కవిత బెయిల్‌పై 27న విచారణ

22న సమాధానం ఇస్తామన్న ఈడీ

న్యూదిల్లీ,ఆగస్ట్20(ఆర్‌ఎన్‌ఎ): ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్‌ ‌పిటిషన్‌పై ఈ నెల 22లోగా సమాధానం ఇస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడీ మంగళవార సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ ‌దాఖలు చేసిందంటూ ఈడీ, సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్‌ ‌జనరల్‌ ఎస్వీ రాజు.. జస్టిస్‌ ‌బీఆర్‌ ‌గవాయ్‌, ‌జస్టిస్‌ ‌కేవీ విశ్వనాథన్‌ ‌ధర్మాసనానికి తెలిపారు. ఈడీ కౌంటర్‌ అఫిడవిట్‌ ‌సిద్ధమవుతోందని, 22లోగా దాఖలు చేస్తామని రాజు తెలిపారు. ఈ మేరకు కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

 

ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌ ‌దిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్‌ ‌చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 12న సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థల సమాధానం కోరింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ, ఈడీ వేర్వేరుగా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. మార్చి 15న హైదరాబాద్‌లో కవితను ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్‌ ‌కస్టడీపై తిహార్‌ ‌జైలులో ఉన్నారు.

బెయిల్‌పై అరవింద్‌ ‌కేజ్రీవాల్‌కు మరోమారు నిరాశ
27వరకు కేజ్రీవాల్‌ ‌జ్యుడీషియల్‌ ‌కస్టడీ

న్యూదిల్లీ,ఆగస్ట్20(ఆర్‌ఎన్‌ఎ): ‌దిల్లీ లిక్కర్‌ ‌పాలసీ కుంభకోణం కేసులో సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌కు మరోమారు నిరాశ ఎదురైంది. ఆయన జ్యుడీషియల్‌ ‌కస్టడీని దిల్లీ కోర్టు ఆగస్ట్ 27 ‌వరకూ పొడిగించింది. దిల్లీ లిక్కర్‌ ‌స్కాంలో కేజ్రీవాల్‌ను కింగ్‌ ‌పిన్‌గా పేర్కొంటూ ఈడీ అధికారులు ఈ ఏడాది మార్చి 21న అరెస్టు చేశారు. తన అరెస్టును సవాల్‌ ‌చేస్తూ కేజ్రీవాల్‌ ‌ట్రయల్‌ ‌కోర్టు, దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినా సానుకూల తీర్పు రాలేదు. అయితే.. సుప్రీంకోర్టు జోక్యంతో లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ ‌మంజూరైంది. తర్వాత ఆయన జూన్‌ 2‌న మళ్లీ కోర్టు ముందు లొంగిపోయారు. ఈడీ కేసులో సుప్రీం కోర్టు బెయిల్‌ ‌మంజూరు చేసినప్పటికీ సీబీఐ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. దీంతో.. దిల్లీ సీఎం అర్వింద్‌ ‌కేజ్రీవాల్‌ ‌తీహార్‌ ‌జైల్లోనే ఉన్నారు.

సీబీఐ తనను వేధింపులకు గురిచేస్తున్నదని ఇప్పటికే కేజ్రీవాల్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో 2023 ఏప్రిల్‌ ‌లో నన్ను విచారణకు పిలిచినప్పుడు సీబీఐకి పూర్తిగా సహకరించాను. కానీ ఈ కేసు దర్యాప్తు పేరుతో సీబీఐ నన్ను నిరంతరం వేధిస్తున్నది. ఇది చాలా తీవ్రమైన అంశం. నా అరెస్టు పూర్తిగా అక్రమం, రాజ్యాంగ విరుద్ధం. ఏ కేసులోనైనా రిమాండ్‌ ఉత్తర్వులు సాధారణం. కానీ ఇవి న్యాయ పక్రియను దెబ్బతీసేందుకు దారితీస్తాయి. ఇప్పటికే కేసు విచారణ, ఆధారాల సేకరణ పూర్తయింది.

అయినా సీబీఐ ఇలా వ్యవహరించడం సరికాదని గతంలో కేజ్రీవాల్‌ ‌వ్యాఖ్యానించిన విషయం విదితమే. లిక్కర్‌ ‌స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్‌ ‌కేసులో కేజ్రీవాల్‌ ‌ను మొదట ఈడీ అరెస్టు చేసింది. ఆ కేసులో జైల్లో ఉన్న ఆయనను జూన్‌ 26‌న సీబీఐ అరెస్టు చేసింది. ట్రయల్‌ ‌కోర్టులో హాజరుపరచగా.. మూడ్రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించడంతో పాటు ఈ నెల 12 వరకు జ్యుడీషియల్‌ ‌కస్టడీ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తన అరెస్టుతో పాటు ట్రయల్‌ ‌కోర్టు ఉత్తర్వులను కూడా సవాల్‌ ‌చేస్తూ  కేజ్రీవాల్‌ ‌వేసిన పిటిషన్‌ ‌దిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page