- జంట బల్దియాల్లో అదనంగా అంగన్వాడీ కేంద్రాల ఆవశ్యకత..
- కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్థానికుల డిమాండ్.
మేడిపల్లి, ప్రజాతంత్ర విలేఖరి, మార్చి 19 : హైదరాబాద్ మహా నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలను ప్రభుత్వం గ్రామ పంచాయతీల నుంచి మున్సిపల్ కార్పొరేషన్లుగా హోదా పెంచినా వసతుల కల్పనలో మాత్రం నేటికీ దృష్టి సారించిన దాఖలాలు లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. పేరుకు మున్సిపల్ కార్పొరేషన్లే అయినా అందుకు తగ్గట్లుగా అవసరమైన వసతులు, సౌకర్యాల కల్పనలో మాత్రం చేస్తున్న ప్రయత్నాలేవీ అగుపడడం లేదని పలువురు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం మహా నగరాన్ని ఆనుకుని ఉన్న పీర్జాదిగూడ, మేడిపల్లి, పర్వతాపూర్ గ్రామాలను విలీనం చేసి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్, చెంగిచర్ల గ్రామాలను కలిపి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చింది.
ఆరేళ్ల క్రితం వేర్వేరుగా ఉన్న ఈ పంచాయతీలను పీర్జాదిగూడ, బోడుప్పల్ పురపాలక సంఘాలుగా మార్చి..అటు తరువాత కొద్ది కాలానికే నగర పాలక సంస్థలుగా హోదా పెంచి ఈ ప్రాంతాలను పంచాయత్‌రాజ్ నుంచి మున్సిపల్ శాఖకు బదలాయింపు చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో గతం కంటే ప్రభుత్వం నుంచి నిధుల రాకడ పెరగడం, పెరుగుతున్న నివాసాల నుంచి ఆస్తి పన్ను ద్వారా వసూళ్లు దానికి అనుగుణంగా భవన నిర్మాణాల అనుమతుల ఫీజులు, ఇతరత్రా రెవెన్యూ వసూళ్లు ఏటా కోట్లలో చేరడంతో సాలుకు సదరు కార్పొరేషన్ల రాబడి(ఒక్కో కార్పొరేషన్ బడ్జెట్) సుమారు రూ. 70 కోట్లు దాటిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే పెరుగుతున్న రాబడికి అనుగుణంగా సదరు బల్దియాలు అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటు వంటి మౌలిక వసతుల కల్పనపైనే దృష్టి సారిస్తున్నాయి తప్పితే వైద్య, విద్య సదుపాయాలు కల్పనలో, మాతా, శిశు సమగ్రాభివృద్దికి అవసరమయ్యే అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు తీసుకోవాల్సిన అంశాలను మరుగున పడేస్తున్నాయనే విమర్శలు మూటగట్టుకుంటున్నాయి.
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తదితరుల కోసం ఒక్క పూట సంపూర్ణ పోషకాహారాలతో కూడిన భోజన పంపిణీ, మూడేళ్ళు పైబడిన చిన్నారులకు ఫ్రీ స్కూల్ బోధన వంటి అవసరాల కోసం ఈ ప్రాంతాల్లో కొత్తగా అనేక అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అప్పటి తక్కువ జనాభా అవసరాలకు సరిపోయే విధంగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల ద్వారానే ఈనాటికీ సేవలు కొనసాగిస్తున్నారు తప్పితే కొత్తగా కేంద్రాలు ఏర్పాటు చేసిన దాఖలాలు అగుపడడం లేదని పలువురు మండిపడుతున్నారు. గతంలో వేలలో ఉన్న జనాభా ప్రస్తుతం లక్షల్లోకి చేరింది. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా అదనంగా ఈ ప్రాంతాల్లో సామాన్య, మధ్య తరగతి మహిళల, చిన్నారులకు సంపూర్ణ పోషకాహారం అందించే అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నదని స్థానికులు అంటున్నారు.
టీచర్లపై మోయలేని పనిభారం..
ఐసీడీఎస్ మేడిపల్లి సెక్టార్ పరిధిలోని పీర్జాదిగూడ, బోడుప్పల్ కార్పొరేషన్లలో ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా మాతా, శిశు సంరక్షణ, పోషకాహార పంపిణీ చేపడుతున్న టీచర్లపై విపరీతమైన పనిభారం, ఒత్తిడి పెరుగుతుంది. వీరు కేంద్రాల నిర్వహణ, పోషకాహార పంపిణీతో పాటు జనన, మరణాల డాటా, కిషోర బాలికల డాటా, పిల్లలకు టీకాలు వేయించడం, పూర్వ ప్రాథమిక విద్య, మాతా, శిశు మరణాలు లేకుండా ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు నిత్యం పలు రకాల రికార్డులు రాయాల్సి ఉండం, వాటిని మళ్ళీ ఆన్లైన్లో నమోదు చేయడం వంటి బాధ్యతలే కాకుండా ఎన్నికల విధులు, బీఎల్వోగా విధులు, కుటుంబ సర్వే, జ్వర సర్వేలు, వంటివి నిర్వహించాల్సి రావడం, కేంద్ర, రాష్ట్ర పథకాల అవగాహన కల్పించడంలో కూడా అంగన్వాడీల పాత్ర కీలకం.
ప్రతి భాధ్యతను అంగన్వాడీ టీచర్ల నెత్తిన రుద్దుతుండడంతో వారు తీవ్ర ఒత్తిడితో క్షణం తీరికలేకుండా ఇంటి పనులు సైతం వదిలి రోజంతా ఇవే పనులకే సమయం వెచ్చించాల్సి వొస్తుంది. అంగన్వాడీలపై తలకు మించిన భారంగా అవుతుంది. ఈ ప్రాంతాల్లో గతంలోని వేల జనాభాకు సరిపడా కేంద్రాలు నెలకొల్పినా ప్రస్తుతం లక్షల్లో జనాభా పెరిగిపోయింది. దీంతో ఇక్కడ నివసిస్తున్న వారిలో అంగన్వాడీ లబ్ధిదారులు సైతం పెద్ద సంఖ్యలో పెరిగిపోయినట్లు తెలుస్తుంది. ఇక్కడ సేవలు అందించాలంటే రోజు మొత్తం కేటాయించినా సమయం సరిపోని పరిస్థితి ఉందని, అంతకంతకూ పనిభారం పెరిగిపోతున్నట్లు ఆయా అంగన్వాడీ కేంద్రాల మదర్స్ కమిటీలు పేర్కొంటున్నాయి. జనాభా పెరిగిపోతున్నా కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఊసే లేకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రోజురోజుకు కొత్తగా వొస్తున్న పలువురిని ఎన్రోల్ చేసుకోలేక, సేవలందించలేక అంగన్వాడీ టీచర్లు సతమతమవుతున్నారు. ఏదేమైనా పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా అదనంగా ఈ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలను తక్షణం ఏర్పాటు చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానికులు పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.