రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్‌ ‌కానిస్టేబుళ్ల ఆందోళనలు

ప్రత్యక్ష నిరసనల్లో కుటుంబాలతో సహా పోలీసులు
వరంగల్‌, ‌నల్లగొండ జిల్లాల్లో రోడ్డెక్కిన ఖాకీలు
ఇబ్రహీంపట్నం, మంచిర్యాలలో ఫ్యామిలీల ధర్నా
ఆందోళనలతో మిన్నంటుతున్న బెటాలియన్లు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ‌రాష్ట్రంలో ఏక్‌ ‌పోలీస్‌ ‌విధానాన్ని అమలు చేయాలంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల ధన, మాన, ప్రాణాలు రక్షించాల్సిన పోలీసులే ఏకంగా రోడ్డెక్కుతున్నారు. వరంగల్‌ ‌జిల్లా మమూనూరు క్యాంపులో మొదలైన ఆందోళన సెక్రటేరియట్‌ ‌చేరింది. క్రమంగా రాష్ట్రంలోని అన్ని బెటాలియన్లకు  పాకుతోంది. అయితే శనివారం మామునూరు బెటాలియన్‌ ఆవరణలో ఏకంగా యూనిఫాం ధరించిన పోలీసులే నిరసనకు దిగారు. అటు నల్లగొండ జిల్లా అన్నెపర్తి బెటాలియన్‌లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంపై కానిస్టేబుళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ రూరల్‌ ఎస్సై సైదాబాబును సస్పెండ్‌ ‌చేయాలని నిరసనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా నోటికి వొచ్చినట్టు మాట్లాడారని ఆరోపించారు. తక్షణమే సైదా బాబుని సస్పెండ్‌ ‌చేయాలని, లేనట్లయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అయితే బందోబస్తు విధుల్లో ఉన్న సైదాబాబు వద్దకు కానిస్టేబుళ్లు రావడంతో.. బెటాలియన్‌ అధికారులు అతడిని అక్కడిని నుంచి పంపించేశారు. ఏకంగా యూనిఫాంలో ఉన్న పోలీసులే ఆందోళనకు దిగడం హాట్‌ ‌టాపిక్‌ ‌గా మారింది. ఈ పరిణామం రాష్ట్ర పోలీసుశాఖను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. చాలా కాలంగా ఈ విధానం అమల్లోనే ఉన్నా.. ఇప్పుడే పోలీసులు ఎందుకు ఆందోళన చేస్తున్నారనే చర్చ మొదలైంది. ఏక్‌ ‌పోలీస్‌ ‌విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ బెటాలియన్ల వద్ద శనివారం కూడా ఆందోళనలు చోటు చేసుకున్నాయి.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని బెటాలియన్‌ ‌వద్ద కానిస్టేబుళ్ల కుటుంబసభ్యులు ఆందోళన చేశాయి. అటు మంచిర్యాల జిల్లా గుడిపేట్‌ ‌బెటాలియన్‌ ‌కానిస్టేబుళ్ల కుటుంబాలు జిల్లా కేంద్రంలోని ఓవర్‌ ‌బ్రిడ్జిపై ఆందోళనకు దిగాయి. బ్రిటీష్‌ ‌కాలం నాటి మాన్యువల్‌ ఇప్పటికీ నడుస్తోందని, దానిని రద్దు చేయాలని, తమిళనాడు లాంటి సంస్కరణలు తీసుకు రావాలని వారు డిమాండ్‌ ‌చేస్తున్నారు. రాష్ట్రంలో తెలంగాణ స్టేట్‌ ‌స్పెషల్‌ ‌పోలీసు బెటాలియన్లు 13 ఉన్నాయి. ఒక్కో బెటాలియన్‌ ‌లో సగటున 1,500 మంది విధులు నిర్వర్తిస్తారు. ఇందులో 200 మంది జిల్లా కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తారు.

మిగతా 1300 మంది బెటాలియన్‌ ‌పరిధిలోని పోలీసు స్టేషన్లలో రొటేషన్‌ ‌గా మూడు నెలల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీళ్లు ఇలా అన్ని పోలీస్‌ ‌స్టేషన్లకు రొటేట్‌ అవుతూ ఉంటారు. అంటే ఒక్కో కానిస్టేబుల్‌ ఏడాదిలో కనీసం మూడు పోలీసు స్టేషన్లకు తిరగాల్సి ఉంటుంది. ఇలా తిరగడం వల్ల తమ భర్తలు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారని కానిస్టేబుళ్ల భార్యలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక్క జిల్లాలో మూడు నుంచి ఐదేండ్ల పాటు పనిచేసేలా వెసులు బాటు కల్పించాలని డిమాండ్‌ ‌చేస్తున్నాయి. మిగతా సివిల్‌ ‌కానిస్టేబుళ్ల మాదిరిగానే తమకూ సెలవులు, బదిలీలు ఉండే విధానాన్ని తీసుకు రావాలని ఆ కుటుంబాలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page