- యాత్రకు భారీ బందోబస్తు…
- ఉగ్రముప్పు లేకుండా భద్రతా చర్యలు
శ్రీనగర్, జూన్ 28 : మూడేండ్ల విరామం తర్వాత అమర్‌నాథ్ యాత్ర పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30 గురువారం నుంచి యాత్ర మొదలు కానున్నది. ఇందుకోసం శ్రీ అమర్‌నాథ్ ఆలయ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్రకు రాలేని వారి కోసం ఆన్‌లైన్ దర్శన ఏర్పాట్లు కూడా చేసింది. యాత్రకు వచ్చేవారు ఆధార్ కార్డు (లేదా) బయోమెట్రిక్ వివరాల ఆధారంగా జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించింది. 2019లో అర్టికల్ 370 రద్దుతో యాత్రను అర్ధంతరంగా నిలిపివేశారు. 2020, 2021లో కరోనా కారణంగా యాత్రను నిర్వహించలేదు.
యాత్రకు భారీ బందోబస్తు…ఉగ్రముప్పు లేకుండా భద్రతా చర్యలు
అమర్‌నాథ్ యాత్ర 30 నుంచి ప్రారంభం కానుండడంతో ప్రభుత్వం ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. ఉగ్రవాదుల నుంచి ఎలాంటి ముప్పు లేకుండా చర్యలు తీసుకున్నారు. రెండేళ్ల నుంచి కరోనా కారణంగా అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. అయితే కరోనా తగ్గడంతో ఈ ఏడాది నుంచి యాత్ర పునః ప్రారంభం అవుతోంది. జూన్ 30 నుంచి యాత్ర ప్రారంభం అవనుంది. ఆగస్టు 11 వరకు ఈ యాత్ర కొనసాగనుంది. మంచు కొండల్లో కొలువై ఉన్న శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. ఈ ఏడాది 3 లక్షలకు పైగా భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
దీంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అమర్‌నాథ్ యాత్రకు వచ్చే యాత్రికులు తప్పకుండా ఆధార్ కార్డుగాని, ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ గానీ సమర్పించాల్సి ఉంటుంది. మరో వైపు అమర్ నాథ్ యాత్రకు ముందు కశ్మిర్‌లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు కలకలం రేపుతున్నాయి. అమర్ నాథ్ యాత్ర కోసం చేపట్టిన తనిఖీల్లో కశ్మీర్ దోడా జిల్లాల్లో భద్రతా దళాలు ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. ఉగ్రవాది ఫరీద్ అహ్మద్ నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రీ స్వాధీనం చేసుకున్నారు. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.