పార్టీ కొత్త అధ్యక్షుల నియామకంపై కసరత్తు

ఎన్నికలు ముగియడంతో సాంస్థాగతంపై జాతీయ పార్టీల దృష్టి  
 దిల్లీ నాయకులతో మంతనాలు ిపాలనపై దృష్టికి నియామక ప్రక్రియ  సత్వరమే పూర్తి

(మండువ రవీందర్‌రావు)
హైదరాబాద్‌, జూన్‌ 18 : దేశంలో సారస్వత ఎన్నికలతో పాటు, వివిధ రాష్ట్రాల ఎన్నికలు ముగియటంతో ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలు తమ పార్టీల అధ్యక్షుల వేటలో పడ్డాయి. గడచిన ఆరు నెలల కాలంలో దేశంలో కొనసాగుతున్న ఎన్నికల పక్రియ తో  రాజకీయాలు వేగవంతంగా మారుతూ వొస్తున్నాయి. అనూహ్యంగా ప్రభుత్వాలు కూడా మారుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలను పరిశీలిస్తే ఆరు నెలల క్రితేమే తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అప్పటి వరకు దశాబ్దకాలంగా ప్రభుత్వాన్ని ఏలిన భారత రాష్ట్ర సమితి ఓటమిని చవిచూడాల్సి వొచ్చింది. పదేళ్ళ క్రింద అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ ప్రభుత్వం తిరిగి అధికారాన్ని దక్కించుకో గలిగింది. ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో విశేషంగా కృషిచేసిన ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టారు. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారనడానికి కాంగ్రెస్‌ పార్టీని ఆయన అధికారంలోకి తీసుకురావడమే. అయితే ఆయన టిపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి దాదాపు మూడు సంవత్సరాలు పూర్తి కావొచ్చింది. ఆయన పదవీ కాలం ఈ నెల 27తో పూర్తికానుండడంతో ఆ పార్టీ ఇప్పుడు కొత్త అధ్యక్షుడి వేటను ప్రారంభించింది.

 

ఒకనాడు టిపీసీసీ అధ్యక్ష పదవిని ముళ్ళ కిరీటంగా భావించిన పలువురు నాయకులు ఇప్పుడీ పదవి కోసం క్యూ కడుతున్నారు. పదేళ్ళ తర్వాత  అధికారంలోకి రావడంతోపాటు, జాతీయ స్థాయిలో బిజెపిని ఎదుర్కునే సత్తా ఉందని తాజా పార్లమెంటు ఎన్నికల ద్వారా రుజువు కావడంతో పార్టీ పదవుల కోసం రాష్ట్ర నాయకులు దిల్లీ చుట్టు చక్కర్లు కొడుతున్నారు. దీంతో ఈ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నవారి జాబితా పెద్దదిగానే ఉంది. చాలాకాలంగా ఈ పదవిని ఆశిస్తున్నవారిలో పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ జగ్గా రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఆయన రేవంత్‌రెడ్డి టిపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ముందు నుండీ ఈ పదవిని ఆశిస్తున్న వ్యక్తి. టిపీసీసీ మరో వర్కింగ్‌   ప్రసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ , అలాగే ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌తో పాటు మంత్రులుగా కొనసాగుతున్నవారూ ఉన్నారు. వారిలో దామోదర రాజనర్సింహా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీతక్క , పొన్నం ప్రభాకర్‌ లాంటి వారున్నారు. కాగా పార్టీ గెలుపుకోసం గత ఎన్నికల్లో విశేషంగా కృషిచేసిన మధుయాస్కీ తనకే ఆ పదవి వొస్తుందన్న ధీమాతో ఉన్నారు. కాగా ఎంపి బలరామ్‌ నాయక్‌, సురేష్‌ షెట్కర్‌ లాంటి వారు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నవారిలో ఉన్నారు.

