విశిష్ట వ్యాస ల‌హ‌రి…

తెలంగాణలో పేరెన్నిక‌గ‌న్న సాహిత్య సంస్థ‌ శ్రీ‌లేఖ సాహితి. వ‌రంగ‌ల్లు కేంద్రంగా మ‌హ‌త్త‌ర సాహిత్య సేవ‌లందిస్తున్న ఈ సంస్థ‌కు సార‌ధ్యం వ‌హిస్తున్న సుప్ర‌సిద్ధ సాహితీవేత్త డాక్ట‌ర్ టి శ్రీ‌రంగ‌స్వామి ఆ సంస్థ ప‌క్షాన ఎన్నో క‌వితా సంపుటులు, ప‌రిశోధ‌నా గ్రంథాలు, క‌థా సంపుటులు, వ్యాస‌సంక‌ల‌నాల‌ను వెలువ‌రించారు. ఆ కోవ‌లోనే వెలువ‌డిన వ్యాస సంపుటి వెలుగుల గుత్తి. ప‌రిశోధ‌నాత్మ‌కంగా వెలువ‌డిన సాహిత్య వ్యాసాల స‌మీక‌ర‌ణ‌తో ఈ సంపుటిని ఆయ‌న రూపొందించారు. శ్రీ‌లేఖ సాహితి 1977 నుండి 2024 వ‌ర‌కు సాగించిన 47 సంవ‌త్స‌రాల అప్ర‌తిహ‌త ప్ర‌యాణంలో వెలువ‌రించిన 140వ ప్ర‌చుర‌ణ వెలుగుల గుత్తి వ్యాస‌సంపుటి. శ్రీ‌లేఖ సాహితి ద్వారా మొత్తం 142 పుస్త‌కాలు వెలుగులోకి వ‌చ్చాయంటే ఒక ఉద్య‌మంగా ఆయ‌న చేసిన సాహిత్య కృషి ఎంత‌టిదో తెలిసిపోతుంది. స‌మ‌కాలీన‌త‌ను పాటిస్తూ, నిత్య‌ప‌రిశోధ‌నా దృక్ప‌థంతో, సాహిత్య‌పు లోతుల్ని స్పృశిస్తూ రాసిన తొమ్మిది వ్యాసాలు ఈ వెలుగుల గుత్తి సంపుటిలో ఉన్నాయి.

తొలి వ్యాసం తిక్క‌న – భార‌త ర‌స‌ద‌ర్శ‌న‌ములో మ‌హాభార‌త అనుసృజ‌నకారుల‌లో అద్వితీయుడు, హ‌రిహ‌రాద్వైత ప్ర‌తిపాద‌కుడైన తిక్క‌న‌లోని సాహిత్య విరాన్మూర్తిని ఆవిష్క‌రించి చూపారు. జీవ‌నంలోని న‌వ‌ర‌సాల‌ను తిక్క‌న త‌న మ‌హాభార‌తంలో సంపుష్టీక‌రించిన తీరును వివ‌రించారు. శ్ర‌వ్య దృశ్య రంజ‌కంగా భార‌త ర‌చ‌న‌ను ప‌ఠిత‌కు ప్ర‌ద‌ర్శింప‌జేయ‌గ‌లిగిన తిక్క‌న నేర్పును చెప్పారు. గ్రామీణ జీవ‌నంలోని ప‌ల్లె ప‌దాల‌ను తిక్క‌న త‌న భార‌తంలో ఎలా వాడుకున్నారో  ప‌లు ప‌ద్యాల‌ను ఉదాహ‌రిస్తూ వివ‌రించారు. విరాట‌ప‌ర్వంలోని  ఊర్జిత‌మైన క‌థ‌ల‌ను గురించి  ప్ర‌స్తావించారు.  తిక్క‌న వ‌ర్ణించి, ప్ర‌స్తావించిన నాట్య విశేషాల‌ను, ఆయ‌న‌లోని సంగీత క‌ళా ప‌రిజ్ఞానాన్ని గూర్చి వివ‌రించారు. స్వ‌ర్గారోహ‌ణ  ప‌ర్వంలో అంత‌ర్వాహిణిలా ప్ర‌వ‌హించిన శాంత ర‌సాన్ని గురించి తెలిపారు. తిక్క‌న మ‌హాభార‌త ర‌చ‌న‌ను ఎంతో తృప్తితో  చేశార‌ని వెల్ల‌డించారు. తిక్క‌న‌ను బ్ర‌హ్మ  అని పిలువ‌డం ఎంతో స‌బ‌బ‌ని,  దీనిని త‌రువాతి త‌రం క‌వులు కూడా  అంగీక‌రించార‌ని చెప్పారు.

