భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన 5 దిగ్గజ ఫార్మా కంపెనీలు

మంత్రి శ్రీధర్ బాబు హర్షం

త్వరలో పరిశ్రమల విద్యుత్ విధానం ప్రకటన
హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీలో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి ఏడాది కాలంలో పరిశ్రమల నిర్మాణానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్రంలోని ఐదు దిగ్గజ ఔషధ కంపెనీల ప్రతినిధులతో ఆయన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో డా.రెడ్డీస్, అరబిందో, హెటెరో, లారస్, ఎంఎస్ ఎన్ మందుల కంపెనీల ప్రతినిధులు పాల్గొని తమ ప్రతిపాదనలను పంచుకున్నారు. ఈ కంపెనీలు ఫార్మా సిటీలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేయడం పట్ల శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఏర్పాటు కానున్న ఫ్యూచర్ సిటీలో ఫార్మా నగరం కూడా భాగంగా ఉంటుందని తెలిపారు. ఈ ఐదు ఫార్మా కంపెనీల్లో ప్రస్తుతం రెండు లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తొలి దశలో ఒక్కో కంపెనీ 50 ఎకరాల స్థలంలో పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించినట్టు శ్రీధర్ బాబు తెలిపారు. గ్రీన్ ఫార్మా సిటీకి మంచినీరు, విద్యుత్తు సరఫరా పనులు ఇప్పటికే ప్రారంభమైనట్టు ఆయన చెప్పారు.
కొంగర కలాన్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు 300 అడుగుల వెడల్పుతో ప్రపంచ స్థాయి రహదారి నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిందని వివరించారు. వొచ్చే జూన్ నాటికి ఈ రోడ్డు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. రోడ్డుకు సమాంతరంగా మెట్రో రైలు వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. భారీ ఫార్మా పరిశ్రమల కోసం లాజిస్టిక్స్ పార్క్, ప్యాకేజింగ్ పార్క్, కార్మికుల కోసం డార్మిటరీలు నిర్మిస్తామని వెల్లడించారు. గుజరాత్, ఒడిషా రాష్ట్రాల్లో భూములను చౌక ధరకు ఇస్తున్నా అక్కడ ఔషధ పరిశ్రమలకు సంబంధించిన అనుబంధ పరిశ్రమలు, అనుకూల వాతావరణం లేదని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రతి పరిశ్రమ ప్రత్యేకంగా బాయిలర్లు ఏర్పాటు చేయనవసరం లేకుండా పైపుల ద్వారా వేడి నీటి ఆవిరి (స్టీమ్) అందించే విషయాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. టీజీఐఐసీ నీటిని నేరుగా సరఫరా చేస్తుందని వివరించారు. త్వరలో పరిశ్రమల విద్యుత్తు విధానాన్ని ప్రకటించనున్నట్టు శ్రీధర్ బాబు వెల్లడించారు. సమావేశంలో టీజీఐఐసీ ఎండీ డా. విష్ణువర్ధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ డా. మల్సూర్ లు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page