- రాహుల్ యాత్రలో పాల్గొనకపోవడంపై కేంద్రమంత్రి విమర్శలు
- అన్నా చెల్లెళ్ల మద్య గ్యాప్ ఏర్పడిందన్న అనురాగ్ ఠాకూర్
న్యూ దిల్లీ, నవంబర్ 5 : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న రాహుల్..యాత్రపైనే ఫోకస్ పెట్టారు. రాహుల్ గాంధీ కర్ణాటకలో యాత్ర చేస్తున్న సమయంలో సోనియా గాంధీ అందులో పాల్గొన్నారు. అయితే ప్రియాంక గాంధీ ఇప్పటి వరకు రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనలేదు. ప్రస్తుతం ఆమె హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య అక్కడ హోరాహోరీ పోరు నెలకొంటుంది. నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. ప్రియాంక గాంధీని టార్గెట్ చేశారు. రాహుల్ యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొనకపోవడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధి వాద్రాల మధ్య గ్యాప్ వచ్చిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. అందుకే ఆమెను భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని రాహుల్ గాంధీ ఆహ్వానించలేదని చెప్పుకొచ్చారు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన వారితో కలిసి రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారంటూ అనురాగ్ ఠాకూర్ విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం ఏంటో దీని ద్వారా తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. శుక్రవారంనాడు హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రియాంక గాంధీ.. బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజలు మార్పులు కోరుకుంటున్నారని.. అందుకే బీజేపీ రెబల్స్‌ను మచ్చిక చేసుకునేందుకు విఫలయత్నం చేస్తోందన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్న పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలులోకి తీసుకొస్తామని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 12న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. గుజరాత్ అసెంబ్లీతో పాటుగా డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గుజరాత్ అసెంబ్లీకి రెండు విడతల్లో డిసెంబరు 1, 5 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.