ఎక్కడికి రావాలో చెప్పండి
•రేవంత్ రెడ్డి సవాల్‌కు ఎంపీ ఈటల సై
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: హామీల చర్చపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హామీల అమలుపై చర్చకు ప్రధాని మోదీ ఎందుకని.. తాము ఇక్కడే ఉన్నామని ఎక్కడికి రావాలో చెబితే వొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలే కాకుండా.. 420 హామీలపై చర్చిద్దామన్నారు. నాంపల్లి బిజెపి పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఈటల మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సంబరాలపై ప్రజలు నవ్వుకుంటున్నారని, మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని చెబుతున్నారని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ముచ్చర్లలో గత ప్రభుత్వం 14 వేల ఎకరాలు భూ సేకరణ చేశారు. ఆ భూములు పోగొట్టుకున్న రైతులు కూలీలుగా మారారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఫార్మా సిటీ రద్దు చేసి.. రైతులకు తిరిగి భూమి ఇస్తామని చెప్పారు. ఫోర్త్ సిటీ పేరుతో 14 వేల ఎకరాలకు తోడుగా మరో 16 వేలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రియల్ ఎస్టేట్ పేరుతో రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. కొడంగల్ లో రైతులు భూమి ఇవ్వలేమని కాళ్ళు మొక్కినా బెదిరించి సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.
స్వయంగా కలెక్టర్ తనపై దాడి జరగలేదని చెప్పారని, లగచర్ల చుట్టూ పక్కల గ్రామాలకు మాత్రమే సమస్య కాదు.. ప్రతీ రైతు రేపటి రోజున మాకు సమస్య వొస్తుందని భయపడుతున్నారని పేర్కొన్నారు. రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, రైతులు నక్సలైట్లు కాదు.. వేరే వాళ్ళ భూములు అడగడం లేదని అన్నారు. రేవంత్ రెడ్డిది మా కొడంగల్ కాకపోయినా గెలిపిస్తే మమల్ని హింసిస్తున్నారని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం.. కానీ రేవంత్ లా ప్రజలను ఇంతగా ఎవరూ హింసించలేదని విమర్శించారు. మూసీ పక్కన ఉన్న భూములను లాక్కొని.. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని, ఒక వైపు హైడ్రా కూల్చివేతలు.. మరోవైపు లగచర్లలాంటి ఘటనలు జరుగుతుండగా ఇంకోవైపు కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.
రేవంత్ ! నీ స్థాయి ఎంత ?
మహారాష్ట్ర వెళ్లి ప్రధానిపై సీఎం రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడని, ప్రజాక్షేత్రంలో ఒకలా..దిల్లీ వెళ్లి మోదీని కలిసినప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏ వర్గాన్నీ వొదలకుండా అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేశారని ఆరోపించారు. నెలనెలా రూ.4వేల ఇస్తానని చెప్పిన నిరుద్యోగ భృతి ఏమైంది ? ఆర్టీసీ కార్మికులకు ఇస్తామని చెప్పిన రెండు పెండింగ్ పీఆర్‌సీలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కడుపు నొప్పి లేస్తే టాబ్లెట్ దొరకదు.. కానీ కిరాణా కొట్టులో మాత్రం లిక్కర్ దొరుకుతుందిని ఎద్దేవా చేశారు. హామీలు నెరవేర్చకుండా.. ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ మంత్రులే అంటున్నారు. రేవంత్ రెడ్డి భూమి మీదకు వొచ్చి మాట్లాడాలి. చట్టాన్ని మరిచిపోయి బాసుల మాట వింటున్న అధికారులు భవిష్యత్తు పరిణామాలు ఎదుర్కోవాల్సి వొస్తుందన్నారు. రేవంత్ అధికారంలోకి వొచ్చాక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని, గతంలో సర్పంచ్ లు, ఎంపీటీసీలుగా పనిచేసిన వారు బిల్లుల కోసం పోతే పది శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు.
లగచర్ల ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు
రైతులను పోలీసు కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారని.. ఇప్పటికీ పోలీసులు, అధికార పార్టీ నాయకులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఎన్‌హెచ్‌ఆర్సీకి మంగళవారం ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని జాతీయ మానవ హక్కుల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఎన్‌హెచ్‌ఆర్సీ బృందాలను లగచర్లకు పంపించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కమిషన్ కూడా సానుకూలంగా స్పందించిందని ఈటల రాజేందర్ ఈసందర్భంగా తెలిపారు.