- 26 నుంచి ‘సాత్ సే హాత్ జోడో’ పేరుతో కాంగ్రెస్ మరో యాత్ర
- వివరాలు వెల్లడించిన కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్
న్యూ దిల్లీ, జనవరి 14 : జోడో యాత్ర’ ముగియకముందే.. కాంగ్రెస్ పార్టీ మరో యాత్ర చేపట్టనుంది. 2024 ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ ‘సాత్ సే హాత్ జోడో’ అనే మరో యాత్ర ప్రారంభించనుంది. ఈ యాత్ర జనవరి 26 రిపబ్లిక్ డే నుండి ప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఈ సందర్భంగా శనివారం కాంగ్రెస్ సీనియర్ నేత జై రామ్‌రమేశ్ వి•డియాతో మాట్లాడుతూ..‘రాహుల్ గాంధీ చేపట్టిన జోడోయాత్రకు కొనసాగింపుగానే ఈ సాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగనుంది. జోడో యాత్రలో 2024 ఎన్నికల లక్ష్యమనే సందేశం ప్రజలకు చేరువ కాలేదు. జోడో యాత్రలో బహుళ వర్గాల నుండి వొచ్చిన అభిప్రాయలకనుగుణంగా ఈ యాత్రను ప్రారంభించడం జరిగిందని అన్నారు. అలాగే ‘సాత్ సే హాత్ జోడో’ యాత్ర మూడు అంచెల ప్రచారం జరగనుందని ఆయన తెలిపారు.
మొదట రాష్ట్ర రాజధానుల్లో మహిళల భాగస్వామ్యంతో పాదయాత్రలు, సమావేశాలు, ర్యాలీలు జరగనున్నాయి. ఆ తర్వాత రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఇంటింటి ప్రచారం జరగనుందని రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన జోడో యాత్రలో రాహుల్ తెలుసుకున్న ప్రజా సమస్యలు, బిజెపి వైఫల్యాలపై రెండు కరపత్రాలను విడుదల చేశారు. కాగా, జోడో యాత్రలో తెలుసుకున్న ప్రజా సమస్యలపై రాహుల్ కాంగ్రెస్ కమిటీలకు బహిరంగ లేఖ రాశారు. రాహుల్ గాంధీ రాసిన లేఖలో ‘ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, ధరల పెరుగుదల వంటి విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు.
ఇక బిజెపి ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లపరం చేస్తుందనీ.. ఇది దేశవ్యాప్తంగా నిస్సహాయతకు నిదర్శనంగా నిలుస్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాహుల్ లేఖ ఆధారంగానే ‘సాత్ సే హాత్ జోడో’ యాత్ర కార్యాచరణ ఉండనుంది. ఈ యాత్రకు సన్నద్ధం కావాలని కాంగ్రెస్ కమిటీలకు ఇప్పటికే సూచించడం జరిగిందని రమేష్ తెలిపారు. కొత్తగా చేపట్టబోయే ప్రచారం యాత్ర 2.5 లక్షల గ్రామ పంచాయతీలు, ఆరు లక్షల గ్రామాలు, 10 లక్షల బూత్‌లకు చేరుకుంటుందని రమేష్ పేర్కొన్నారు.