‘‘హుజురాబాద్ లో చూసినం డబ్బులు ఇస్తే తీసుకునే వోటర్లు..కాస్త..ఎందుకు ఇవ్వవు.? అని అభ్యర్థులను నిలదీసే వరకు వచ్చింది. ఇది మునుగోడు లో పునరావృతం కాక తప్పదేమో.! భవిష్యత్తు ఎన్నికల్లో డబ్బుల పంపకం అనేది అనవాయితి కావొచ్చేమో.!సామాన్య వ్యక్తులు పోటి చేయకపోవొచ్చేమో..మొత్తంగా ఈ పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టుకాబోతున్నాయి.ఎన్నికల సంఘాన్ని,ఎన్నికల ను సమర్థవంతంగా నిర్వహించిన టి.ఎన్.శేషన్ లాంటి అధికారులు వస్తే తప్ప ఎన్నికల వ్యవస్థ బాగుపడేటట్లు కనపడటం లేదు..’’
గత కాలపు మనుషులైనా, రాజకీయ నాయకులైనా, ప్రతిపక్షమైనా, అధికారపక్షమైనా విలువలతో కూడిన రాజకీయాలు చేసేవారు..రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నప్పటికి,ప్రభుత్వాలు ప్రతి పక్షాల విమర్శలను సద్విమర్శగా స్వీకరించి వారికి కూడా సముచిత స్థానం కల్పించేవారు.అసెంబ్లికి వెళ్లినా,పార్లమెంట్ కు వెళ్లినా తమ నియోజకవర్గ సమస్యలను పద్దతి గా తయారుచేసుకొని వెళ్లేవారు.అధికార పార్టీ ప్రతినిధులకంటే కూడా ప్రతిపక్ష పార్టీ లకే సమస్యలను లేవనెత్తడానికి ఎక్కువసేపు మాట్లాడానికి అవకాశం ఇచ్చేవారు..చట్ట సభల్లో ప్రతిపక్షం లేవనెత్తిన అనేక అంశాలకు శాస్త్రీయమైన సమధానం లభించేది. అభివృధ్ధి పార్టీలకతీతంగా, వ్యక్తులకు అతీతంగా అన్ని నియోజకవర్గాల్లో జరిగేది.అందుకే నాలుగు,ఐదు సార్లు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి గా పనిచేసినవారు ఉన్నారు..శాసనసభ్యులుగా పనిచేసినవారు ఉన్నారు. కాని వారికి ఉండటానికి కనీసం శాశ్వత నివాసం ఉండేది కాదు.ఇందుకు ఖమ్మం జిల్లా ఇల్లెందు నుంచి ఐదుసార్లు ఏమ్యేలే గా గెలిచిన గుమ్మడి నర్సయ్య సజీవ సాక్షం.
తనకు వచ్చిన ఏమ్యేలే జీతాన్ని కూడా పార్టీ కే ఇచ్చేవారు.ఇప్పటికి తనది సాదా సీదా జీవితమే.ఇలా అనేకమంది ప్రజా క్షేత్రం లో నిలబడి మన్ననలు పొందారు.అనాడు ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థులు హంగు ఆర్భాటాలకు పోకుండా ప్రజాస్వామ్య కోణంలో ప్రచారం చేసేవారు..ప్రజల సమస్యలే కేంద్రంగా ప్రచారాన్ని మొదలు పెట్టి ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించేవారు.వారి నుంచి వచ్చిన సమస్యలనే పార్టీ లు మ్యానిఫెస్టోగా రుపొందించేవి.ప్రజలు సమస్యతో ప్రజా ప్రతినిధి దగ్గరకు వెల్తే పరిష్కరించి పంపేవారు. వారు నిస్వార్థంగా పనిచేసిన తత్వం ప్రజల హృదయాలలో గూడు కట్టుకునేది.అనాడు టి.ఎన్.శేషన్ లాంటి ఎన్నికల కమిషనర్ సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించిన తీరు రాజ్యాంగ వ్యవస్థకు అద్దంపట్టేది. నిర్ణీత కాలవ్యవధి లో ఎన్నికలు నిర్వహించినప్పటికి తమ వోటును స్వేచ్ఛ గా తమకు నచ్చిన వ్యక్తులకు వేసి స్వయంగా ఖర్చులు భరించి ఎన్నికలలో గెలిపించుకునే వారు.నాయకులు సిద్ధాంతాలకు లోబడి కార్యాచరణ ఉండేది.’’త్యాగం ప్రధాన గుణంగా’’ఉండేది.దేశ,రాష్ట్ర రాజకీయ ప్రతినిధులుగా చలామణి అవుతున్నప్పటికి గర్వం ఏ మాత్రం ఉండేది కాదు.
