ఇదీ కేసీఆర్ నైజం..
పదేళ్ల పాలనపై అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధం
మోదీ తెలంగాణ ద్రోహి, కిషన్ రెడ్డి మోదీకి గులాం
విశ్వనగరంగా వరంగల్
ఓరుగల్లు అభివృద్ధికి 6వేల కోట్లు
పది నెలల్లో ప్రజారంజక పాలన
రాష్ట్రంలో సమపాళ్లలో అభివృద్ధి, సంక్షేమం
మహిళా వికాసానికి కాంగ్రెస్ ప్రొత్సాహం
మూసి ప్రక్షాళన చేసి తీరుతాం..
ఇంచార్జి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల సహకారంతో ఉత్తర తెలంగాణ అభివృద్ధి
వరంగల్ ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో సీఎం ఎనముల రేవంత్ రెడ్డి
హన్మకొండ , ప్రజాతంత్ర, నవంబరు 19 : గెలిచినపుడు పదేళ్లు అధికారం చలాయించి.. నేడు ఓడితే ఫాం హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ కు కాంగ్రెస్ పాలనను విమర్శించే హక్కు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పై ఫాంహౌస్‌లో కూర్చొని విమర్శలు చేయడం కాదని.. దమ్ముంటే అసెంబ్లీకి రావాలని, ఏడాది కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్దమని ముఖ్యమంత్రి రేవంత్.. మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు.
తెలంగాణలో గడచిన పది నెలల్లో ప్రగతి పథంలో దూసుకెళ్తుందని, గత ప్రభుత్వ హయాంలో ప్రజలు నిరంకుశత్వానికి లోనయ్యారని, నేడు కాంగ్రెస్ పాలనలో ప్రజలు స్వేచ్చగా ఉన్నారన్నారు. మంగళవారం వరంగల్ వేదికగా హనుమకొండ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మంత్రులు కొండా సురేఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి విజయోత్సవ సభ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. తొలుత సభా ప్రాంగణంలో వివిధ జిల్లాల మహిళా సమాఖ్య సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు.చేతితో మహిళలు చేసిన బొమ్మలు, ఇతర వస్తుసామగ్రిని పరిశీలించారు. చేనేత వస్త్రాలను చేసి తయారు చేసిన వారిని అభినందించారు. అనంతరం భారత దివంగత ప్రధాని, ఉక్కు మహిళా ఇందిరా గాంధీ 107వ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి విజయోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 22 జిల్లాల్లో నూతనంగా నిర్మిస్తున్న మహిళా శక్తి భవనాలను మహిళా మంత్రులు, అధికారులతో కలిసి వర్చువల్ గా ప్రారంభించారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణతో స్వర్గీయ ఇందిరా గాంధీది ప్రత్యేక అనుబంధమన్నారు. ఆమె చివరి శ్వాస విడిచే సమయానికి తెలంగాణలోని మెదక్ నియోజకవర్గం నుంచి ప్రాతినిత్యం వహిస్తున్నారని గుర్తు చేశారు. ఆమె చేసిన విప్లవాత్మకమైన సంస్కరణలతోనే దేశంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు మేలు చేకూరిందనన్నారు. ఆమె స్పూర్తితోనే నేడు తెలంగాణ రాష్ట్రంలో మహిళా అభ్యున్నతికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. అదే విధంగా నాడు దేశంలో పేదల అభ్యున్నతికి ఇందిరమ్మ కృషి చేస్తే తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చించింది మన తల్లి సోనియమ్మ అని అన్నారు. ఆమె కృషితోనే నేడు తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. తెలంగాణ ఏర్పాటులో కవులు, కళాకారులది ప్రత్యేక స్థానమని అందులో ఓరుగల్లు వంటి పోరాటాల గడ్డ నుంచి కాళోజి వంటి కవి తెలంగాణ ఏర్పాటే ధ్యేయంగా కవితలు, రచనలు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇక్కడి ప్రజానీకాన్ని జాగృతం చేయటంలో ఆయన ప్రత్యేక పాత్ర పోషించారన్నారు. అలాంటి కాళోజీ కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసేందుకు పదేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన పూర్తి చేయకుండా వదిలేసిన బీఆర్ ఎస్ ప్రభుత్వం చిత్తశుద్దిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చాకా రూ.45కోట్లు ఏకకాలంలో మంజూరు చేసి పదినెలల్లోనే అద్భుతంగా కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించుకున్నామన్నారు.
