తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా సెప్టెంబర్ 17
కెసిఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ కీలక నిర్ణయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనుంది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల తరహాలోనే దేశంలో హైదరాబాద్ రాష్ట్రం అంతర్భాగమైన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ వజ్రోత్సవ వేడుకలను ఈ నెల 16,17,18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రగతిభవన్ లో మూడు గంటల పాటు కేబినెట్ భేటీ జరిగింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు, పాలనాపరమైన అంశాలు, తెలంగాణ విలీన వజ్రోత్సవాల నిర్వహణ, విద్యుత్ బకాయిలు, ఇతర అంశాల్లో కేంద్రం వైఖరి, పోడు భూములు, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏపై కేబినెట్ లో చర్చించారు. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం, 2022 సెప్టెంబర్17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగిడుతున్నది.
ఈ నేపథ్యంలో 2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’ గా పాటించాలని కేబినెట్ నిర్ణయించింది. సెప్టెంబర్ 16, 17, 18 తేదీలల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ’తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సమావేశం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. అసెంబ్లీ సమావేశాలు, పాలనాపరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అలాగే పలు చట్ట సవరణల బిల్లులపైనా మంత్రివర్గంలో చర్చలు జరిపారు. జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్టాల సవరణలపై చర్చించారు. జీహెచ్‌ఎంసీ కో-ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంపు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ గురించి మంత్రివర్గంలో చర్చ జరిపారు. మరో 5 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతుల మంజూరు అంశం సైతం ఈ భేటీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అటవీ కళాశాల, పరిశోధనా సంస్థల్లో కొత్త కోర్సులు, పోస్టులపై చర్చ జరగనుంది.సీఎంకు వినతిపత్రం అందజేసిన సీపీఎం నేతలుఅంతకుముందు సీఎం కేసీఆర్‌తో రాష్ట్ర సీపీఎం నేతలు సమావేశమయ్యారు. రాష్టాన్రికి సంబంధించిన 20 సమస్యలపై సీఎంకు వినతిపత్రాన్ని సమర్పించారు. పోడు భూములు, ధరణి సమస్యలు, కౌలు రైతులు, గిరిజన రిజర్వేషన్లు, ఏకకాలంలో రుణమాఫీ, వీఆర్‌ఏలకు పేస్కేలు, ఉద్యోగాలు భర్తీ, ఉద్యోగుల బదిలీ తదితర అంశాలపై విజ్ఞప్తులు అందజేశారు.