బడిబువ్వకు ‘తిథి తిప్పలు’!

గుడ్డెద్దు శేన్ల పడుడంటే గీ తీర్గనే! సదూకునే పోరల్లకు బళ్ళె అంబటేల బెట్టేడి బడి బువ్వనే కాదుల్లా! ఇటు సంది వూరోళ్ళను సుత బువ్వ పెట్టమంటాంది మన సర్కార్‌ ! ఏ ఇంట్ల యెసోంటి పబోజనమైనా, సుట్టాలకింత బెట్టినట్టే వూరి బడి పోరల్లకింత బువ్వ పెట్టాలంటాంది. యెందుకంటె పబోజనం కాడి బువ్వ జరింత అవ్వల్‌ టది. ఊర్లె పెండ్లయినా, సావయినా, దినాలైనా మూడొద్దులైనా,పదొద్దులైనా ఎసొంటి కార్యెమైనా బడి పోరల్లకు సుత జరింత బువ్వ పంపాలె! వూరిబడికీ, వూరుకూ మద్దెన గీ బువ్వ బంధం పెరిగి బడి బాగైతది. బడి పోరల్లకు సుత నాలుగైదు తీర్ల మంచి బువ్వ దొరుకుతది. యేం దక్కువ నాల్గుతీర్ల కూరలుంటయి. యాట కూర, కోడికూర, బగార బువ్వ అవ్వల్‌ తీర్గుంటది. గీ తీర్గ వూర్లె బువ్వ బడి పోరల్లకు అంబటేలకు తిన బెట్టాలని, దీనికోసం బడి పెద్దసార్లూ,పంతుళ్ళు వూళ్ళె అన్ని కులపోల్ల  పెద్దమనుషులు కల్శి ఇంతేజాం శేయాలని జెప్పింది సర్కార్‌.

గీ కొత్త ముచ్చట మాగెరుకైంది గని దాని పేరేందుల్లా!? అంటే తిథి భోజనం గదేం దిక్కుమెల్లా పేరు!? దేశంల బతికున్న పద్దెనిమిది బాసలను కాదని సచ్చి కానరాకుంట బోయిన సంస్కృతం బాసల పేరది. పువ్వు గుర్తు మూడోపాలి సర్కార్‌ జేసుడంటెనే గిసొంటి కతలు పడుతని మాగ అనుకుంటుమి.గిసొంటి ఇచ్ఛంత్రాలు వొక్కటి గాదుల్లా! యింక శాన్నే వున్నయి!బళ్ళే గీ మద్దెన దినాం జేయుండ్రని పెట్టిన కొత్త కార్యం పేరు శిక్షా సప్తాహా , అమ్మ పేరుతోని మొక్కలు బెట్టుడు గిసొంటి పాతకాలం తొవ్వ బట్టే బాసల పేర్లతోని యవారం మళ్ళా ముందటేసుడు బెట్టింది. హిందీ మాట్లాడుకునే ఉత్తర దేశాన యే బాసైన జెప్పుకోనీ గని అవ్వల్‌ దర్జా బాస మన తెలుగు ,తెలంగాణ బాస లున్నయి గదా! లిఅక్కడ జెప్పిందే యీడ సుత జెపుతానం ! మాదేమున్నదని ఈ కార్యం ముందటేసిన మన పెద్దసార్లనబట్టె!  శెప్పటోనికి శెవుటయితె ఇనెటోళ్ళకు యిజ్జెతుండంద్దా!  తిథి భోజనం యేం పేరుల్లా! గీ పేరు బెట్టినోళ్ళకు సోయిసొక్కం లేదనుకోవాల్నా!!  ఎన్‌.ఈ.పి 2020 వొయ్యి బయిటేశినప్పుడే కాషాయ వాసన  గుప్పుమన్నది.

బడి పోరల్లకు బస్మాలు పూశి,మెడల తుల్శి పూసల దండలేశే దినమచ్చే కతలు పడుతదని ముందే బుగులైంది. సన్నాసులను దెచ్చి సదువుల పెద్ద సార్లను జేశి కూసుండబెడితె వొయ్యిలన్ని గట్నే కాలవడె! బడి సదువులు నాశినం పదారు పాల్లయితది. తిథి భోజనం అంటేదుల్లా !? మన తెలుగిండ్లల్ల సచ్చినోనికి సంవత్సరీకం బెట్టినప్పటి బువ్వ! తిథి పేరు దీశి యింకేందన్న పేరు బెట్టాలంటె పై నుంచి అచ్చిన పేరు యెట్లంటే గట్నే రాయాలె! అనేటి ఆపీస్‌ ల పెద్దసార్‌ కు యెవలు జెప్పాలె! ఇండ్లండ్లకచ్చినోళ్ళు, యింట్ల లగ్గం జేశినోళ్ళు ,  శుబకార్యెం జేశినోళ్ళ యిండ్లడ్ల యెవలు సుత,అకరుకు పోరల్లు సుత ఆర్నెల్ల దాంక యెంత దగ్గరి సుట్టం సావుకైనా పోరు.  ఆఖరిపాలి మొహం సూశేందుకు సుత యింటి గడప దాటరు. దినాల కాడి బువ్వ హరికీస్‌ తినరు. గిసొంటి తీరు నమ్మకాలున్న మన తెలుగు, తెలంగాణ యిండ్లడ్ల బడి పోరల్లకు పుసుక్కున దినాల కాడిదో! పదొద్దుల కాడిదో వూరి బువ్వ వత్తె మన పోరలు తింటరానుల్లా!  బువ్వ సంగతేందోగని బడి ఆగమాగం అడ్వడివైతది.పంతుళ్ళకు యేం జేయాల్నో తోసది. సదువులు సంకనాకిపోతయి.

