నీట్‌ ‌యూజీ కౌన్సెలింగ్‌ వాయిదా

తదుపరి ఉత్వర్వులు ఇచ్చేవరకు నిలిపివేత
న్యూ దిల్లీ, జూలై 6 : వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ ‌యూజీ 2024 పరీక్షలో అక్రమాల వ్యవహారం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ నీట్‌ ‌యూజీ కౌన్సెలింగ్‌ను జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కౌన్సెలింగ్‌ ‌పక్రియ శనివారం నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా..తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు దాన్ని వాయిదా వేస్తున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. కొత్త తేదీలను కేంద్ర విద్యాశాఖ త్వరలోనే ప్రకటిస్తుందని తెలిపింది. కాగా.. నీట్‌ ‌కౌన్సెలింగ్‌ను వాయిదా వేసేందుకు సుప్రీమ్‌ ‌కోర్టు నిరాకరించినప్పటికీ ఎన్‌టీఏ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్‌ ‌యూజీ 2024 పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్‌ ‌లీక్‌ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడంపైనా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. నీట్‌ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్‌ ‌మార్కులు కలపడం, ఓఎంఆర్‌ ‌షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీమ్‌ ‌కోర్టులో దాదాపు 26 పిటిషన్లు దాఖలయ్యాయి. నీట్‌-‌యూజీ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదు.

దీనిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. కౌన్సెలింగ్‌ ‌వాయిదా వేయాలన్న పిటిషనర్ల అభ్యర్థులను తోసిపుచ్చింది. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు రుజువులు లేనప్పుడు ఆ చర్య చేపట్టడం హేతుబద్ధం కాదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లపై జులై 8న తదుపరి విచారణ జరగనుంది. ఈ పరిణామాల వేళ కౌన్సెలింగ్‌ను వాయిదా వేయడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page