సర్పంచ్‌లతో కేటీఆర్ సమావేశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు
ముందు చేనేతపై 5శాతం జిఎస్టీ ఎత్తేయండి : సిఎంకు బండి సంజయ్ లేఖపై మంత్రి పొన్నం కౌంటర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 18 : హంతకులే సంతాప సభ పెట్టినట్టుగా ఉందంటూ కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్‌లను పనుల పేరుతో సస్పెన్షన్ల పేరుతో గత ప్రభుత్వం వేధించింది నిజం కాదా..అంటూ ఆయన నిలదీశారు. ఇప్పుడు మళ్లీ ఆత్మీయ సమ్మేళనలా పేరుతొ రాజకీయాలకు తెరలేపితే మిమ్మల్ని ఎవరూ నమ్మరు కేటీఆర్ అంటూ నెద్దేవా చేశారు. ఈ మేరకు సోషల్ విూడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటరిచ్చారు. 10 సంవత్సరాల మీ పాలనలో సర్పంచ్‌లు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నది నిజం కాదా…అంటూ కేటీఆర్‌ను మంత్రి ప్రశ్నించారు. వారి హయాంలో సర్పంచ్‌లకు ఇవ్వాల్సిన రూ.1100 కోట్ల బిల్లులు పెండిరగ్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో 20 మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా మంగళవారం సిరిసిల్లలోని బీఆర్ఎస్ ఆఫీస్‌లో నిర్వహించిన జిల్లా సర్పంచుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్..కొరోనా కారణంగా సర్పంచులకు బిల్లులు చెల్లించలేక పోయామని, వాటిని ఈ సర్కారు ఇస్తుందని ఆశిస్తున్నామని, లేదంటే వారి తరఫున గొంతు విప్పడానికి తాను సిద్ధంగా ఉంటానన్న కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.
ముందు చేనేతపై 5శాతం జిఎస్టీ ఎత్తేయండి : సిఎంకు బండి సంజయ్ లేఖపై మంత్రి పొన్నం కౌంటర్
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సిఎం రేవంత్‌కు రాసిన లేఖపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. అలాగే సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాసారు. దీనిపై మంత్రి ట్వీట్ చేస్తూ…విూ మొసలి కన్నీరు ఆపి..ముందు విూ బాధ్యత నెరవెర్చి చేనేత కార్మికుల భారాన్ని తగ్గించాలన్నారు. చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్టీని కేంద్రంతో రద్దు చేయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన చేనేత బోర్డును పునరుద్ధరించాలని, చేనేత కార్మికుల బీమాను, రాయితీలను తిరిగి ప్రారంభించాలని పొన్నం డిమాండ్ చేశారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు ప్రతిపాదనలు కేంద్రం వద్ద పెండిరగ్లో ఉన్నాయని, మల్లా ఆడలేక పాత గజ్జెలు అంటే ఎలా..అని ప్రశ్నించారు. ఎవరి సలహాలు..అవసరం లేకుండా.. నరులకు నాగరికత నేర్పిన చేనేతను ఆదుకుని తీరుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం అనడం మంచి పద్దతి కాదని, అక్షింతలు అంటే ఎమిటో విూ కుటుంబ సభ్యులను అడగాలని, వాటి ప్రాముఖ్యత గురించి తెలియకుండా మాట్లాడవద్దన్నారు. రామ మందిర ప్రాణ ప్రతిష్టని రాజకీయం చేయొద్దన్నారు.