ఎన్డీఏ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి!

వ్యవసాయ ఆదాయం ముసుగులో పన్ను మినహాయింపు పొందుతున్న బడా కంపెనీలకు ముకుతాడు వేసే విధంగా కేంద్రం వచ్చే బడ్జెట్‌లో తగిన చర్యలు తీసుకుంటుందా ? ఆ దిశగా అడుగులు వేస్తుందా చూడాలి. కొత్త బడ్జెట్‌లో తమకు ఊరట లభిన్తుందనే ఆశతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వేతన జీవులు, వివిధ వర్గాల వారు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. వీరికి మోదీ సర్కార్‌ ఖేదం కలిగిస్తుందా ? మోదాన్ని అందిన్తుందా వేచిచూడాల్సిందే. వ్యక్తిగత ఆదాయం పన్ను విధానంలో మాత్రం సహేతుకమైన మార్పులు లేదా సంస్కరణలు ప్రవేశపెట్టే విధంగా కేంద్ర సర్కార్‌ అడుగులు వేయక పోతే అసంతృప్తి పెరగడం ఖాయం.

వ్యవసాయిక ఆదాయాన్ని పన్ను నుంచి మినహాయింపు విధానంలో లొసుగులు
కొత్త బడ్జెట్‌లో తమకు ఊరట లభిన్తుందనే ఆశతో మధ్యతరగతి వేతన జీవులు  

వొచ్చే వారంలో కేంద్రంలో కొలువుతీరిన ఎన్డీఏ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికిగాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఎప్పటిలాగానే ఆర్థిక వేత్తలు, మీడియా, పారిశ్రామికవేత్తలు, రాజకీయ పార్టీల నేతలు తమకు తోచిన సలహాలు , సూచనలు ఇస్తారు. ఈ సారి బడ్జెట్‌ ప్రవేశపెట్టే తీరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక వైపు ధనిక , మధ్య తరగతి వర్గాల మధ్య అగాధం పెరుగుతోంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వనూళ్లు బాగానే పెరుగుతున్నాయి. ఈ అంకెలు చూస్తే మాత్రం మరింత మంచి బడ్జెట్‌, అభివృద్ది అనుకూల బడ్జెట్‌ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. మరో వైపు మధ్య తరగతి వర్గాల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి బయటకు వొస్తోంది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన ఫలితాలు రాలేదు. ఏదో విధంగా ముక్కీ, మూలిగి, 240 సీట్లు తెచ్చుకోగా, కూటమిలోని జేడీయూ, టీడీపీ అండదం డలతో బీజేపీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పన్నుల భారం పెరుగుతోందని మధ్యతరగతి వర్గాలు గగ్గోలెత్తుతున్నాయి.

పన్నుల భారం తగ్గించేందుకు కేంద్రం గత పదేళ్లలో ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంది. జీఎస్టీ విధానం పరిశీలించండి. ఆర్‌బీఐ నివేదిక విశ్లేషిస్తే పన్నుల భారం జీఎస్‌టీని ప్రవేశపెట్టిన తర్వాత 14.4 శాతం నుంచి 11.6 శాతానికి తగ్గింది. సుబ్రహ్మణ్య కమిటీ రెవెన్యూ లోటు 15.3 శాతం ఉండవొచ్చని అంచనావేస్తే అంతకంటే తక్కువగా నమోదైంది. వ్యక్తిగత ఆదాయం పన్నును తగ్గించాలనే డిమాండ్‌ విశేషంగా పెరిగింది. దేశంలో అసమానతలు పెరిగాయి. దీని వల్ల ఆదాయం పన్నును తగ్గించాలనే డిమాండ్‌ పెరిగినా, ఈ డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందా ? మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలకు అర్ధమయ్యే రీతిలో కాకుండా పన్ను చెల్లింపుల్లో కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు అమలు చేసినా దాని ప్రభావం ఏమీ కనపడడం లేదు. వ్యవసాయరంగాన్ని ఆదాయం పన్ను నుంచి మినహాయించడం పై అనేక అనుమానాలున్నాయి. మూడవ ఆదాయం పరిపాలన సంస్కరణల కమిషన్‌ నివేదిక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించింది. వ్యవసాయేతరుల నుంచి వొచ్చే వ్యవసాయ ఆదాయం పెరుగుతోంది. వీరు పన్నులు చెల్లించకుండా, ఈ ఆదాయాన్ని ఇతర రంగాల్లో మదుపు చేస్తున్నారు.

ఆదాయం పన్ను నుంచి వ్యవసాయ ఆదాయాన్ని ఎందుకు మినహాయిస్తున్నారనే వాదన పెరిగింది. ఈ కేటగిరీ పన్నులను రాష్ట్రాల జాబితా ఎంట్రీ నెంబర్‌ 46లో లిస్టయింది. ఈ అంశాన్ని రాజ్యాంగంలోనే చేర్చారు. ఈ పన్నుపై చట్టం చేసే హక్కు కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. వ్యవసాయం అంటేనే హై రిస్క్. పెట్టుబడికి తగ్గట్టుగా లాభాలు ఉండవొచ్చు. ఉండకపోవొచ్చు. ఈ దేశంలో 83 శాతం మంది రైతులకు ఒక హెక్టార్ కంటే తక్కువ భూమి ఉందని నేషనల్‌ శాంపిల్‌ సర్వే పేర్కొంది. సగటున ప్రతి రైతుకు 0.5 హెక్టార్‌ భూమి మాత్రమే ఉంటుంది. 2018-19 అంచనా ప్రకారం సగటున ఒక రైతు నెలసరి ఆదాయం కేవలం రూ. 10,218 మాత్రమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కట్టుగా పనిచేస్తే జీఎస్‌టీలో మాదిరిగా మంచి సంస్కరణల ఫలితాలు వొస్తాయని తేలింది. అయితే ఇందులో సహకార సమాఖ్య విధానం, రాజ్యాంగ నిర్మాణానికి తగ్గట్టుగా పనితీరు ఉందా లేదనే విషయం పక్కన పెడితే కొంత మేరకు సానుకూల ఫలితాలు వొచ్చాయి. మంచి సరైన పన్ను విధానం ఇంతవరకు లేదు. ఇదే వొస్తే అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఒక వేదికపైకి వచ్చి పనిచేస్తే తప్పనిసరిగా మంచి పన్ను విధానాన్ని రూపొందించుకోవొచ్చు. వ్యవసాయేతర సంస్థలు, వ్యక్తులు, వ్యవసాయం నుంచి ఆదాయాన్ని పొందిన వారు పన్ను మినహాయింపు పొందుతున్నారు. ఈ విధానంలో సహేతుకమైన మార్పులు తేవాలి.