రెండ‌వ వ్యాసం బ‌మ్మెర పోత‌న‌లో హాలికుడైన క‌విగా అల‌తి ప‌దాల‌తో  ప‌ద్య‌మాలిక‌ల‌ను వెలువ‌రించిన తీరును విశ్లేషించారు. శివ ధ్యాన‌త‌త్ప‌రుడైన‌ప్ప‌టికీ పోత‌న త‌న ర‌చ‌న‌ల‌తో హ‌రిహ‌రాద్వైతిగా క‌న‌బ‌డ్డార‌ని చెప్పారు. వ‌రంగ‌ల్లు ప్రాంతం బ‌మ్మెర వాసి ఐన పోత‌న పాల‌కుర్తి సోమేశ్వ‌రుడిని ఆరాధించిన‌ట్టు చెబుతూ వీర‌భ‌ద్ర విజ‌య ప్ర‌స్తావ‌న చేశారు. పోత‌న‌లోని శివ‌భ‌క్తి త‌త్ప‌ర‌త‌కు నిద‌ర్శ‌న‌మైన ప‌ద్యాల‌ను ఉదాహ‌రించారు. వీర‌భ‌ద్ర విజ‌యము త‌రువాత ర‌చించిన భోగినీ దండ‌క‌ము విశిష్ట‌త‌ను వివ‌రించారు. ప్ర‌తి పంక్తి శ‌బ్దాలంకార స‌హితంగా ఉంద‌ని చెప్పారు. నారాయణి శ‌త‌కంలో పోత‌నలోని శ్రీ‌మ‌న్నారాయ‌ణ భ‌క్తి విశిష్ట‌త‌ను తెలిపారు. మ‌హాభాగ‌వ‌తం మ‌హోన్న‌త భాగ్య కావ్య‌మ‌ని చెప్పారు. మ‌హత్వ క‌విత్వ ప‌టుత్వ సంప‌ద‌ల‌ను సాధించిన పోత‌న ముగుర‌మ్మ‌ల మూల‌పుట‌మ్మ దుర్గ‌మ్మ‌కు బిడ్డ‌డ‌ని చెప్పారు. పోత‌న ర‌చ‌న‌ల్లో ఉన్న ర‌స పోష‌ణను విశ‌దీక‌రించారు.

మూడ‌వ వ్యాసం శ్రీ‌వైష్ణ‌వ దివ్య ప్ర‌బంధ ర‌ష్మిలో వైష్ణ‌వ త‌త్వం గురించి అనేక కోణాల్ని వెల్ల‌డించారు. నారాయ‌ణుడంటే జ్ఞాన‌ప్ర‌దాత అని ప‌లు ఉదాహ‌ర‌ణ‌ల‌ను చూపారు. అళ్వారుల పాశురాల ప్రాశ‌స్త్యాన్ని తెలిపారు. ద్రావిడ ప్ర‌బంధాల‌కు మెట్లుగా అళ్వారుల‌ను చూపారు. శ్రీ‌వైష్ణ‌వ సంప్ర‌దాయంలోని ప్ర‌త్యేక‌త‌ల‌ను వివ‌రంగా చెప్పారు. మ‌ధుర క‌వి యాళ్వారులు వృద్ధులైన న‌మ్మాళ్వారుల వ‌ద్ద ఎలా శిష్యరికం చేశారో  తెలిపారు. దివ్య ప్ర‌బంధంల‌లోని స్త్రోత్తాల‌ను స‌వివ‌రంగా విశ‌దీక‌రించారు.

