- నిజాయితీగల అభ్యర్థుల ప్రయోజనాలకు దెబ్బ
- పారదర్శకంగా ప్రవేశ పరీక్షలకు కట్టుబడి ఉన్నాం
- సుప్రీమ్ కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో కేంద్రం స్పష్టం
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూలై 5 : నీట్-యుజి పరీక్షను రద్దు చేయడం సరియైన చర్యకాదని, ఈ చర్య నిజాయితీగల అభ్యర్థుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ వాప్తంగా సంచలనం సృష్టించిన, అభ్యర్థులను ఆందోళనకు గురి చేసిన నీట్-యుజి పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీమ్ కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ మేరకు తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. అయితే పేపర్ లీక్ అంశాన్ని ప్రస్తావించకుండా నీట్-యుజి నిర్వహణలో అక్రమాలు, మోసం, వంచన, అవకతవకలు జరిగినట్లు మాత్రమే అంగీకరించింది. రద్దు వల్ల కష్టపడి పరీక్ష రాసిన లక్షలాది మంది నిజాయితీ గల అభ్యర్థులు పరీక్షను పూర్తిగా రద్దు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతారని పేర్కొంటూ..పరీక్ష తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం తన విముఖతను వ్యక్తం చేసింది. పారదర్శకంగా పోటీ పరీక్షల నిర్వహణకు తాము కట్టుబడి ఉన్నట్లు పేక్కొంది.
నీట్ ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేసినట్లుసర్వోన్నత న్యాయస్థానానికి దాఖలు చేసిన అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కోంది. నీట్ అక్రమాలపై ఇప్పటికే సమగ్ర దర్యాప్తుకు ఆదేశించామని, భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాల్లేవని తెలిపింది. ఈ పరిస్థితిలో మొత్తం పరీక్షను, ఇప్పటికే విడుదలైన ఫలితాలను రద్దు చేయడం సహేతుకం కాదని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది.
విద్యా మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన అఫిడవిట్లో పాన్-ఇండియా పరీక్షలో పెద్ద ఎత్తున గోప్యత ఉల్లంఘించినట్లు రుజువు లేనప్పుడు, మొత్తం పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధమైన చర్య కాదని పేర్కొంది. కాగా పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్-పరీక్షను పేపర్ లీకేజీ కారణంగా తిరిగి నిర్వహించడంపై కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా తన అభిప్రాయాన్ని స్పష్టం చేసింది.