ప్రస్తుత అవసరాలకు సరిపడేలా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల భర్తీ
మందులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
డీసీఏ అధికారులతో సమీక్షలో మంత్రి దామోదర రాజ నర్సింహ
నాసిరకం, నకిలీ మెడిసిన్ తయారు చేసే వారిపై, వాటిని విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఫార్మా ఇండస్ట్రీస్, డ్రగ్ మానుఫాక్చరింగ్ యూనిట్స్, మెడికల్ హాల్స్, ఫార్మసీలలో మరింత విస్తృతంగా తనిఖీలు చేయాలని సూచించారు. ఫార్మా సంస్థలు ఉన్న చోట అదనంగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను నియమించాలన్నారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశంలో ఎలాంటి రాజీ ఉండద్దన్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్లలో కంప్లైంట్ సెల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం, డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు, తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో వెంగళరావునగర్‌లోని డీసీఏ ఆఫీసులో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడిసిన్‌కు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ, ఆకస్మిక తనిఖీల కోసం స్టేట్ విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఈ ఏడాది 21,639 తనిఖీలు నిర్వహించి, 3,416 సంస్థలపై (మెడికల్ షాప్స్, మానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తదితర వాటిపై చర్యలు తీసుకున్నామని డీసీఏ అధికారులు మంత్రికి తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ ఒక్కటే ఉందని, దీనివల్ల ఎక్కువ సాంపిల్స్‌ను పరీక్షించలేకపోతున్నామని అధికారులు విన్నవించారు. 1956 లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ఈ ల్యాబ్‌లో నెలకు గరిష్టంగా 400 సాంపిల్స్ మాత్రమే పరీక్షించగలుగుతున్నామని చెప్పారు.ఈ ఏడాది ఇప్పటివరకూ 3,255 సాంపిల్స్ మాత్రమే టెస్ట్ చేయగలిగామని తెలిపారు. 2014 నాటికి సుమారు 20 వేల మెడికల్ షాపులు ఉంటే, ఇప్పుడు 45 వేలకు పెరిగాయని.. కానీ, గత పదేండ్లలో కొత్తగా డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ రాలేదని, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల సంఖ్యను పెంచలేదన్నారు.
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని మంత్రి అధికారులకు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్ ఆధునీకరణ, కొత్తగా 4 ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మషల్కర్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం 71 మంది డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు మాత్రమే ఉన్నారని, కనీసం 150 (అడిషనల్‌గా ఇంకో 80 పోస్టులు) మంది అవసరమని అధికారులు మంత్రికి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి తగినన్ని పోస్టులు మంజూరు చేయిస్తామని మంత్రి తెలిపారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్లను వారు పనిచేస్తున్న ఏరియాకే పరిమితం చేయొద్దని, రాండమ్‌గా ఇతర డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల పరిధిలోని సంస్థల్లో తనిఖీలకు పంపించాలని డీజీ కమలాసన్‌రెడ్డిని మంత్రి ఆదేశించారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, డీఎంహెచ్వోలతో కోఆర్డినేట్ చేసుకోవాలన్నారు.