51 మంది బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా బీ ఫామ్‌లు అందజేత

బీ ఫామ్‌తో పాటు ఎన్నికల ఖర్చులకుగాను రూ.40 లక్షల చెక్కులు
మిగతా వారు నేడు ప్రగతీభవన్‌లో తీసుకోవాలని సూచన
కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశమున్నట్లు ప్రచారం
బీ ఫామ్‌లు అందని అభ్యర్థుల్లో ఆందోళన

న్యాయపరమైన అంశాల వల్లే కొన్ని సిట్టింగ్‌ ఎంఎల్‌ఏల స్థానాల్లో మార్పులు చేయాల్సి వొచ్చిందని బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అన్నారు. జాబితా విడుదల తర్వాత తొలిసారిగా ఆదివారం ఆయన బీఆర్‌ఎస్‌ భవన్‌లో అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్‌లు అందజేయడానికి ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం మధ్యాహ్నం 12.15 లకు సరిగ్గా మూడు నిమిషాల ముందు 12.12 నిమిషాలకు సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ భవన్‌కు చేరుకున్నారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి, రిజిస్టర్‌లో సంతకం చేశారు. అనంతంరం ఎంఎల్‌ఏలు, అభ్యర్థుల సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ…వాస్తవానికి వేములవాడలో అభ్యర్థిని మార్చాలింసన అవసరంలేదని, ప్రస్తుత సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ గెలుస్తాడని సర్వేలన్నీ వెల్లడిరచినా న్యాయపరమైన అంశాల వల్ల మార్చాల్సి వొచ్చిందని వివరణ ఇచ్చారు. మొత్తానికి మార్పులు, చేర్పులు సానుకూలంగా జరిగాయని, పరస్పర అవగాహనతో, సామరస్యంగా ముగిసాయని తెలిపారు. ఎన్నికల వేళ సీట్లు రానివారికి అసంతృప్తి సహజమని, అయితే కేవలం ఎంఎల్‌ఏ కావడమే అంతా కాదని, పార్టీలో ఎన్నో అవకాశాలు ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఎన్నికల ప్రచారం సందర్భంగా అందరితో ఓపికగా, సామరస్యంగా ఉండాలని, అందరినీ కలుపుకుపోవాలని దిశానిర్దేశం చేశారు. గతంలో గెలిచిన తమ నాయకులపై చిన్న చిన్న సాంకేతిక అంశాలకు సంబంధించి లోపాలపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, వనమా వంటి వారి విషయంలో అలా జరిగిందని, అందుకే చిన్నచిన్న విషయాలపై కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీ ఫామ్‌ను చాలా జాగ్రత్తగా నింపాలని, ఎలాంటి సందేహాలున్నా తమ న్యాయబృందాన్ని సంప్రదించి సహాయం పొందాలని తెలుపుతూ స్వయంగా పార్టీ న్యాయ సలహాదారు ఫోన్‌ నెంబరును కేసీఆర్‌ వెల్లడిరచారు. పార్టీలో రకరకాలైన కార్యకర్తలు, ఇతరులు ఉంటారని, ఎటువంటి ఈగోలకు పోకుండా అభ్యర్థులు స్వయంగా వెళ్లి వారిని కలిసి సహకరించేలా చేసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. అయితే శనివారం వరకూ మంచిరోజులు లేనందున, బీ ఫామ్‌లపై పలు చోట్ల తాను సంతకాలు చేయాల్సినందున అందరి బీ ఫామ్‌లు సిద్ధం కాలేదని, 51 మంది బీ ఫామ్‌లు మాత్రమే సిద్ధం చేయగలిగామని, మిగితావి నేటికి సిద్ధమవుతాయని, నేడు ప్రగతి భవన్‌లో వాటిని అభ్యర్థులకు అందజేస్తామని కేసీఆర్‌ వెల్లడిరచారు. అనంతరం 51 మంది అభ్యర్థులకు సీఎం కేసీఆర్‌ రెండు సెట్ల బీ ఫామ్‌లు తన చేతుల మీదుగా అందజేశారు. బీ ఫామ్‌తో పాటు ఎన్నికల ఖర్చులకు గాను రూ. 40 లక్షల చెక్కులను కూడా అభ్యర్థులకు సీఎం కేసీఆర్‌ అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి నుంచి పోటీకి కేసీఆర్‌ బీ ఫామ్‌ను గంప గోవర్దన్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి బీ ఫామ్‌ను కవిత అందుకున్నారు. ఇక శనివారం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్యను మంత్రి కేటీఆర్‌ కలిసిన నేపథ్యంలో జనగామ సీటుపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ జనగామ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌ రెడ్డి బీ ఫామ్‌ను అందుకున్నారు. అనంతరం ఎంఎల్‌ఏ అభ్యర్థులతో కలిసి సీఎం కేసీఆర్‌ మధ్యాహ్న భోజనం చేశారు. ఇదిలా ఉంటే కేవలం 51 మంది అభ్యర్థులకే బీ ఫామ్‌ల పంపిణీ జరిగిన నేపథ్యంలో ఇదివరకు ప్రకటించిన కొన్ని స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఉండవొచ్చనే ప్రచారం ఊపందుకుంది. దీంతో బీ ఫామ్‌లు రాని లభ్యర్థుల్లో సహజంగానే తమకు టికెట్‌ వొస్తుందో రాదో అనే ఆందోళన నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page