స్వాతంత్య్ర అమృత్యోత్సవ వేళ గాంధీ విలవల అమలు – ఒక విశ్లేషణ

‘‘‌చాలా కాలం మతసామరస్యం దేశంలో ఫరిడవిల్లింది. దేశ స్వాతంత్య్ర అనంతరం హిందూ ముస్లింల మధ్య జరిగిన అతి భయానకమైన హింస కోణంలో చూస్తే దేశంలో మత ఘర్షణలు విపరీతంగా జరిగి మరో  పాకిస్తాన్‌ ‌లాగా మరో విభజనకు దారి తీస్తుందని భయం ఉండేది. కానీ చాలా కాలం పాలించినటువంటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో ముస్లింలకు ఇతర మతస్తులకు కొంత అవసరాన్ని మించి చేయూత నివ్వడం వల్ల గాని లేక దేశ పరిపాలనలో లౌకికతకు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఆ దుర్గతి నివారించబడింది. కానీ ఈ మధ్య  మత సామరస్యానికి మత జాతీయత పేరున రాజకీయ లబ్ధి కోసం మళ్లీ మతసామరస్యం దెబ్బతింటుంది.’’

మన స్వాతంత్రపు అమృత ఉత్సవాలు జరుపుకున్నటువంటి ఈ వేళ స్వాతంత్ర అమృత గడియ కోసం తమ జీవితాల్ని అంకితం చేసిన మహానుభావువులకు మహామహుడు  మహాత్మా గాంధీ ఆదర్శాలు ఎంతవరకు ఆచరించబడుతున్నాయి  అనే విషయంపై మూల్యాంకన అవసరం. గాంధీ ఆఫ్రికా నుండి మన దేశానికి రాకముందు అంతవరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఉన్నత కులాలు మరియు ఉన్నత తరగతుల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు. వీరిలో చాలామంది కూడా విదేశాల్లో చదువుకొని అక్కడి స్వాతంత్ర నూతన భావాలు ఆకళింపు చేసుకున్న వాళ్లే. వారిలో చాలామంది ఆహింసాయుతంగానే చర్చల ద్వారా స్వతంత్రాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేశారు.కానీ వారిలో ఎవరికీ కూడా సామాన్య ప్రజలతోని సంబంధాలు లేవు. వారు ఉన్నత కుటుంబాల్లో పుట్టినవారు. గాంధీ భారతదేశానికి వచ్చిన తర్వాత మొట్టమొదట అప్పటి నాయకులతో సమావేశంలో జరిపాడు. తద్వారా ఆయనకు వచ్చిన అవగాహన తో  ఈ కొద్దిమంది మేధావుల చర్చల వల్ల కాకుండా భారతదేశంలో మొత్తం ప్రజలని స్వాతంత్ర ఉద్యమంలో బాగం చేస్తేనే స్వాతంత్ర సిద్ధించటం సాధ్యమవుతుంది అని గ్రహించాడు. అందుకే ఆయన దేశమంతా తిరిగాడు. ముందు ఈ మహా నాయకునికి ఎవరు అంతగా సహాయ సహకారాలు అందించినట్లు గానీ ఈయనే మనందరికీ దిశా నిర్దేశం చేస్తాడని కానీ తెలిసి రాలేదు. కానీ ఎప్పుడైతే మహాత్మా గాంధీ ఒక సాధారణ వేషధారణ వేసుకుని గోచి కట్టుతో దేశం మొత్తం తిరిగితే ఆయనకు ప్రజలు పట్టం కట్టారు. అప్పుడు మహాత్మా గాంధీని దేశ నాయకులు కూడా తమ నాయకునిగా పరిగణించడం మొదలుపెట్టారు. స్వతంత్ర దేశాన్ని గురించి ఆయన ఎన్నో కలలు అన్నారు. ఆయన ఈ దేశానికి నిర్ధారించి అవలంబించిన ఆశయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనవి అహింస, గ్రామ స్వయం పరిపాలన, పరిశుద్ధత, నిరాడంబర జీవనవిధానం, గ్రామ స్వయం పరిపాలన, ప్రకృతి విధ్వంసం చేయని సాంకేతిక పరిజ్ఞానం లేక వాటిని పరిశ్రమంలో వాడుక, పరమత సహనం, సర్వమత సామరస్యం, ఆర్థిక సామాజిక సమానత్వం, అస్పృశ్య నిర్మూలత.

