టెలికాం రంగంలో ఆధునిక 5జి సేవలు
ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులోకి
వొచ్చే రెండేళ్లలో యావత్ దేశమంతా
ప్రగతి మైదాన్‌లో ప్రారంభించిన ప్రధాని మోడీ
ఆధునిక సాంకేతిక స్టాళ్ల పరిశీలన
న్యూ దిల్లీ, అక్టోబర్ 1 : సాంకేతిక రంగంలో భారత్ మరో మైలురాయిని చేరుకుంది. దేశంలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. దిల్లీలో నిర్వహించిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ సమావేశంలో 5జీ సేవలను ప్రధాని మోదీ ప్రారంభించారు.నాలుగో పారిశ్రామిక విప్లపంగా భావిస్తున్న 5జీ సేవలు దేశంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశంలోని ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించారు. ఆరో విడత ఇండియా మోబైల్ కాంగ్రెస్ కార్యక్రమం జరుగుతున్న దిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ప్రస్తుతం నిర్దేశిత నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటు లోకి రానున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. వొచ్చే రెండేళ్లలో యావత్ దేశమంతా 5జీ సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నాయి. 5జీ సేవలను ప్రారంభిస్తున్న మోదీ 5జీ సేవలు ప్రారంభించడానికి ముందు..టెలికాం సంస్థల స్టాళ్లను మోదీ పరిశీలించారు. అక్కడి స్టాళ్లలో కలియతిరిగారు. జియో, ఎయిర్‌టెల్ సహా పలు సంస్థల 5జీ ఉత్పత్తులను వీక్షించారు.
ఆయా కంపెనీల ప్రతినిధులు తమ ఉత్పత్తుల గురించి మోదీకి వివరించారు. ప్రత్యేక కళ్లద్దాలు ధరించి వీడియోలు వీక్షించారు. ఓ స్టాల్‌లో వీడియో గేమ్ సైతం ఆడారు. 2035 నాటికి భారత్‌ను 450 బిలియన్‌డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో 5జీ ముఖ్యపాత్ర పోషిస్తుందని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. 5జీతో కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలను పెంపొందిస్తుందని తెలిపాయి. అలాగే నూతన ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, డిజిటల్‌ఇండియా విజన్‌ను చేరుకోవడానికి దోహదం చేస్తుందని పేర్కొన్నాయి. అయితే దివాలీ నుంచి యూజర్లు 5జీ సేవలను ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, క్వాల్‌కమ్ కంపెనీలు తమ 5జీ సేవల గురించి ప్రధాని మోదీకి వివరించాయి. ఆకాశ్ అంబానీ 5జీ గురించి ప్రధానికి డెమో ఇచ్చారు. ప్రధాని మోదీ 5జీ సేవల్ని ప్రారంభించడం చరిత్రాత్మకమని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. టెలికాం చరిత్రలో ఈ రోజు సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందన్నారు.
డిజిటల్ ఇండియాకు ఇది ఫౌండేషన్‌గా నిలుస్తుందన్నారు. ప్రతి ఒక్కరికీ డిజిటల్ సేవల్ని చేరవేయడంలో 5జీ ఉపకరిస్తుందని మంత్రి వైష్ణవ్ వెల్లడించారు.5జీ సేవలను ప్రారంభించడం పట్ల గర్వంగా ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ తెలిపారు. టెలికాం రంగంలో నాయకత్వ పాత్రను పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇక నుంచి ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ .. ఆసియా మొబైల్ కాంగ్రెస్ కావాలని, అదే గ్లోబల్ మొబైల్ కాంగ్రెస్‌గా అవతరలించాలని ముఖేశ్ వెల్లడించారు. నెక్టస్ జనరేషన్ టెక్నాలజీ కన్నా 5జీ ఎంతో కీలకమైందన్నారు. 21వ శతాబ్దంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్, రోబోటిక్స్, బ్లాక్‌చెయిన్, మెటా వర్స్ లాంటి టెక్నాలజీలకు 5జీ టెక్నాలజీ ఏమాత్రం తీసిపోదన్నారు. ఇవాళ అతి ముఖ్యమైన రోజు అని భారతి సంస్థ చైర్మన్ సునిల్ భారతి మిట్టల్ తెలిపారు. ఓ కొత్త యుగం ప్రారంభంకానున్నదని, 75వ స్వాతంత్ర దినోత్సవ వేళ ఇది జరగడం శుభదాయకమని, 5జీతో ప్రజలకు అనేక కొత్త అవకాశాలు వొస్తాయని సునిల్ మిట్టల్ తెలిపారు.