నాలుగ‌వ వ్యాసం శంక‌రాచార్యులు – కొన్ని ముచ్చ‌ట్లులో అపార‌మైన జ్ఞాన‌సారాన్ని అద్వైతంగా అద్వితీయంగా అందించిన తీరును వెల్ల‌డించారు. గురుసేవ‌తోనే జ్ఞానార్జ‌న జ‌రుగుతుంద‌న్న శంక‌రాచార్యుల  అభిప్రాయానికి సవివ‌ర‌ణ ఇచ్చారు. శంక‌రాచార్యులు చెప్పిన బుద్ధ‌స్య జ్ఞానం, బుద్ధేన భాషితం గురించి వ్యాఖ్యాన వివ‌ర‌ణ ఇచ్చారు. నేతి సూర్య‌నారాయ‌ణ‌శ‌ర్మ వంటి పండితుల అభిప్రాయ ప‌రంప‌ర‌ను కూడా ఈ వ్యాస క్ర‌మంలో  చెప్పారు. ప‌ర‌త‌త్వం ఒక్క‌టే అయిన‌ప్ప‌టికీ ఉపాస‌క భ‌క్తుల రుచి భేద‌మును అనుస‌రించి శివ‌కేశ‌వాది రూపముల ధార‌ణ జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌ని చెప్పి శ‌ర‌ణాగ‌తి ల‌క్ష్యాన్ని వివ‌రించారు.

ఐద‌వ వ్యాసం విశ్వ‌నాథ క‌వితా సౌంద‌ర్య‌ములో ఆ మ‌హాక‌వి క‌వితాశైలిని ఆలోచించ‌డానికి, అనుస‌రించ‌డానికి తోడ్ప‌డే త‌న లోతు నెఱుగ‌ని జ‌నుల పూజ‌కు అన్న ప‌ద్యాన్ని ర‌చ‌యిత ఉదాహ‌రించి చూపారు. విశ్వ‌నాథ కావ్యాన్ని ధ్వని సిద్ధాంత మ‌ర్మ జ్ఞానంతో చ‌ద‌వాల‌న్నారు. విశ్వ‌నాథ ర‌చ‌న‌లోని ఓజ‌స్సు, తేజ‌స్సు, ప్ర‌సారం, ప్ర‌కృతి మాధుర్యం, మ‌హిమ‌ల‌ను గురించి తెలిపారు. ఒక భావాన్ని ఆవిష్క‌రించేప్పుడు విశ్వ‌నాథ పాటించే గుణ స‌మ‌యోచిత మిళితాన్ని గురించి చెప్పారు. రామాయ‌ణ క‌ల్ప‌వృక్షములో పాటించిన క‌ల్ప‌న‌ల గురించి తెలిపారు. విశ్వ‌నాథ‌లోని క‌వితాచ‌తుర‌త‌కు చేతులెత్తి మొక్కాల్సిందేన‌ని చెప్పారు. గొప్ప భావుక‌త‌, ఊహాశాలిత క‌లిగిన సాహితీ త‌ప‌స్విగా విశ్వ‌నాథ‌ను అభివ‌ర్ణించారు. ప్ర‌తి ప‌ద్యాన్ని వాత్స‌ల్య భావ మాధుర్యంతో విశ్వ‌నాథ ఎలా మ‌లిచారో చెప్పారు. న‌న్నెరిగిన హ‌రిహ‌రులే న‌న్నెరుగ‌రు అన్న ప‌ద్యంతో విశ్వ‌నాథ బ‌హుముఖీన క‌విత్వ ప్ర‌తిభ‌ను ప్ర‌స్తుతిస్తూ ఈ వ్యాసానికి ర‌చ‌యిత ముగింపు ప‌లికారు.