మరి ఇప్పుడు  జాతి  పిత మహనీయుని మాటలు  మన దేశ ప్రజలు మరియు వారి నాయకులు పాటించారా అనేది మూల్యాంకనం చేసుకోవాల్సిన  తరుణం ఇది. ముఖ్యంగా అహింస ఆదర్శం  చూసుకుంటే అది దేశంలో కొంతవరకు వివాద పరిష్కరణలో లేక ప్రభుత్వాల ప్రజా రంజకంగాని విధానాలపై దేశంలో ఇంతవరకు వచ్చిన చాలా ఉద్యమాలు కూడా అహింస పద్ధతుల్లోనే నిర్వహించబడ్డాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు గాని,  కార్మిక ఉద్యమాలు గానీ, మహిళా సాధికారత ఉద్యమాలు గాని,  దళిత హక్కుల ఉద్యమాలు గాని, మొన్న మొన్న సంవత్సరం పాటు జరిగిన వ్యవసాయదారుల ఉద్యమం కానీ, అన్ని అహింసాత్మక పద్ధతుల్లోనే జరిగాయి. వీటన్నింటికీ గాంధీ స్ఫూర్తి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా దేశంలో కొన్ని ఉద్యమాలు మాత్రం హింసయుతం గానే జరిగాయి. వాటిలో ముఖ్యమైనవి నక్సల్‌ ‌విప్లవ ఉద్యమం, మహారాష్ట్రలో కార్మిక ఉద్యమం, తమిళనాడులో హిందూ భాష వ్యతిరేక ఉద్యమం, పంజాబ్‌ ‌ఖలిస్తాన్‌ ఆం‌దోళన, ఈశాన్య దేశాల్లో ప్రత్యేక ప్రతిపత్తికి జరిగిన ఉద్యమాలు ముఖ్యమైనవి. ఈ ఉద్యమాలను చాలావరకు ప్రభుత్వాల ప్రతి హింస ద్వారా నియంత్రించబడ్డాయి. ఆ ప్రక్రియలో బ్రిటిష్‌ ‌వారు వారి దమన నీతి కోసం తయారు చేసిన చట్టాలు కూడా కొంతవరకు దుర్వినియోగం చేయబడ్డాయి.

మహాత్మా గాంధీ సొంతగా అవలంబించి చూపించిన పరిశుద్ధత మాత్రం ఇంకా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో సాధించబడలేదు. ముఖ్యంగా ప్రజల అలవాట్లులో ఆయన ఆశించిన స్వతసిద్ధ మార్పు రావాల్సి ఉంది. ఇంతవరకు కూడా ప్రభుత్వ ఆదేశాల ద్వారాను నిర్బంధ స్వచ్ఛత అమలుపరచబడింది. మోదీ  ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ ‌ప్రభావం ఆరు సంవత్సరాల తర్వాత కూడా అంతగా కనబడడం లేదు. స్వచ్ఛత కొంతవరకు కుటుంబాల ఆర్థిక స్తోమత పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి సగటు ప్రజల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వారి మౌలిక అవసరాలకు కన్నా వారి సంపాదన ఎక్కువుంటే తప్పితే ఇది సాధ్యం కాదు. ఈ మధ్యనే కొంతవరకు ప్రపంచ వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచ దేశాల మధ్యన ఏర్పడినటువంటి ఒప్పందాల కనుగుణంగా కాలుష్య నివారణ చర్యలు చేపట్టబడుతున్నాయి.అందులో ముఖ్యంగా నగర ప్రాంతాల్లో చెత్తశుద్ధి కార్యక్రమాలు, నదుల పరిశుభ్రత కార్యక్రమాలు, నీటి వనరుల కాలుష్యం నివారణ చర్యలు.  పాశ్చాత్య దేశాల్లో చూస్తున్నటువంటి స్వచ్ఛత స్థాయికి మన దేశం రావాలంటే స్వచ్ఛభారత్‌ ‌ప్రణాళిక లాంటిది నిరంతరంగా ఒకే స్థాయి తీవ్రతతో శ్రద్ధతో అవలంబించాల్సిన అవసరం ఉంది. కానీ అది ఒక నినాదంగా ఒక రాజకీయ ప్రయోజనం కోసం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.

