- ఎంఎల్‌ఏల ఎర కేసులో సిబిఐకి కేసు అప్పగింతలో స్టేకు నిరాకరణ
- సుప్రీంలోనూ స్టేకు నిరాకరణ
హైదరాబాద్/న్యూ దిల్లీ, ఫిబ్రవరి 8(ఆర్‌ఎన్‌ఎ) : ఫామ్ హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కేసును సీబీఐకు అప్పగిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని సింగిల్ జడ్జి బెంచ్ స్పష్టం చేసింది. తీర్పుపై 3 వారాలు స్టే కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులతో ఫామ్ హౌస్ కేసులో సీబీఐ విచారణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ అప్పగించాలని సీబీఐ మంగళవారమే లేఖ రాసింది. అవి అందిన వెంటనే సీబీఐ అధికారులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించే అవకాశముంది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సింగిల్ బెంచ్‌లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. గతంలో ఇచ్చిన తీర్పును సవి•క్షించి ఆర్డర్‌ను సస్పెండ్ చేయాలని కోరింది. అయితే ప్రభుత్వ పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి గతంలో ఈ అంశంపై విచారణకు సీజే బెంచ్ నిరాకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాన న్యామూర్తి అనుమతిస్తేనే విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. సీజే పర్మిషన్ తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ చెప్పడంతో ధర్మాసనం కేసు విచారణ బుధవారానికి వాయిదా వేసింది. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ జరపలేమని సింగిల్ జడ్జి బెంట్ స్పష్టం చేసింది.
సుప్రీమ్‌లోనూ స్టేకు నిరాకరణ
ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి..ఫామ్ హౌస్ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీమ్ కోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. కేసును సీబీఐకు అప్పగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించింది. కేసును విచారించి మెరిట్స్ ఉంటే హైకోర్టు తీర్పును రివర్స్ చేస్తామని సీజీఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. కేసును ఫాస్ట్ ట్రాక్ చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. ఫాం హౌస్ కేసులో హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంను ఆశ్రయించింది. సీబీఐ కేసు విచారణ చేపడితే సాక్ష్యాలన్నీ ధ్వసం అవుతాయని పిటిషన్‌లో ఆందోళన వెలిబుచ్చింది.