934వ సంవత్సరంలో జన్మించారు. జూన్‌ 21, 2011‌లో తెలంగాణ ఏర్పడకుండానే మరణించారు. హనుమకొండ జిల్లా, ఆత్మకూరు మండలం పెద్దాపూర్‌ ‌గ్రామశివారు అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్‌ ‌తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిస్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్‌-‌ఛాన్సలర్‌ ‌వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్‌ ‌ముల్కీ ఉద్యమంలో, సాంబార్‌- ఇడ్లీ గోబ్యాక్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్‌ 2011 ‌జూన్‌ 21‌న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు. జయశంకర్‌  ‌తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంత్‌రావు.

ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. జయశంకర్‌ ‌తల్లిదండ్రులకు రెండో సంతానం. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోవడమే గాకుండా..తెలంగాణ కోసం నిరంతరం తపించిన ఓ ఉద్యమదీప్తిగా నిలిచారు. బెనారస్‌, అలీగఢ్‌ ‌విశ్వవిద్యాలయాలనుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశాడు. 1975 నుంచి 1979 వరకు వరంగల్‌ ‌లోని సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1979 నుంచి 1981 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజస్ట్రాగా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్‌ ‌రిజిస్ట్రాగా, 1991 నుంచి 1994 వరకు అదే యూనివర్శిటీకి ఉపకులపతిగా పనిచేశాడు.అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో నూరిపోశారు. ఎమ్జన్సీ కాలంలో ఆయన సీకేఎం కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేశారు.

సీకేఎం కళాశాల అంటేనే జిల్లాలో విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా అప్పట్లో పేరుండేంది. విప్లవకవి వరవరరావు లాంటి వాళ్లు ఆ కాలేజీలో అధ్యాపకులుగా వ్యవహరించారు. ఎమ్జన్సీ గడ్డురోజుల్లో ఆయన కళాశాలను నడిపి ఎంతో మంది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని ఆయన నిర్బంధం నుంచి కాపాడారు. ఆయన అధ్యాపకుడిగా హన్మకొండలోని మల్టీపర్సస్‌ ‌స్కూల్లో మొదట తెలుగు బోధించారు. ఒక అధ్యాపకున్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం సర్వసాధారణమే కానీ ఒక అధ్యాపకుడే తన విద్యార్థుల్ని గుర్తుపెట్టుకొని పేరుపెట్టి పిలవడం ఒక్క జయశంకర్‌ ‌కే సాధ్యం అంటూ ఆయనకు తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని, ప్రముఖ సాహీతివేత్త రామశాస్త్రి కన్నీళ్లపర్యంతమయ్యారు. జయశంకర్‌ ‌విద్యార్థుల్లో అనేక మంది దేశవిదేశాల్లో ప్రస్తుతం ప్రముఖ స్థానంలో ఉన్నారు. వీరిలో కేయూ మాజీ ప్రొఫెసర్‌ ఎన్‌. ‌లింగమూర్తి, ప్రొఫెసర్‌ ‌కూరపాటి వెంకటనారాయణ, ప్రొఫెసర్‌ ‌కే. సీతారామావు తదితరులు అనేక మందికి ఆదర్శ గురువు జయశంకర్‌. ‌

తెలంగాణా ఉద్యమంలో 1969 తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1952 లో జయశంకర్‌ ‌నాన్‌ ‌ముల్కీ ఉద్యమంలో, సాంబార్‌, ఇడ్లీ గోబ్యాక్‌ ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ, ఆంధ్ర రాష్టాల్ర విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954 లో ఫజల్‌ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చాడు. కె.సి.ఆర్‌కు సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించాడు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశాడు. తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశాడు. జయశంకర్‌ ‌తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశాడు. విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీదాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తిచేయడంలో ఆయన పాత్ర మరవలేనిది. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్‌.  ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించే మహనీయుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page