ఇక ఈ 75 సంవత్సరాలలో గ్రామ స్వయం పరిపాలన  73, 74 చట్టంగా సవరణ వల్ల  గ్రామాలకు స్వయం పాలనకు  సంబంధించిన రంగాలలో స్వయం ప్రతిపత్తి మరియు ఆర్థిక చేయూత ఇవ్వాలనే విషయంలో చేసిన విధానాలు అమలు పరచడంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఒక కేరళలో తప్పితే అలాంటి స్వయం పాలన సామర్ధ్యం గ్రామాలలో ఎక్కడా కనబడదు. ఈ చట్టానికి సవరణల ద్వారా మహిళలకు మరియు వెనుకబడిన తరగతులకు సాధికారత ఇవ్వడం జరిగినా అది నామమాత్రం గానే ఉంది.
సహకార సంఘాల ద్వారా అన్ని రంగాలలో స్వయం పాలన సాధించాలి అనే ఆదర్శం కూడా రాజకీయ నాయకుల ద్వారా నిర్వీర్యం చేయబడింది. దేశంలో అద్భుతాలు సాధించినటువంటి అమూల్‌ ‌లాంటి సహకార సంస్థల్లో కూడా ఆ సంస్థను స్థాపించి అభివృద్ధి చేసినటువంటి కొరియన్‌  ‌వెళ్లగొట్టడం ద్వారా రాజకీయాలు ప్రవేశించడం ద్వారా సహకార స్ఫూర్తికి గండి పడింది. దేశంలో సహకార సంఘాలు రాజకీయాల వల్ల చెడిపోయాయి అనేది ఎన్నో పరిశోధనల ద్వారా తేలిన విషయం.

చాలా కాలం మతసామరస్యం దేశంలో ఫరిడవిల్లింది. దేశ స్వాతంత్య్ర అనంతరం హిందూ ముస్లింల మధ్య జరిగిన అతి భయానకమైన హింస కోణంలో చూస్తే దేశంలో మత ఘర్షణలు విపరీతంగా జరిగి మరో  పాకిస్తాన్‌ ‌లాగా మరో విభజనకు దారి తీస్తుందని భయం ఉండేది. కానీ చాలా కాలం పాలించినటువంటి కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో ముస్లింలకు ఇతర మతస్తులకు కొంత అవసరాన్ని మించి చేయూత నివ్వడం వల్ల గాని లేక దేశ పరిపాలనలో లౌకికతకు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఆ దుర్గతి నివారించబడింది. కానీ ఈ మధ్య  మత సామరస్యానికి మత జాతీయత పేరున రాజకీయ లబ్ధి కోసం మళ్లీ మతసామరస్యం దెబ్బతింటుంది. ఇక గాంధీకి అత్యంత ప్రేమపాత్రమైనటువంటి అస్పృశ్యత నిర్మూలన విషయంలో, దళితుల దురాహంకార భావన, వారిపై అర్హత లేని ఆధిపత్యము, వారిని కించపరచటం, వారికి సామాజిక సమానత్వం నిరాకరించడం, వారిలో ఎవరైనా పెద్ద కులాల వారిని పెళ్లి చేసుకుంటే అడ్డంగా నరకడం జరుగుతూనే ఉంది. ఇవ్వన్నీ చూస్తుంటే ఈ విషయంలో గాంధీ ఆదర్శాలు మంటగలిసాయనిపిస్తుంది.

అప్పుడు గాంధీ తెల్లవాళ్లను వెళ్లగొట్టేందుకు సహకరణ నిరాకరణ ఉద్యమం చేపడితే ఇప్పుడు మనదేశంలో 20 కోట్లు ఉన్నా ముస్లింల వ్యాపార సంస్థలకు వారిని అదుపులో పెట్టుకునేందుకు సహకార నిరాకరణోద్యమం కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా కర్ణాటకలో చేపట్టడం గాంధీ మహాత్ముని ఈ విధానానికి చెడ్డ పేరు వచ్చింది. పర్యావరణానికి హాని జరగకుండా, నిరాడంబర జీవితానికి ఆలంబనగా, స్వయం గ్రామ పాలనకు ద్వారా  ప్రకృతికి దగ్గరగా ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వంతో ఆనందమైన జీవితం  భారతీయులు వారి భవిష్యత్తును దిద్దుకోవాలనేటటువంటి గాంధీ గారి ఆశలు ఆదర్శాలు ఆర్థిక వ్యవస్థ నిర్వహణ విషయంలో సంపూర్ణంగా విస్మరించడం జరిగింది. ఈరోజు అభివృద్ధి పేరు మీద ప్రకృతి విధ్వంసం జరిగింది.. జరుగుతుంది. దేశంలో ఆర్థిక రాజకీయ కేంద్రీకరణ ద్వారా అని రంగాల్లో అసమానత్వం రోజురోజుకు పెరుగుతుంది.