మహిళా సాధికారితకు ప్రాధాన్యం..
ఇందిరా గాంధీ స్పూర్తితో మహిళలు ఆర్థికంగా చైతన్యవంతమైతే రాష్ట్రంలోని బీపీఎల్ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతాయని, అందుకుగానూ మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా వారిని చైతన్యవంతం చేస్తోందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏడాదిలో మహిళా సమైఖ్య సంఘాలకు రూ.34వేల కోట్లు వడ్డీ లేని రుణాలు అందించామన్నారు. అందులోనూ రుణాలు తీసుకున్నగ్రూపులో ఎవరికైనా ప్రమాదం జరిగితే మిగతా వారికి ఇబ్బంది కలుగకుండా వారికి బీమా సౌకర్యం కూడా కల్పించామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కృషితో తెలంగాణలో మహిళామణులను అంబానీ, అదానీలతో సమానంగా పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు వారికి 4,000 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా తొలివిడతగా 1000 మెగావాట్లను ఉత్పత్తి చేసి వ్యాపారం చేసేలా ఆయా జిల్లాల మహిళా సమైక్య సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు కూడా డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో ప్రారంభించామన్నారు. అంతే కాకుండా మహిళలకు వ్యాపార వేత్తలతో సమానంగా కార్యాలయాలు ఉండాలన్నా ఉద్దేశంతో 22 జిల్లాల్లో మహిళా శక్తి కేంద్ర భవనాలను రూ.110కోట్లతో ఎకరా స్థలంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.
విశ్వనగరంగా వరంగల్..
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద పట్టణం వరంగల్ అని, ఎంత మంది ముఖ్యమంత్రులు మారినా వరంగల్ మాత్రం అభివృద్దికి దూరంగానే ఉంటోందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వరంగల్ ను విశ్వనగరంగా మారుస్తామన్నారు. ఇప్పటికే వరంగల్ అభివృద్దికి ఇంచార్జి మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు గడచిన 6నెలలుగా శ్రమించి ప్రతిపాదనలు రూపొందించారన్నారు. వారి నివేదికలు అనుసరించి వరంగల్ కు కాకతీయ టెక్స్ టైల్ పార్క్, అధునాతంగా మమూనూరు ఎయిర్ పోర్ట్, వరంగల్ డ్రైయినేజీ వ్యవస్థ, ఇన్నర్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్లు ఇలా వరంగల్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు రూ.6వేల కోట్లు మంజూరు చేశామన్నారు. వాటికి సంబంధించి జీవోలను కూడా ఇచ్చామని తెలిపారు. వరంగల్ అభివృద్ధితో ఉత్తర తెలంగాణ పూర్తిగా మారిపోతుందని, ఎయిర్ పోర్టు నిర్మాణంతో వర్తక వ్యాపారాలు ఈ ప్రాంతంలో పెరుగుతాయన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయన్నారు. రానున్న కాలంలో ఓరుగల్లును అన్ని విధాలా అభివృద్ది చేసేవరకు అధికారులను నిద్ర పోనివ్వనని అన్నారు.
బిల్లా, రంగాలవి ఏడుపు రాజకీయాలు..
