తిరుమల: తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు నవంబర్ 1 నుంచి టైమ్‌స్లాట్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. టోకెన్లు తిరుపతిలో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.డిసెంబర్ 1 నుంచి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నామని వివరించారు. ఉదయం 8.30 నుంచి బ్రేక్‌దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు తిరుమలలోని టీటీడీ ఉద్యోగులకు ఇ-బైక్‌లు అందజేస్తామని అన్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 15 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.
నిన్న శ్రీవారిని 67,439 మంది భక్తులు దర్శించుకోగా 29,450 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.60 కోట్లు వచ్చిందని వెల్లడించారు. కాగా నిన్న భువనేశ్వర్‌కు చెందిన శివం కాండెవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం అందించారు.ఈ మేరకు విరాళం చెక్కును తిరుమలలో ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. సంస్థ తరఫున ఇప్పటివరకు రూ.3 కోట్లు విరాళం ఇచ్చినట్టు రాఘవేంద్ర తెలిపారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడకు చెందిన తులసమ్మ, ఈశ్వర్ రెడ్డి దంపతులు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.5.5 లక్షలు విరాళంగా అందించారు.