న్యాయవ్యవస్థ స్వతంత్రతపై గత దశాబ్దకాలంగా ఏదో ఒక రీతిన దాడులు జరుగుతునే ఉన్నాయి. ఎప్పటికప్పుడు జవసత్వాలను ఉద్దీపన చేసుకుంటూనే సుప్రీం తన వ్యక్తిగత స్వతంత్రతను, న్యాయవ్యవస్థ ప్రతిష్టను ప్రస్ఫుటింప చేస్తోంది. ఈ క్రమంలో చట్టసభలతోను, పాలనా వ్యవస్థలతోను ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సంయమనం కోల్పోకుండా నిజాయితీని చాటుకుంటూ సర్వోన్నత న్యాయస్థానం తన ఉనికిని కాపాడుకుంటోంది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి న్యాయవ్యవస్థను తీసుకురావడంతో రానున్న రోజుల్లో జరిగే వివాదాలపై అపుడే న్యాయనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గొంగళి పురుగు తన రూపాన్ని మార్చుకొని సీతాకోకచిలుకలా మారే క్రమం ఆసన్నమైందని గుర్తించిన సుప్రీం కోర్టు కొద్ది రోజులుగా తనపై ఉన్న అపవాదులను వదిలించుకునే చర్యలను ఎలాంటి తొందరపాటు లేకుండా చేపట్టింది.
అందులోభాగంగానే కీలక కేసుల ప్రత్యక్ష ప్రసారం, ఏ రోజుకారోజు తీర్పుల పాఠాలను దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలతో తాజాగా సమాచార హక్కు చట్టం పరిధిలోకి తనకు తానుగా చేరింది. ప్రధాన న్యాయమూర్తుల ముందు ఇపుడు పెను సవాళ్లు ఉన్నాయనేది అందరికీ తెలిసిన అంశమే. కేసుల పరిష్కారం ఒక ప్రధాన సమస్య కాగా, న్యాయమూర్తుల నియమాకాలు, పదోన్నతులు, దేశంలోని ఇతర న్యాయస్థానాలను ఐసీటీ పరిధిలోకి తీసుకురావడం, న్యాయస్థానాల్లో రాజకీయ జోక్యానికి తావులేని రీతిలో ‘ఫైర్‌వాల్స్’ నిర్మించుకోవడం, చట్టాన్ని న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే అత్యంత ప్రాధాన్యమైన కేసుల్లో ప్రజల మనోభావాలకు అనుగుణంగా స్పందించడం వంటివి అనేవి పెను సవాళ్లే. పెండిరగ్ కేసుల పరిష్కారంపై ఎంతగానో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం వివిధ కోర్టుల్లో 50 ఏళ్లు దాటిన కేసులు వెయ్యి, పాతికేళ్లు దాటిన కేసులు రెండులక్షలకు పైగా పెండిరగ్లో ఉన్నాయి. ఇవి ఎందుకు ఇంతకాలంగా పెండిరగ్లో ఉన్నాయనే దానికి ఎవరి వద్దా సమాధానం లేదు. ప్రతి వ్యవస్థకూ టైమ్‌లైన్ ఉంటుంది. టైమ్ చార్టర్ ఉంటుంది. బ్యాంకుకు వెళ్తే ఐదు నిమిషాల్లో డీడీ ఇస్తామని, ఐదు నిమిషాల్లో నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని, ఐదు నిమిషాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని, కొత్త అకౌంట్ ప్రారంభించాలంటే 15 నిమిషాలు పడుతుందని కాలవ్యవధి ఉం టుంది. న్యాయస్థానాలకు కాల వ్యవధి ఏర్పాటు చేసుకోలేదు. ఒక కేసు దాఖలైన తర్వాత దానిని ఎంతకాలంలో పరిష్కరిస్తారనే వ్యవధిని నిర్ణయించుకోలేదు. అలా నిర్ణయించే అధికారం, పరిస్థితి ప్రభుత్వానికి లేదు, పాలనా వ్యవస్థకూ లేదు. చట్టసభలు ఇలాంటి వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటున్నాయి. న్యాయస్థానాలే తమకు తాము జవాబుదారీతనాన్ని నిర్ధారించుకోవల్సిన సమయం ఆసన్నమైంది. ప్రతి కేసుకూ టైమ్‌లైన్ పెట్టుకోవాలి, అపుడు సామాన్యుడు ఆశిస్తున్న న్యాయం సకాలంలో అందే వీలుంటుంది.