బీఆర్ఎస్ అధినేత ఓడి ఫాంహౌస్ కు పరిమితమైతే బిల్లా, రంగాలు ఇద్దరు కాంగ్రెస్ అభ్యున్నతి, ప్రజాదరణ చూడలేక ఏడుపు రాజకీయాలు చేస్తున్నారన్నారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రంలో 18 గంటలు శ్రమించి అన్ని వర్గాలకు మేలు చేస్తున్న కాంగ్రెస్ ను మెచ్చుకోకున్నా.. కనీసం మౌనంగా ఉండకుండా అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడితే వొచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఏమి కాలేదని, కల్వకుంట్ల కుటుంబంలో నాలుగు ఉద్యోగాలు ప్రజలు ఊడగొడితే తెలంగాణలో 50వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వొచ్చాయన్నారు. కేసీఆర్ తెలంగాణకు మందుకు బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన ఫాం హౌస్ లోనే ఉంటూ రెస్ట్ తీసుకోవాలని.. బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేశారు.
తెలంగాణ ద్రోహి మోదీ..
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంపై పీఎం మోదీ విషం చిమ్మారని, అలాంటి మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గులాంగిరీ చేస్తున్నారన్నారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే సాయం చేయాల్సింది పోయి అడ్డుపడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే హక్కలేదని, కిషన్ రెడ్డికి పదవి కేంద్రం ఇస్తే రాలేదని, సికింద్రబాద్ తెలంగాణ ప్రజలు ఇస్తే వొచ్చిందన్నారు. మూసీ నది ప్రక్షాళనకు సహకరించి హైదరాబాద్ ను ప్రపంచస్థాయికి తెచ్చేలా కృషి చేయాల్సింది పోయి అభివృద్దికి ఆటంకం కలిగించటం సమంజసం కాదన్నారు. కిషన్ రెడ్డి అంటే తనకు గౌరవం ఉండేదని, రాను రాను అది తగ్గిపోయిందన్నారు.
రైతులకు అండగా ఉంటాం..
దేశంలో పదేళ్లు అధికారంలో ఉండి రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం పది నెలల్లో దేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా రూ.18వేల కోట్ల రుణ మాఫీ చేసినా ఓర్వలేక విష ప్రచారం చేస్తోందన్నారు. మిగతావి కూడా త్వరలోనే చేస్తామని, రైతులు టెక్నికల్ సమస్యలు అధికారుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో పండని విధంగా ధాన్యం తెలంగాణలో దిగుబడి అయ్యిందని, సుమారు 1.55లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వొచ్చిందన్నారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా సన్నాలకు కూడా రూ.500బోనస్ వేస్తూ ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.
అప్పుల ఊబిలో ఉన్నా అడుగు ముందుకే..
గల పాలకుల నిర్లక్ష్యపు వైఖరితో తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని, నేడు పైసా పైసా జమ చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నామన్నారు. తెలంగాణ నెల ఆదాయం రూ.18,500కోట్లు ఉండగా రూ.6,500 కోట్లు జీతాలు, పెన్సన్లు, రూ.6,500కోట్లు గత పాలకుల అప్పుల వడ్డీలకు పోతుందని, మిగిలిన రూ.5,500 కోట్లతో తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్నామన్నారు. అయినా కూడా విపక్షాలు ప్రభుత్వంపై విషపు ప్రచారాలు చేయటం తగదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఐదేళ్లలో అన్ని విధాల అభివృద్ది పథంలో తీసుకెళ్తామన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం ముఖ్యసలహాదారు వేం నరేందర్ రెడ్డి, పీసీసీ ఛీఫ్ మహేష్ గౌడ్, ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు దనసరి సీతక్క, కొండా సురేఖ, కొమటి రెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీదర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు,ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా. రాంచంద్రునాయక్, ఎంపీలు పోరిక బలరాం నాయక్, కడియం కావ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవురి ప్రకాష్ రెడ్డి, హనుమాండ్ల యశస్విని రెడ్డి, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, నాగరాజు, మందుల సామెలు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మేయర్ గుండు సుధారాణి, సీనియర్‌నాయకులు కేకే, హన్మంతరావు, సీఎస్ శాంతకుమారి, పలు శాఖల చైర్మెన్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.