రాష్ట్రాలపై కేంద్రం వివక్ష.. అభివృద్ధికి శాపం!

  • నియంతృత్వ ధోరణి ప్రజాస్వామ్యానికి హానికరం..
  •  బలమైన కేంద్రం, బలమైన రాష్ట్రాలు ఉండాలనే లక్ష్యంతో
  • రాజకీయ పార్టీలు పరస్పరం సహకరించుకోవాలి..
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బలంగా ఉండాలి. అంతే కాని రాష్ట్రాల మీద పెత్తనం చలాయించే విధంగా కేంద్రం వ్యవహరిస్తే ఘర్షణ అనివార్యమవుతుంది. రాష్ట్రాలు కూడా దేశ సమగ్రత, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేంద్రానికి వెనుదన్నుగా ఉండాలి. అంతేకాని  అతి దూకుడుతనం పనికిరాదు. కేంద్రం కూడా భిన్నత్వంలో ఏకత్వంలో అలరారే సంస్కృతి ఉన్న దేశంలో అధికారాలన్నీ తన వద్దనే ఉంచుకుని నియంతృత్వ ధోరణితో వ్యవహరించే వైఖరితో ఉండరాదు. ఇది ప్రజాస్వామ్యానికి హానికరం. మారుతున్న రోజులకు అనుగుణంగా దేశ ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకునే హక్కు కేంద్రానికి ఉంటుంది.
ఆ నిర్ణయాల్లో లోపాలను ఎత్తి చూపించడంలో రాష్ట్రాలు వెనక డుగు వేయరాదు. బలమైన ఫెడరల్‌ వ్యవస్థ ఉండాలంటే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పర స్పరం సహకరించుకోవాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం  అధికారంలోకి వచ్చిన తర్వాత సంచలనమైన నిర్ణయాలు తీసుకుంది. ప్లానింగ్‌ కమిషన్‌ను కేంద్రం రద్దుచేసి, నీతి అయోగ్‌ను ఏర్పాటు చేసింది. అలాగే ఒకే దేశం, ఒకే పన్ను విధానం పేరిట వస్తు సేవా పన్ను (జీఎస్‌టీ)ని ప్రవేశపెట్టింది. 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల మేరకు ఆర్థిక వికేంద్రీకరణ ఉండాలన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగులు వేసింది. రాష్ట్రాల వ్యయాలపై ప్రత్యక్ష, పరోక్ష పెత్తనం వద్దని ఈ ఆర్థిక సంఘం పేర్కొంది.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 64 ఏళ్లలో రాని మార్పులు కేవలం ఐదేళ్లలో తీసుకురావడంలో కేంద్రం సఫలీకృతమైంది. రాజకీయంగా అధికారాలు కేంద్రీ కృతం కావడం వల్ల దేశానికి ప్రయోజనకరమైన పనులు చేకూరుతాయి. అదే సమయంలో కొన్ని నిర్ణయాల వల్ల నిరసనలను కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. గత 30 ఏళ్లలో మునుపెన్నడూ లేని విధంగా లోక్‌సభలో ప్రాంతీయ పార్టీల పెత్తనం తగ్గింది. బీజేపీకి  తన మేనిఫెస్టోలో ఉన్న అంశాలపై చట్టాలు చేసుకుంటూ వెళ్లడం తప్ప బలమైన ఆర్థిక వ్యవస్థ రూపకల్పనపై ఆశించిన స్థాయిలో దృష్టిని సారించడం లేదు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌, ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో  పలు సందర్భాల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు ముమ్మాటికీ సరైనవే.
వచ్చే ఐదేళ్లలో దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై రూ.102 లక్షల కోట్లను ఖర్చు చేస్తామని బీజేపీ సర్కార్‌ చేసిన ప్రకటన చేసింది. కాని ఈ నిధులను దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఖర్చుపెట్టే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. గతంలో అనేక మెగా ప్రాజెక్టులు ఆర్థిక సవాళ్ల వల్ల కొంత దూరం ప్రయాణించి నిలిచిపోయాయి. ప్రైవేట్‌ భాగస్వామ్యం వల్లనే నిధులను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సమీకరించుకోగలుగుతాయి. ఇంత పెద్ద మొత్తంలో నిధుల సమీకరణ కేంద్రం వల్ల అయ్యే పనికాదు. రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఇందులో భాగస్వామ్యం చేయాలి. గతంలో  హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై మధ్య ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటికే ఢల్లీి-ముంబయి మధ్య పారిశ్రామిక వాడ కార్యరూపం దాల్చుతోంది. దక్షిణాదిన ఇండస్ట్రియల్‌ కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ శాంతి భద్రతల సమస్య లేదు. నైపుణ్యం ఉన్న మానవవనరులు అపారంగా లభిస్తాయి. ప్రజల సహకారం ఎక్కువ. ప్రకృతి బాగా అనుకూలిస్తుంది.