ఇదిలా ఉంటే భారతీయ జనతాపార్టీలో కూడా ఇలాంటి సన్నివేశమే కొనసాగుతున్నది. అయితే ఆ పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అధ్యక్షుల వేటలో ఉంది. రాష్ట్రంలో ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్‌రెడ్డిని మోదీ కొత్త క్యాబినెట్‌లో మంత్రిగా తీసుకున్నారు. అంటే గతంలో సహాయ మంత్రిగా కొనసాగుతూ కూడా కిషన్‌రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఇప్పుడు కిషన్‌రెడ్డి పూర్తిస్థాయిలో మంత్రిగా కొనసాగనున్నట్లు తెలుస్తున్నది. అలాంటి పరిస్థితిలో రెండు బాధ్యతలను మోయడం కష్టం కావడంతో మరొకరికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని పార్టీ భావిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే కిషన్‌రెడ్డి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. అప్పటి వరకు ఫైర్‌ బ్రాండ్‌గా కొనసాగుతున్న బండి సంజయ్‌ను అనూహ్యంగా ఆ పదవి నుండి తొలగించి కిషన్‌రెడ్డికి అ పదవిని అప్పగించారు. ఏదేమైనా కిషన్‌ రెడ్డి అంతకుముందు తెలంగాణలో నలుగురు ఎంపీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు రెండితలు అనగా ఎనిమిది మంది ఎంపీలను గెలిపించడం ద్వారా ఆయనకిచ్చిన బాధ్యత సమర్థవంతంగా నిర్వహించాడన్న ఉద్దేశ్యంగానే ఆయన ను  మరోసారి కేంద్ర క్యాబినెట్‌లో బిజెపి పార్టీ తీసుకుంది. రాబోయే కాలంలో తెలంగాణపై కాషాయ జండా ఎగురవేయాలనుకుంటున్న తరుణంలో సమర్థుడైన వారికి ఈ బాధ్యతలను అప్పగించాలని పార్టీ భావిస్తున్నది.

 

అయితే కిషన్‌రెడ్డితో పాటు బండి సంజయ్‌ని కూడా క్యాబినెట్‌లోకి తీసుకోవడంతో మంత్రి పదవులపైన ఆశపెట్టుకున్న పలువురు ఆ పార్టీ ఎంపీలు అధ్యక్ష పదవిని దక్కించుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్నారు. వారిలో ప్రధానంగా వినవస్తున్నపేరు  ఈటల రాజేందర్‌. బిఆర్‌ఎస్‌ పార్టీ నుండి బయటికి వొచ్చిన ఈటల రాజేందర్‌ను బిజెపి మొదటి నుండీ హీరోగానే పరిగణిస్తున్నది. మల్కాజీగిరి ఎంపీ ఎన్నికల్లో విజయదుందుభిని మోగించిన ఈటల వివాదరహితుడిగా అందరినీ కలుపుకుపోతాడన్న భావన పార్టీ వర్గాలకుంది. దానికి తగినట్లుగా ఆయనతో దిల్లీ పెద్దలు ఇప్పటికే సంప్రదిస్తున్నట్లు వినికిడి. పార్టీ అధిష్టాన దూతగా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్‌ బిశ్వాస శర్మ ఈటలతో చర్చలు జరిపినట్లు కూడా వార్తలు వొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకుంటున్నారు. అయినప్పటికీ మహబూబ్‌నగర్‌ ఎంపీ, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఆమెతో పాటు నిజామాబాద్‌ నుండి రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన ధర్మపురి అరవింద్‌, మరో ఎంపి రఘునందన్‌రావులు తమవంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే జాతీయ స్థాయిలో కూడా బిజెపి కొత్త అధ్యక్షుడిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జెపి నడ్డా పదవీకాలం గత జనవరిలోనే పూర్తి అయింది. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా అయన నే  ఇప్పటి వరకు కొనసాగించారు. ఇప్పుడు మోదీ కొత్త క్యాబినెట్‌లో మంత్రిగా నడ్డా ప్రమాణ స్వీకారం చేయడంతో మరో వ్యక్తి కోసం ఆ పార్టీ వెతుకుతుంది. పార్టీ జనరల్‌ సెక్రెటరీగా ఉన్న వినోద్‌ తావ్డే, పార్టీ యుపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన సునీల్‌ బన్సల్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తున్నది. బన్సల్‌ గతంలో పశ్చిమ బెంగాల్‌, ఒడిషా, తెలంగాణ ఇన్‌ఛార్జి జనరల్‌ సెక్రెటరీగా కొనసాగారు. కాగా తావ్డే ప్రస్తుతం బీహార్‌ ఇన్‌ఛార్జి జనరల్‌ సెక్రెటరీగా ఉన్నారు. కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వాలు పాలనపై దృష్టిపెట్టే క్రమంలో పార్టీ అధ్యక్షుల నియామక పక్రియను సత్వరం పూర్తి చేయనున్నట్లు తెలుస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page