బడి బువ్వ తిప్పలేందో యెరికేనా! బడిబువ్వ  అవ్వలుగుండాలె! తిన్నదొంటికి బట్టాలె!  పోరల్లు ఉక్కు శెండోలిగుండాలె! వూళ్ళెపొంటి ఆడోళ్ళ సంఘాలు అంబటేల బువ్వ కూరలండబట్టి పోరలు బడిమొకంమాగనే సూడబట్టిండ్లు.వూళ్ళన్నంక జెండాలుంటయి. జెండకో కులముంటది. రాజకీయాలు జేశే బుడ్డర్‌ కాన్‌ లీడర్లంటరు వూళ్ళె గిసొంటోళ్ళ చిల్లర రాజకీయాలతోని బడి బువ్వ పతకాన్ని ఆగమాగమవుడు అందరికెరుకున్నదేనాయె! అంబటేల బువ్వ బెట్టుడే మొదాల్న  వూళ్ళె పొంటి కులాల పంచాయితీలు లేపింది. మతాల మంట బెట్టింది.  ఆడోళ్ళ పొదుపు సంఘాలల్ల పొల్లు పొల్లు లొల్లులయ్యినయి.. ఎమ్మెల్లే దాంక పైరవులు జేసుకున్నోళ్ళే బడి బువ్వ వండే హక్కు దొరికిచ్చుకున్నరు. వంటలోల్లు సాటు మాటుగ బియ్యం బుక్కుతాండ్లా! పుచ్చులు బెచ్చులు కూరగాయలు తెత్తాండ్లా!  కూరలల్ల బోశేది అడ్డగోలు కంపినీల నూనె నా! పామాయిల్‌ పాకిట్ల నూనెనా! వంటలల్ల వుప్పుకారమసలు వుంటాందా! సగముడికిన కూరలు బెడ్తాండ్లా!? ‘‘దమ్మిడీ మే లాల్‌ లాల్‌ ‘‘ కతలు వడుతాండ్లా!? వారంల మూడు మల్కల గుడ్లు ఉడుక బెడ్తాండ్లా! తిన్న పోరల్లకు తాగెటందుకు నీళ్ళ సౌలతున్నదా! వండిన బువ్వ కూరలల్ల యేమేంటియి కానత్తానయి!?ఎంటికలు కానత్తానయా! ఎల్క పెంటికలు కానత్తానయా! వండి తిప్పలు బడే మహిళా సంఘపోల్లకు  మూడు నాల్గు నెలలకోపాలైన  వండినందుకిచ్చేటి బిల్లులు యెట్లెట్ల రాకపాయె! గాళ్ళు దినాం సాదర కర్సులెట్ల యెల్లదీయాలె!సావుకారు కాడ బాకీలెప్పుడు తీర్వాలె! బడిబువ్వ కాడ గింతగనం తిప్పలైతాంటె శెవ్వు వారని సర్కార్‌ వున్న ఫలంగ  ‘తిథి భోజనం’ పేరు తోని కొత్త ముచ్చట ముందటేశింది.

కొత్త లొల్లికి ముగ్గేశింది బడి బువ్వను పైలంగ జూడాలె!
దినమిడిశిదినం గుడ్లుడుకబెట్టుడు, తీరొక్క కూరలండుడు,రొండు మూడు తీర్ల కూరలు కల్పి జేసుడు,సన్న బియ్యం బువ్వ, పప్పుశారు,శనివారం గోలిగె బగార బువ్వ సదూకునే బడి పోరల్లకు మంచిగన ఇకమత్‌ జేయాలె! కూలినాలి జేసుకునే ఇండ్ల కాడ పొద్దునింత పొయి బెట్టేందుకు సుత తిప్పలయితాందనే కదా! బళ్ళెనే పోరల్ల ఆకలి తీరెటందుకు సర్కార్‌ జేశిన గీ సౌలత్‌. మంచిగున్నదంటిమి.ఆడాడ ఉడ్కని బువ్వ, పలుకుపలుకు బువ్వ బెట్టినా సుత డొక్కల ఆకలి పొగలు గక్కే కూరలు పప్పుశారుతోనో ముద్ద దిగుతాంది. వండేటోళ్ళందరు దినాం అప్పు జేశి బువ్వ వండే తిప్పలు లేకుంట జేయాలె!గాళ్ళకు యే నెల బిల్లులు గా నెలల్నే యియ్యాలె అనే సోయి సర్కార్‌ పెంచుకోవాలె. బడిబువ్వ ల వూరు పాలు పంచుకునుడనేది తిథి భోజనం బెట్టాలనేది జెప్పటానికి మాగనే వుంటది, గని కుండ కాడ కులాల పొత్తులు పొట్టు పొట్టు పంచాతులకు తొవ్వ తీత్తది. బడి పోరల్లకు మంచి సదువుతో పాటు మంచి బడి బువ్వ ఇచ్చుడు సర్కార్‌ పనే కదా! గీ బరువును నెత్తిమింకేలి దించుకోవాల్నని గిట్న సర్కార్‌ జూత్తాందా! యేంది అనేటి డౌట్‌ గొడ్తాంది …
 -ఎలమంద, తెలంగాణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page