విస్తారంగా భూముల లభ్యత ప్లస్‌ పాయింట్‌. ఆందోళనలు, అలజడులు అసలే ఉండవు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై చేసిన ప్రకటనను పారిశ్రామిక వర్గాలు ఆహ్వానించాయి. దక్షిణాదికి చెందిన ఆమె కచ్చితంగా  సదరన్‌ కారిడార్‌ ప్రతిపాదనను స్వీకరించాలి. ఒక మంచి ఆలోచన, ప్రగతిశీలమైన భావన, అభివృద్ధికి ఉపయోగపడే ప్రణాళికలను కేంద్రం ఆమోదించినప్పుడే ప్రగతి చక్రాలు పరుగెడుతాయి. రోడ్లు, హౌసింగ్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, రైల్వేలు, విద్యుత్‌, ఇరిగేషన్‌, విద్య, వైద్యం, మంచినీరు, రవాణా, డిజిటల్‌ డెవలప్‌మెంట్‌ తదితర రంగాలను శరవేగంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో కేంద్రం ఉన్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా గత ఎన్నికల సమయంలో, ఆ తర్వాత అసెంబ్లీలో కూడా సాగునీటి జలాల వినియోగంపై విస్పష్టమైన ప్రకటన పలుసార్లు చేశారు. దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులకు తెలుగు రాష్ట్రాల సీఎంల తరహాలో సాగునీటి జలాలపై పెద్ద అవగాహనలేదు.
ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు ముఖ్యమంత్రులకు, ఇక్కడ పనిచేసే అధికారులకు సాగునీటి జలాల వినియోగం, వాటి లెక్కలపై పట్టు ఎక్కువ. దేశంలో వివిధ నదుల ద్వారా సముద్రంలోకి వృథాగా వెళుతున్న 70వేల టీఎంసీ జలాలను సద్వినియోగం చేసుకునేందుకు కేంద్రం వద్ద ప్రణాళిక ఉందా అని మన ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నకు ఇంతవరకు సమాధానం లేదు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చుపెట్టుకుని వారి సహకారంతో నదుల అనుసంధానానికి కేంద్రం నడుంబిగించాలి. గంగా-కావేరీ, గోదావరి-కావేరి, మహానది బేసిన్‌ నుంచి కావేరి వరకు నదుల అనుసంధానంపై సాగునీటి నిపుణులు లెక్కలేనన్ని ప్రణాళికలను రూపొందించారు.
ఇందులో ఆమోదయోగ్యమైనవి, ఆచరణకు సాధ్యంకాని వాటిని గుర్తించి ఐదారు రాష్ట్రాలకు ఉపయోగపడే బహుళార్థకసాథక ప్రాజెక్టు నిర్మాణం దిశగా కేంద్రం అడుగులు వేయాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రాల వద్ద వేలాది కోట్ల నిధులు ఎక్కడి నుంచి వస్తాయి. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టును సొంత నిధులతో చేపట్టారు. విభజన హామీ మేరకు ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టులు నిర్మించినా, వరదల సమయంలో వేలాది టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తాయి. నదుల అనుసంధానం కోసం కేంద్రం జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రుల సదస్సును నిర్వహించలేదు. కేవలం చర్చలతో సరిపెట్టుకోకుండా కనీసం దేశంలో ఒక నాలుగు ప్రాజెక్టుల నిర్మాణాన్ని కేంద్రం చేపట్టాలి.
ఆర్థిక మాంద్యం వల్ల రాష్ట్రాలు నిధుల లేమితో విలవిలలాడుతున్నాయి. దీని వల్ల సంక్షేమ పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. భారీ విద్యుత్‌, సాగునీరు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టాలంటే నిధులు రాష్ట్రాల వద్ద ఉండవు. ఉదాహరణకు హైదరాబాద్‌ పరిసరాల్లో ఆరేడు జిల్లాలను కలిపే రీజనల్‌ రింగ్‌ రోడ్డు, ఆంధ్రాలో రాయలసీమ నుంచి కోస్తా ప్రాంతానికి అనుసంధానం చేసే రహదారికి ఇంతవరకు మోక్షం లేదు. అనుమతులు, ఆమోదానికే ఏళ్లు గడుస్తున్నాయి.