ఆరవ వ్యాసం పాంచాల‌రాయ శ‌త‌క‌ము – విశ్లేష‌ణలో ఆచార్య కోవెల సుప్ర‌స‌న్నాచార్యులు పాటించిన శ‌త‌క సంప్ర‌దాయ ల‌క్ష‌ణాల‌లో ఒక‌టైన మ‌కుట‌మును గురించి వివ‌రించారు. పాంచాల‌రాయ అనే మ‌కుటంతో 103 ప‌ద్యాల‌ను సుప్ర‌స‌న్నాచార్యులు    ర‌చించార‌ని చెబుతూ మ‌ధ్యాక్కర ఛంద‌స్సుతో విశిష్టాద్వైత  సంప్ర‌దాయంలో శ్రీ పాంచాల‌రాయ శ‌త‌కాన్ని అందించార‌ని తెలిపారు. వేయి ప‌డ‌గ‌ల పాము అని ఒక ప‌ద్యంలో చెప్పి  విశ్వ‌నాథపై సుప్ర‌స‌న్నాచార్యులు త‌న‌కున్న‌ సాహిత్య మ‌మ‌కారాన్ని ఎలా  చాటుకున్నారో  వెల్ల‌డించారు. విశిష్టాద్వైత సంప్ర‌దాయంలో  సృజ‌నాత్మ‌క‌త, అనుభూతిమ‌యంగా ఈ శ‌త‌కాన్ని సుప్ర‌స‌న్నాచార్యులు తీర్చిదిద్దిన తీరును తెలిపారు.

ఏడ‌వ  వ్యాసం అచ్యుతానంద బ్ర‌హ్మ‌చారి వెలువ‌రించిన గ్రంథం గోదానుభూతి ర‌గ‌డపై ఎంతో విశ్లేష‌ణాత‌క్మంగా కొన‌సాగింది. బ్ర‌హ్మ‌చారి ఎన్నుకున్న ఛంద‌స్సు ర‌గ‌డను ప‌రిచ‌యం చేసిందే పాల‌కురికి సోమ‌నాథుడ‌ని వ్యాస‌క‌ర్త వివ‌రించారు. ర‌గ‌డ‌లు జాతి ప‌ద్య‌ముల‌ని, ద్విప‌ద మాదిరిగా రెండు పాదాల‌తో ఉండి ఆది ప్రాస, అంత్య‌ప్రాస నియ‌మాన్ని పాటించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. తెలుగు, సంస్కృతాన్ని అవ‌పోశ‌ణ ప‌ట్టిన బ్ర‌హ్మ‌చారి ఎంతో లోతుగా తిరుప్పావై ద్వారా శ్రీ‌గోదాదేవి పాడిన మేలుకొలుపుల‌లోని హ‌రిత‌త్వాన్ని వివ‌రించారు. తిరుప్పావైలోని 30 పాశురాల‌కు స‌రిపోయే రీతిలో స‌మ‌కూర్చిన అర్థ‌వంత‌మైన చిత్రాల‌ను గురించి కూడా తెలిపారు. బ్ర‌హ్మ‌చారి తిరుప్పావైని కేవ‌లం అనుసృజ‌న చేయ‌లేదు, త‌ను కూడా గోదాదేవితో పాటు ఒక గోపికయై ఈ కృతిని ఆమె అందించారని వివ‌రించారు.

