ప్రమాణం చేయించిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
హాజరయిన మంత్రులు పొంగులేటి, పొన్నం, తదితరులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లు శాసన మండలి సభ్యులయ్యారు. ఈ మేరకు ఇద్దరితో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ సి.మహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన తర్వాత కోదండరామ్ మాట్లాడుతూ…తాను ఎమ్మెల్సీగా నియామకం కావడంతో ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ పదవిని అదనపు బాధ్యతగా మాత్రమే భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను ఎప్పుడూ ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షల మేరకు పనిచేస్తానని ప్రకటించారు. ఈ పదవి చాలా మంది బలిదానాలు చేయడంతో వొచ్చిందని, వాళ్లను ఎప్పటికీ మరవమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీరిద్దరిని గతంలోనే నామినేట్ చేయగా.. ఈ విషయంపై బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లింది. నియామక గెజిట్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ప్రభుత్వం సుప్రీమ్ కోర్టును ఆశ్రయించగా హైకోర్టు తీర్పుపై సుప్రీమ్ కోర్టు స్టే విధించింది. దీంతో వీరి ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు తొలగడంతో శుక్రవారరం వారు ఎంఎల్‌సీలుగా ప్రమాణం చేశారు.