2013-17 మధ్య మౌలిక సదుపాయ రంగంలో నిధుల వ్యయం గణనీయంగా తగ్గింది. గత ఆరేళ్లలో వౌలిక సదుపాయాల రంగంలో రూ.51 లక్షల కోట్ల నిధులను ఖర్చుపెట్టారు. వచ్చే ఐదేళ్లలో రూ.102 లక్షల కోట్ల నిధుల సమీకరణ వ్యయం సాధ్యమేనా. ఆర్థిక మాంద్యం ఆటుపోట్ల మధ్య పారిశ్రామిక రంగం కుదేలవుతుంటే, వ్యవసాయ రంగంపైన కేంద్రం దృష్టి పెట్టాలి. వ్యవసాయ రంగంపై 70 శాతం మంది ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. మౌలిక సదుపాయాల రంగంలో పారిశ్రామిక రంగంతో పాటు వ్యవసాయం, ఇరిగేషన్‌, రోడ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం పద్ధతిని ప్రోత్సహించాలి. కాని భూసేకరణ, ఆర్థిక ఒప్పందాలు, టెండర్ల ధరలు, కాంట్రాక్టులు వివాదస్పదమవుతున్నాయి. మౌలిక సదుపాయాల రంగంపై బ్యాంకులు ఇచ్చిన అప్పులను విశ్లేషిస్తే  నిరర్థక ఆస్తుల విలువ పెరుగుతోందని రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొనడం ఆందోళన కలిగించే అంశం. కార్పోరేట్‌ రంగం వ్యవసాయ రంగం, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల రంగాల్లో నిధులు వెచ్చించేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రణాళికలను రూపొం దించాలి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను విశ్లేషిస్తే.. 1947 నుంచి 1989 వరకు 42 ఏళ్ల పాటు కేంద్రీకృత అధికార వ్యవస్థ విశేషమైన అధికారాలను చలాయిం చింది. ఆ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాల వల్ల 1989 నుంచి 2014 వరకు 25 ఏళ్ల పాటు మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వాలు నడిచాయి. పీవీ నరసింహారావు, వాజపేయి ప్రభుత్వాలు ఒక్కటే మిత్రపక్షాల సలహాలను స్వీకరించి ఆర్థిక రంగంలో సంస్కరణలు తెచ్చాయి.
2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆధ్వర్యంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రాజకీయంగా నిలదొక్కుకోవాలనే ఆకాంక్షనే తప్ప, దేశంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి ఫలాలను సమానంగా అందించే ధ్యాసతో వ్యవహరించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోక్‌సభలో తిరుగులేని మెజారిటీ వచ్చిందని ఎన్నాళ్లని మురిసిపోతారు. అనేక ఆర్థిక సంస్థలు, ఏజన్సీలు నిర్వహించిన సర్వేల్లో ఆర్థిక పరిస్థితి మందగమనంగా ఉందని వెల్లడవుతోంది. దేశంలో ఉద్యోగాల కల్పన, కొత్త పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయరంగంపై కేంద్రం దృష్టిని సారించాలి. ఆర్థిక రంగం కుదేలవుతోందని బలమైన సంకేతాలు వచ్చాయి. కాని ప్రజలు బీజేపీ పట్ల విశ్వాసంతో రెండోసారి తిరుగులేని మెజారిటీతో పట్టం కట్టారు. కాని అనంతరం జరిగిన రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో బీజేపీ నుంచి ఒక్కోరాష్ట్రం చేజారుతోంది.
దేశాన్ని ఐదు ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక సంపదతో భారత్‌ను బలోపేతంగా చేయాలన్న బీజేపీ లక్ష్యాలకు విఘాతం కలిగే అవకాశాలు లేకపోలేదు. పొలిటికల్‌ ఎకనామీ బలంగా ఉంటే చాలదని, ఈ తరహా భావజాలం వల్ల మరెంతో కాలం వోట్లు రాలవని బీజేపీ పాలకులు గ్రహించాలి. బలమైన కేంద్రం, బలమైన రాష్ట్రాలు ఉండాలనే లక్ష్యంతో రాజకీయ పార్టీలు పరస్పరం సహకరించుకోవాలి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే వోటు బ్యాంకు రాజకీయాల కోసం అభివృద్ధి అజెండాను అటకెక్కించే విధంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలు వ్యవహరించడం దురదృష్టకరం.
 -రతన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page