- గౌలీగుడా నుంచి తాడ్‌బన్ వరకు కొనసాగనున్న యాత్ర
- పోలీసుల భారీ బందోబస్తు
- మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు
ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 15 : హైదరాబాద్ నగరంలో నేడు హనుమాన్ జయంతి శోభాయాత్ర జరుగనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ మేరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడ రామ్ మందిర్ నుంచి తాడ్‌బన్‌లోని హనుమాన్ మందిర్ వరకు కొనసాగనుంది. కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి మరో యాత్ర కొనసాగనుంది. కర్మన్‌ఘాట్ నుంచి చంపాపేట్, కోఠి ఉమెన్స్ కాలేజ్, నారాయణగూడమీదుగా తాడ్‌బన్‌లోని హనుమాన్ మందిర్ వరకు కొనసాగనుంది. గౌలిగూడ రామ్ మందిర్ వద్ద హనుమాన్ శోభాయాత్ర ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానుంది. పుత్లిబౌలీ ఎక్స్ రోడ్, కోఠి ఆంధ్రా బ్యాంక్, రామ్ కోఠి ఎక్స్ రోడ్, కాచిగూడ ఎక్స్ రోడ్, వైఎంసీఏ, నారాయణగూడ ఎక్స్ రోడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్ క్రాస్ రోడ్స్, గాంధీ నగర్ టీ జంక్షన్, కవాడిగూడ ఎక్స్ రోడ్, సీజీవో టవర్స్, ఆర్పీ రోడ్, ఓల్డ్ పీఎస్ రామ్‌గోపాల్ పేట్, పారడైజ్ జంక్షన్, సీటీవో, బ్రూక్ బాండ్, మస్తాన్ కేఫ్ మీదుగా తాడ్‌బన్ హనుమాన్ మందిర్ వద్దకు రాత్రి 8 గంటలకు చేరుకోనుంది.
ఈ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించనున్నారు. దిల్‌సుఖ్ నగర్ నుంచి మెహిదీపట్నం వెళ్లే వాహన దారులు ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్ లేదా ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్, అత్తాపూర్ మీదుగా మెహిదీపట్నం చేరుకోవచ్చు. లక్డీకాపూల్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ లేదా ఉప్పల్ వెళ్లే వాహనదారులు.. వీవీ స్టాచ్యూ, సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట ్గఫ్లై ఓవర్, ప్రకాశ్ నగర్ ఫ్లై ఓవర్, పారడైస్ ఫ్లై ఓవర్ మీదుగా సికింద్రాబాద్, ఉప్పల్ చేరుకోవచ్చు. హునుమాన్ శోభాయాత్ర నేపథ్యంలో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్(040 2785 2482) ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబర్ 9010203626ను ఏర్పాటు చేశారు. ఇదిలావుంటే హనుమాన్ జయంతి, శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.