రాజకీయ రంగంలో స్వతంత్రానికి ఎంతో పాటుపడ్డా కాంగ్రెస్‌ ‌పార్టీని మూసివేసి తిరిగి ప్రజాస్వామ్య పద్ధతిలో దేశ అభివృద్ధికి కావలసినటువంటి ప్రణాళికలు రూపొందించి కొత్త పార్టీలు ఆవిర్భవించి వారి మధ్య ఆరోగ్యకరమైనటువంటి పోటీ ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి అనేటువంటి భావన కలిగినటువంటి గాంధీ ఆలోచన ఈ రోజు ఏ ప్రతిపక్ష పార్టీ ఉండకూడదు. కేవలం  తమే పార్టీనే  ఉండాలి అన్నటువంటి అధికార పార్టీ ఆలోచనలకు ఎంతో తేడా ఉంది. ఆర్థిక రాజకీయ స్వతంత్రత అత్యంత ముఖ్యం అని భావించినటువంటి గాంధీ ఆలోచనలకు ఈరోజు ప్రపంచ సంస్థలు అయినటువంటి డబ్ల్యూటీవో మరియు వరల్డ్ ‌బ్యాంక్‌ ‌సంస్థలకు పాదాక్రాంతమైన దేశ ఆర్థిక వ్యవస్థను ఇతర దేశాలపై  ఆధార పడవలసినటువంటి పరిస్థితులు ఈ 75 సంవత్సరాలలో కల్పించబడ్డాయి.
మొన్న కోవిడ్‌  ‌దుష్ప్రభావ పరిస్థితిలు వచ్చినప్పుడు మన దేశంలో మందుల తయారీకి కావాల్సిన ముడి సరుకు 70% చైనా నుండి కొనుక్కోవలసిన పరిస్థితి ఉండడం వల్ల వాటి సరఫరా ఆగిపోయి అత్యంత ముఖ్యమైనటువంటి మందుల తయారీలో ఆటంకం ఏర్పడడమే కాకుండా వారి ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు రష్యా యుక్రేన్‌ ‌యుద్ధం వల్ల పొద్దుతిరుగుడు పువ్వుల నూనె, గోధుమలు లాంటి సరుకులు దిగుమతి ఆధారపడి ఉండటం వల్ల కూడా ధరలు సామాన్యులు భరించరానంతగా పెరిగాయి. పబ్లిక్‌ ‌రవాణా వ్యవస్థను పెంపొందించకుండా కార్ల తయారీ వాడుక పెంచడం వల్ల అటు కాలుష్యం పెరగడమే కాకుండా ముఖ్యంగా పట్టణాలలో విపరీతంగా ట్రాఫిక్‌ ‌కష్టాలు పెరిగాయి. అభివృద్ధి జరగలేదని కాదు కానీ మన దేశ అధిక జనాభా కలిగిన పరిస్థితులకు అనుగుణంగా ఉపాధి లేని అభివృద్ధి, అసమానత్వాలు పెంచే అభివృద్ధి జరిగిందన్నది నిజం.

దేశ ప్రాకృతిక సంపదను మానవ వనరులను బడుగుల సంక్షేమానికి ఉపయోగించాలని అందుకు ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు ఒక ట్రస్ట్ ‌గా ఉండాలి అనేటటువంటి భావన గాంధీ మనసుకు అతి దగ్గరైనది. కానీ ప్రస్తుతం మన దేశంలో అది టార్చి వేసి చూసినా కూడా ఎక్కడా కనబడదు. ఈ విధంగా గాంధీ ఆదర్శాలు చాలా మటుకు స్వతంత్ర భారతదేశంలో విస్మరించబడ్డాయి. అది మంచా చెడా అనేది కొంత వివాదపరమైన విషయం అయినప్పటికీ ప్రస్తుతం ప్రపంచంలో వాతావరణ పెనుమార్పుల వల్ల జరుగుతున్న విధ్వంసం దృష్ట్యా చూస్తే గాంధీ ఆలోచనే సరైనది  అనిపిస్తుంది. అందుకోసమే ఒక ఇంటర్వ్యూలో గిరీష్‌ ‌కార్నాడ్‌ ‌గాంధీని ఎంత విస్మరిద్దామనుకున్న తిరిగి మళ్లీ దేశ స్మృతిలోకి, ప్రపంచ స్మృతిలోకి వస్తూనే ఉంటాడని గాంధీని విస్మరించడం అసాధ్యం అని అన్నాడు.
– డాక్టర్‌ ‌మండువ ప్రసాదరావు
హైదరాబాద్‌, 9963013078

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page