ఒక పక్క పాతకేసుల్ని పరిష్కరిస్తున్నా కొత్త కేసులు నమోదుతో గుట్టలా పేరుకుపోతున్నాయి. ఈ సమస్య హైకోర్టుల్లో, జిల్లా కోర్టుల్లో, మెట్రోకోర్టుల్లో మరీ ఎక్కువగా ఉంది. సుప్రీం కోర్టులో 59,867 కేసులు పెండిరగ్లో ఉన్నాయి. తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ముందు నాలుగు, ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు ఐదు, ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు 47 కేసులున్నాయి. వీటికి అనుబంధంగా మరో 499 కేసులున్నాయి. ఇక హైకోర్టులు, జిల్లా కోర్టులు, కింది స్థాయి కోర్టుల్లో కేసులు గుట్టల్లా పేరుకుపోయాయి. వీటన్నింటినీ పరిష్కరించడానికి, త్వరితగతిన పారదర్శకతంగా జవాబుదారీతనంతో న్యాయాన్ని అందించడానికి కృషి జరగాల్సి ఉంది. ‘ఆధార్’పై దాఖలైన తాజా పిటిషన్లతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది.
ఇక న్యాయమూర్తుల నియకామకాలకు ఉద్దేశించిన జ్యుడిషియల్ కమిషన్ ఉనికి ఎటూ తేలలేదు. రాఫెల్ ఒప్పందంపై సుప్రీం తీర్పు చెప్పినా ఆ తీర్పును సమీక్షించాల్సిందేనని రాజకీయ పక్షాలు కోరడమేగాక, రివ్యూ పిటిషన్లకు సిద్ధమయ్యాయి. ఇలా ముగిసిన కేసులే మళ్లీ ఊపిరి తెచ్చుకుని న్యాయస్థానాల్లో మళ్లీ ఊపిరి పోసుకుంటున్నాయి. సుప్రీం కోర్టు గౌరవ ప్రతిష్టల పునరుద్థరణకు కొత్త ప్రధాన న్యాయమూర్తి సత్వర చర్యలు తీసుకోవాలని, లేకుంటే సర్వోన్నత న్యాయస్థానం స్వతంత్రతకే భంగం కలుగుతుందని ప్రముఖులు వ్యాఖ్యానించారు. మతస్వేచ్ఛకు సంబంధించిన కేసులను విచారించినపుడు న్యాయమూర్తులు తమకు వెన్నుముక ఉందని గుర్తుంచుకోవాలని, ఎవరినీ నిష్కారణంగా జైలులో పెట్టరాదని, సీల్డు కవర్లో జడ్జీకి సమాచారం ఇచ్చారనో, పూర్తి వివరాలు ఇవ్వడానికి దర్యాప్తు సంస్థలకు సమయం లేదనో, తప్పుడు సమాచారం ఆధారంగానో, ఖైదులో ఉంటేనే వారికి భద్రత ఉంటుందనో ఎవర్నీ జైలులో ఉంచే పరిస్థితులను న్యాయస్థానాలు తీసుకురాకూదని ప్రముఖ జస్టిస్ లు చేసిన వ్యాఖ్యలకు ఇది సరైన సందర్భం. కొన్ని తీర్పుల్లో మరీ పాకినట్టు కాకపోయినా, వంగినట్టు కనిపిస్తున్న న్యాయవ్యవస్థపై సామాన్యుడికి నమ్మకాన్ని ఎలా కల్పించగలుగుతారనేదే ఇపుడు అందరి ముందున్న పెద్ద ప్రశ్న.
-ఎస్.ఆర్