పార్లమెంటులో కాని, అసెంబ్లీలో కాని చర్చలు జరిగినప్పుడు అవి అర్ధవంతంగా ఉండేవి. ప్రజాభిప్రాయం ఆ చట్టాల్లో తొణికిసలాడేది.తమ స్వంత ఆస్తులను సైతం ఉమ్మడి ప్రయోజనాల కోసం ఉపయోగించేవారు.ఆనాడు రాజకీయాలు విద్యార్థి దశ నుండి అలవడేవి.ఆనాటి రాజకీయాలు క్రమశిక్షణ, హుందాతనం తో ఉండేవి.భాష ఉచ్ఛారణ లో హుందాతనం ఉట్టిపడేది.ప్రతి అంశం కూలంకషంగా అధ్యయనం చేసి చర్చ చేపట్టి సమస్యను పరిష్కరించేవారు.పాలన ప్రజారంజకంగా కొనసాగేది. నేటి రాజకీయాలలో రాజకీయ టూరిస్టులు, అవుట్ సోర్సింగ్ నాయకులు రాజకీయాలను శాసిస్తున్నారు.నేరచరిత్ర కలిగిన,మంద బలంతో,ఆర్ధిక బలంతో తొడేళ్ళ మాదిరిగా రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు.రాజకీయ పార్టీ ల అధినేతలు కూడా వారినే ఏరికోరి ఎంచుకొని అభ్యర్థులు గా నిర్ణయిస్తున్నారు.నేటి రాజకీయవేత్తల పాలన స్వార్థ రాజకీయాలతో భ్రష్ఠు పట్టిపోతుంది. ఆస్తులను కాపాడుకోవడం కోసం కొంతమంది.. ఆస్తులను సంపాదించుకోవడానికి మరికొంతమంది రాజకీయాలవైపు అడుగులు వేస్తున్నారు. సేవ అనే పదం వెనుక అనేక కుట్రలు దాగి ఉన్నాయి.పాలిటిక్స్ ని మంచి బిజినెస్ గా ఎన్నుకుంటున్నారు.అలాంటి వారు మార్గాలు ఏవైనా గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు.పార్టీ సిద్దాంతాలకు తిలోదాకాలు ఇచ్చి,అప్రకటితమైన హామీలు ఇచ్చి, విలువలు దిగజారే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు.గతంలో అక్షర జ్ఞానం లేని నాయకులు కూడా ప్రజా విశ్వాసాన్ని చూరగొ న్నారు.