ఎన‌మిద‌వ వ్యాసం మ‌చ్చ హ‌రిదాసు సాహితీ వైభ‌వం. యాత్రా చ‌రిత్ర‌లు అన్న ప‌రిశోధ‌నాంశ గ్రంథ‌క‌ర్త‌గా హ‌రిదాసు కృషిని ఈ వ్యాసం వెల్ల‌డించింది. అనేక ప్రాంతాల సాంఘీక‌, సాంస్కృతిక నేప‌థ్యాల‌ను యాత్రా చ‌రిత్ర‌లుగా చూపిన సంద‌ర్భాల‌ను  ప్ర‌త్యేకంగా వెల్ల‌డించారు. తెలుగులో యాత్రాచ‌రిత్ర‌లు అన్న ప‌రిశోధ‌న‌లో హ‌రిదాసు తార్కిక‌త, విష‌య వివ‌ర‌ణ‌, విశ్లేష‌ణ‌, సృజ‌నాత్మ‌క‌త, ప్ర‌తిపాద‌న, చ‌ర్చ అన్న అంశాల నేప‌థ్యంలో సుమారు 50 యాత్రాచ‌రిత్ర‌ల‌ను ప‌రిశీలించి  త‌న ప‌ర‌శోధ‌న‌ను స‌మ‌ర్పించినట్టు తెలిపారు. హ‌రిదాసులో ల‌క్ష‌ణ‌కారుడు, వైయాక‌రుణుడు ఉన్నార‌ని వివ‌రించారు. హ‌రిదాసు మూడ‌వ వ్యాస సంపుటి వ్యాస‌భార‌తిలోని  18  వ్యాసాల గురించి చెప్పారు. చతుర్వేద అనుభ‌వసారాన్ని తెలిపారు. హ‌రిదాసు ప‌రిశోధ‌నాకృషికి ప్ర‌తిబింబంగా ఈ వ్యాసం నిలిచింది.

తొమ్మిద‌వ వ్యాసం విహారి సుమంత్రుడు కావ్య స్ప‌ర్శ. రామాయ‌ణాన్నే అనుశీలించి, త‌న ఉన్న‌త భావ‌న ప‌టిమ‌తో సృజ‌నాత్మ‌క‌త‌తో విహారి అందించిన ఈ ర‌చ‌న‌లోని విశిష్ట‌త‌ను వెల్ల‌డించారు. ఈ ప‌ద్యకృతి 14 ఖండిక‌లుగా 209 ప‌ద్యాల‌తో విరాజిల్లింద‌ని చెప్పారు. దృశ్య‌మాలిక‌గా ర‌చ‌న‌ను సాగించిన తీరును ప్ర‌స్తుతించారు. పాత్ర‌ల ఔచిత్యాన్ని స‌మ‌యోచితంగా ప్ర‌ద‌ర్శింప‌జేసిన తీరును ఉదాహ‌రించారు. ప‌ద్య‌పు పోక‌డ‌, పోహ‌ళింపుల‌ను తెలిపారు. ప‌లుకుబ‌డులు, లోకోక్తుల‌ను సంద‌ర్భోచితంగా ఈ కావ్యంలో విహారి వినియోగించిన తీరును తెలిపారు. ఇందులోని  ప‌దబంధాలు పాఠ‌కుడిని ర‌స‌చిత్తునిగా మారుస్తాయ‌ని  చెప్పారు. రామాయ‌ణంలోని సుమంత్రుని గురించి ఇలా ఒక ప‌ద్యకావ్యం రావ‌డం ఒక ప‌రిపుష్ణ‌మైన ఆలోచ‌న అని వ్యాసానికి ర‌చ‌యిత ముక్తాయింపు  ప‌లికారు.

తొమ్మిది మ‌ణిహారాల్లాంటి వ్యాసాల‌ను వెలుగుల గుత్తిగా కూర్చి ర‌చ‌యిత పాఠక లోకానికి అందించారు. ప‌లు సాహిత్యాంశాల‌ను ప‌రిశోధ‌నాత్మ‌కంగా వ్యాసాల‌లో ర‌చ‌యిత వివ‌రించారు. బ‌హువిద‌ గ్రంథ ప‌రిశీల‌నాశ‌క్తిని ర‌చ‌యిత ఎప్ప‌టి నుండో క‌లిగి ఉన్నార‌న్న స్ప‌ష్ట‌త‌ను ఈ వ్యాసాలు ఇచ్చాయి. ర‌చ‌యిత‌లోని భావ‌నావిశేషానికి నిద‌ర్శ‌నంగా వ్యాసాలు నిలిచాయి. ఒక విశిష్ట ప‌రిశోధనా ర‌చ‌నా ప్ర‌యాణంలో రూపొందిన ఈ వ్యాసాలు ఎంతో  విలువైన‌వి.

– డా. తిరున‌గ‌రి శ్రీ‌నివాస్
                         9441464764

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page