ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

సభలో గందరగోళం మధ్యనే బిల్లు పాస్‌
అనంతరం సభను నేటికి వాయిదా వేసిన స్పీకర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణ అసెంబ్లీ ద్రవ్యవినమియ బిల్లుకు ఆమోదం తెలిపింది. వాదాపవాదాలు, చర్చలు, ఉప చర్చల అనంతరం సభ బిల్లను ఆమోదించింది. తొలుత బిల్లను డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టగా, కెటిఆర్‌ దీనిపై చర్చ ప్రారంభించారు. తదనంతరం చర్చ పక్కదోవ పట్టి ఉపచర్చలకు దారితీసింది. ఓ దశలో సభలో గందరగోళం ఏర్పడిరది. బిఆర్‌ఎస్‌ సభ్యులు వెల్‌లో ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సభ ఆర్డర్‌లో తేవడానికి స్పీకర్‌ చేసిన యత్నాలు ఫలించలేదు.
ఈ క్రమంలో భట్టి బిల్లను ఆమోదించాల్సిందిగా కోరాగా సభ ఆమోదించిన తరవాత శాసనసభ గురువారం నాటికి వాయిదా పడిరది. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం గురువారం ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశం అయ్యేందుకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ప్రకటించారు. బుధవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగా, ద్రవ్య వినిమయ బిల్లుపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ చర్చ ప్రారంభించారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను మరోసారి గుర్తు చేస్తూ, ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తిచూపుతూ కేటీఆర్‌ ప్రసంగం కొనసాగింది. ఇక కేటీఆర్‌ ప్రసంగానికి అధికార పార్టీకి చెందిన సభ్యులు పలువురు ఘాటుగా సమాదానం ఇచ్చారు.
ఇక సభలోకి వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. తనను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారంటూ సబిత సీఎం రేవంత్‌ను నిలదీశారు. ఇక సీఎం మాటలకు భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు కూడా వంతపాడారు. గందరగోళ పరిస్థితుల నడుమ సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. మళ్లీ తిరిగి సభ మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ప్రారంభమైంది.
సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టుపట్టారు. స్పీకర్‌ వినిపించుకోకుండా అధికార సభ్యుడు గడ్డం వివేక్‌కు అవకాశం ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు స్పీకర్‌ పోడియంలోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. సబితకు మైక్‌ ఇచ్చేందుకు సుముఖంగా లేని ప్రభుత్వం.. చివరకు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించుకుంది. అనంతరం సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page