కాని నేటితరం నాయకులు అక్షర జ్ఞానం ఉన్నప్పటికి మూర్ఖపు ఆలోచనలతో, వ్యక్తిగత విమర్శలతో అసంబద్ధమైన భాష ఉచ్ఛారణ తో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాజకీయాలు చేస్తు న్నారు. ప్రజా సమస్యల పట్ల స్పందించకుండా నీతి బాహ్యమైన ప్రకటనలు చేస్తూ పబ్బం గడుపు కుంటున్నారు.ఆయారాం-గాయారాం సూత్రాలకు అనుగుణంగా సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి వక్ర భాష్యం చేస్తున్నారు. ఒక పార్టీ దానిలోని అంశాలకు మద్దతు ఇచ్చి స్వప్ర యోజనాల కోసం మరల పార్టీ మారి దీని అంశాలకు మద్దతు ఇవ్వడం వలన ఈ సందర్భంగా వారి నోటి మాటలకు చరిత్రే నివ్వెరపోక మానదు.అవతలి పక్షం వారిని అహంకార పూరితంగా దూషణ చేస్తే తమను ప్రజలు గుర్తిస్తారని ఆరాటపడే రాజకీయ నాయకులు కోకొల్లలు.ఇవాళ అన్ని గుర్తింపు రాజకీయాలే.సామాజిక మాధ్యమాల ద్వారా రాత్రికిరాత్రే నాయకులుగా తయా రవుతున్నారు. ప్రజలు వారి సమస్యలు విన్నవించిప్పుడు వాటిని అర్థం చేసుకొని పరిష్కారం చూపేవారు తక్కువయ్యారు.ప్రజా ప్రతినిధులు కూడా తమకు ఎంతమేరకు వోటు ద్వారా ఉపయోగపడుతారు అనే భావనతో సంక్షేమ ఫలాలు అందిస్తు న్నారు. ప్రభుత్వాలను అర్ధాంతరంగా కూల్చడం,తమ దారికి రాని వారిని ప్రలోభాలకు లొంగని వారిని సామ, దాన, దండోపాయాలతో తమ దారికి తెచ్చుకుంటున్నారు.రాజ్యాంగ వ్యవస్థ లను విధ్వంసం చేస్తూ ఆధిక్యత కనబ రుస్తున్నారు.ప్రభుత్వాలను ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారు.
భవిష్యత్ రాజకీయాల్లో నీతిమంతులెవరూ ఉండబోరనేది తేటతెల్లమవుతుంది. బయట నుంచి చూసి మేకింగ్,టేకింగ్ తెలియకుండా రాజకీయాల్లోకి వచ్చిన ఎందరో వెనుదిరిగి వెళ్లిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి.పాలిటిక్స్ చాలా కష్టం అంటారు వాళ్లు.ప్రస్తుత రాజకీయాలు స్వార్థంతో నిండిపోయాయి.’డబ్బులు కుమ్మరించి గెలవాలి. గెలిచాక అందినకాడికి దోచుకోవాలి. మెజార్టీ నాయకులు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. అందుకే రాజకీయాలు ఇప్పుడు చాలా కాస్ట్లీ అయ్యాయి. వోట్లను కులాల వారి గా గంపగుత్తగా కోనేయ్యాలి అనే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాంటి ఎన్నికే ప్రస్తుతం మునుగోడు బైపోల్ ఇప్పటికే సర్పంచ్, ఎంపీటీసీ సహా పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు ఎక్కువ మొత్తం లో వోటర్లను ప్రభావితం చేసే వారిని ప్రధానంగా టీఆర్ఎస్,బిజెపినాయకులు తమ పార్టీలోకి తీసుకునేందుకు భారీగా డబ్బులు ఖర్చు చేస్తూనే ఉన్నారు. పోలింగ్ సమయానికి ఒక్కో వోటుకు ఒక్కోపార్టీ భారీగా ఖర్చు చేయనుంది.ఒకప్పుడు ఒక పార్టీ నాయకుడు,కార్యకర్త కమిట్మెంట్ గా కనిపించేవారు. వోటర్లు స్థిరంగా ఉండేవారు. సందర్భాన్నిబట్టి నిర్ణయం తీసుకునేవారు.కాని హుజురాబాద్ లో చూసినం డబ్బులు ఇస్తే తీసుకునే వోటర్లు.. కాస్త..ఎందుకు ఇవ్వవు.? అని అభ్యర్థులను నిలదీసే వరకు వచ్చింది. ఇది మునుగోడు లో పునరావృతం కాక తప్పదేమో.! భవిష్యత్తు ఎన్నికల్లో డబ్బుల పంపకం అనేది అనవాయితి కావొచ్చేమో.! సామాన్య వ్యక్తులు పోటి చేయకపోవొచ్చేమో.. మొత్తంగా ఈ పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టుకాబోతున్నాయి.ఎన్నికల సంఘాన్ని,ఎన్నికల ను సమర్థవంతంగా నిర్వహించిన టి.ఎన్.శేషన్ లాంటి అధికా రులు వస్తే తప్ప ఎన్నికల వ్యవస్థ బాగుపడేటట్లు కనపడటం లేదు.
– పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192