- అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడా..?
- అన్నేండ్లు చేయని కాంగ్రెసోళ్లు ఇప్పుడు చేస్తనంటె ఎట్ల నమ్ముతరు..?
- కథలాపూర్లో ఎన్నికల ప్రచార సభలో మంత్రి కేటీఆర్
వేములవాడ, ప్రజాతంత్ర, నవంబర్ 15 : కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏవి• చేయలేదని..ఇప్పుడు గెలిపిస్తే అది చేస్తం, ఇది చేస్తం అని పార్టీ నేతలు కోతలు కోస్తున్నరని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బుధవారం వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…కాంగ్రెస్ మాటలు నమ్మవద్దని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి లేదని, అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడా..? అని మంత్రి ప్రశ్నించారు. 2014కు ముందు తెలంగాణల కరెంటు గోస ఎట్లుండెనని, ఎవరన్న చచ్చిపోతే స్నానాల కోసం ఒక్క అరగంట కరెంటు ఇయ్యమని బతిమాలేటోళ్లని, రాత్రిపూట కరెంటు ఇస్తె పొలాలకు నీళ్లు పెడుతందుకు రైతులు అర్ధరాత్రి బావుల కాడికివొయి పాములు కరిచి, తేళ్లు కరిచి చచ్చిపోయిండ్రని దుయ్యబట్టారు. దినమంత పనిచేసి కాసేపు పండుకుందామంటే కరెంటు లేక ఇంట్లె పంక తిరగకపోయేదని, కరెంటు లేక ఇంత అస్తవ్యస్తమైన జీవితం ఉండేదని, ఇప్పుడు ఆ అవస్తలు అన్నీ తీరిపోయినయని, కాంగ్రెసోడు 60 ఏండ్లు చేయని పని, మేం ఆరున్నర ఏండ్లళ్ల చేసినమని, అందుకే దయచేసి ప్రజలు బాగా ఆలోచించి వోటేయాలని కెటిఆర్ కోరారు.
ఎండకాలం వొస్తే ఊర్లల్ల తాగునీళ్లకు అవస్తలు ఉండెనని, ప్రజాప్రతినిధులు ఊర్లళ్లకు పోతందుకు బయపడేటోళ్లని, ఊర్లెకు పోతే మహిళలు బిందెలు పట్టుకుని ఏడ అడ్డం తిరుగుతరో అని గుబులు పడేటోళ్లని, ఇప్పుడా పరిస్థితి ఉందా..అంటూ కెటిఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయినంక ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు వొస్తున్నయన్నారు. ఇవన్నీ ప్రజలు ఆలోచన చేయాల్నని కోరారు. ఇంత అభివృద్ధి చేసినా కాంగ్రెసోడు, బీజేపోడు తప్పుడు కూతలు కూస్తుండ్రని, వాళ్ల మాటలు నమ్మి మోసపోకండని సూచించారు.
బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉందిగా..ఈసారి కాంగ్రెస్కు ఇద్దామని ఆడొగడు, ఈడొగడు అంటున్నరట అంటూ నిన్న అన్నం తిన్నమని, ఇయ్యాల తినమా..మంచి చేసెటోళ్లను మళ్లమళ్ల గెలిపిస్తే తప్పేందంటూ కెటిఆర్ ప్రశ్నించారు. అయినా గతంలో 11 సార్లు అధికారంల ఉండి ఏం చేయని కాంగ్రెసోడు ఇప్పుడు చేస్త అంటే ఎట్ల నమ్ముతరని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంటు చాలు రైతులకు అంటూ కుళ్లా మాట్లాడుతున్నరని, ఏకంగా పీసీసీ అధ్యక్షుడే ఈ మాట అంటున్నడని, 10 హెచ్పీ మోటార్లు పెడితే పొలాలు అయ్యే పారుతయని చెప్తున్నడని, ఇట్లాంటి కాంగ్రెసోళ్లను మళ్లా గెలిపిస్తరా..మళ్లా ఎనకటి రోజులు తెచ్చుకుంటరా..అంటూ కెటిఆర్ ప్రశ్నించారు. 60 ఏండ్లు అధికారంల ఉండి ఏం జేయని సన్నాసోడు ఇప్పుడు చేస్తడా..? చేస్త అంటే నమ్ముదామా..? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తడా..అంటూ మంత్రి కెటిఆర్ వోటర్లను ఆలోచింపజేశారు.