2019లో కాగ్‌ సంస్థ వ్యవసాయ ఆదాయం మినహాయింపు గురించి అధ్యయనం చేసింది. వ్యవసాయ ఆదాయం నుంచి మినహాయింపును కోరుతూ దాఖలైన రిటర్న్స్ ను విశ్లేషించారు. ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వస్తున్నా క్లెయిమ్స్ చేశారు. 6778 కేసులను కాగ్‌ పరిశీలించింది. 2019 పరోక్ష పన్నులు రిపోర్టు నెం 9లో ఈ విషయాలను పొందుపరిచారు. 22.5 శాతం కేసుల్లో సపోర్టు డాక్యుమెంట్లు లేకపోయినా, సరైన మదిింపు జరగక పోయినా, వ్యవసాయ ఆదాయం నుంచి మినహాయింపులను అనుమతించారు. ఒక కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం వొచ్చినా మదింపు కోరారు. ఈ విషయంలో అనేక సాంకేతిక దోషాలు.. డాటా ఎంట్రీ లోపాలు ఉన్నాయి. 10.7 శాతం కంపెనీలకు సంబంధించిన పన్ను మినహాయింపు కోరుతూ దాఖలైన రిటర్న్స్ వాటా 10.7 శాతంగా ఉంది.

 

వీరు మినహాయింపు కోరిన మొత్తం సొమ్ము రూ.1161.5 కోట్లు.  వ్యవసాయ ఆదాయంలో ఈ మొత్తం సొమ్ము వాటా 45 శాతంగా ఉంది. కార్పోరేట్‌ కంపెనీలు పెద్ద ఎత్తున వ్యవసాయ ఆదాయం పన్ను నుంచి మినహాయింపు పొందుతున్నాయి. ఈ కేటగిరీలోని వారు కార్పోరేట్‌ పన్ను నుంచి కూడా మినహాయింపు పొందుతున్నారు. కంపెనీలు వ్యవసాయ ఆదాయం పన్ను నుంచి మినహాయింపును పొంద కుండా పరిమితులు విధించాలి. బహుళ జాతి కంపెనీలు, పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలు కూడా వ్యవసాయ ఆదాయం పన్ను నుంచి మినహాయింపును పొందుతున్నాయి.ఫార్మాసూటికల్‌, బయోటెక్నాలజీ కంపెనీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇంకా ఈ దేశంలో గొప్పవాళ్లనుకునే వారు కూడా ఈ పన్ను నుంచి మినహాయింపు పొందుతున్న వారి జాబితాలో ఉన్నారు. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ కూడా ఈ అంశాలపై వొచ్చిన ఆరోపణలపై అధ్యయనం చేసింది.

 

వ్యవసాయ ఆదాయం పన్ను విధానంలో కూడా పరిమితులను విధించాలని ఈ కమిటీ సూచించింది. దీని వల్ల అసమానతలను తొలగించవొచ్చును. ఈ విధానంలో సంస్కరణలు తెస్తే ప్రత్యక్ష పన్నుల రేట్లను తగ్గించవొచ్చును. కొత్త ఆదాయం పన్ను విధానం తేవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మధ్యతరగతి వర్గం ఎక్కువగా ఉంది. వారు వ్యక్తిగత ఆదాయం పన్నును చెల్లిస్తున్నారు. వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తిని తొలగించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. వ్యవసాయ ఆదాయం ముసుగులో పన్ను మినహాయింపు పొందుతున్న బడా కంపెనీలకు ముకుతాడు వేసే విధంగా కేంద్రం వచ్చే బడ్జెట్‌లో తగిన చర్యలు తీసుకుంటుందా ? ఆ దిశగా అడుగులు వేస్తుందా చూడాలి. కొత్త బడ్జెట్‌లో తమకు ఊరట లభిన్తుందనే ఆశతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వేతన జీవులు, వివిధ వర్గాల వారు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. వీరికి మోదీ సర్కార్‌ ఖేదం కలిగిస్తుందా ? మోదాన్ని అందిన్తుందా వేచిచూడాల్సిందే. వ్యక్తిగత ఆదాయం పన్ను విధానంలో మాత్రం సహేతుకమైన మార్పులు లేదా సంస్కరణలు ప్రవేశపెట్టే విధంగా కేంద్ర సర్కార్‌ అడుగులు వేయక పోతే అసంతృప్తి పెరగడం ఖాయం.
-టి సి ఏ అనంత్
‘ది మింట్’ సౌజన్యం తో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page