నారాయణఖేడ్, ప్రజాతంత్ర, నవంబర్ 15: ఈనెల 18న నారాయణఖేడ్ కు ఎన్నికల పరిశీలకులు దీపక్ సింగ్ల రానున్నట్లు రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ ఎన్.వెంకటేష్ అన్నారు. బుధవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 19, 20 తేదీలలో సాధారణ అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థుల సమక్షంలో సింబల్ లోడింగ్ చేయడం జరుగుతుందన్నారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్నిక విధుల్లో ఉన్న పిఓ, ఏపీఓలకు 21, 22, 23 తేదీలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించి, ట్రెనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. 24వ తేదీన హోమ్ ఓటింగ్ కార్యక్రమంలో భాగంగా 85 సంవత్సరాలు దాటిన వృద్దులు 10 మంది, ఏడు మంది వికలాంగులను గుర్తించడం జరిగింది. ఇంటికి వెళ్లి ఓటింగ్ అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో పోస్టల్ ఓటింగ్ సెంటర్ ఏర్పాటు చేసి 27, 28, 29 తేదీలలో అత్యవసర విభాగం, డ్రైవర్, కండక్టర్ లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1275 మంది ఓటును వినియోగిస్తారన్నారు. 30వ తేదీన పోలింగ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. డిసెంబర్ 3వ తేదీన గీతం యూనివర్సిటీలో లెక్కింపు ఉంటుందన్నారు.