కిషన్ రెడ్డి అబద్ధాలతో ప్రజలను మోసం
ట్విట్టర్ వేదికగా మండిపడ్డ మంత్రి కెటిఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 1 : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు కేటాయించామని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. నేను మిమ్మల్ని సోదరుడిగా గౌరవిస్తానని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చే దురదృష్టకర కేంద్ర మంత్రిని చూడలేదన్నారు. తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు కేంద్రం కేటాయించిందని చెప్పడం అబద్ధమన్నారు. కిషన్ రెడ్డికి క్షమాపణ చెప్పే ధైర్యం కూడా లేదన్నారు.
హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రాన్ని నెలకొల్పుతామని ప్రకటించారు. కానీ దాన్ని గుజరాత్‌కు తరలించారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పటికీ హైదరాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు కానీ..తప్పును మాత్రం సరిదిద్దుకోవడం లేదన్నారు. తెలంగాణకు ఇచ్చిన వాగ్దానాలను కేంద్రం ఎందుకు తుంగలో తొక్కుతుందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
గుజరాత్ బాసులను సంతోషపెట్టడానికి అర్ధ సత్యాలు, తప్పుడు వార్తలను ప్రచారం చేసే వ్యక్తిగా కిషన్ రెడ్డి మారారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కేంద్రం ఎందుకు తుంగలో తొక్కుతున్నదో ప్రధాని మోదీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. విభజన చట్టంలోని హావి•లను అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఏపీఆర్‌ఏలో తెలంగాణకు గానీ, పక్క రాష్ట్రమైన ఆంధప్రదేశ్‌కు గానీ ఇచ్చిన ఒక్క హావి•ని కూడా నిలబెట్టుకోకపోవడం సిగ్గుచేటు అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.