నేటి నుండి నామినేషన్‌ల పర్వం షురూ…

  • పరాకాష్టకు చేరిన ఆరోపణలు…ప్రత్యారోపణలు
  • ఏడాదిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలుతుందంటున్న కెసిఆర్‌  
  • రేవంత్‌ బిజెపికి వెళ్ళడం ఖాయమన్న కెటిఆర్‌
  • ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదంటున్న భట్టి..

(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 : నేటి నుండి నామినేషన్‌లు మొదలవనుండగా ప్రత్యర్థి పార్టీల మధ్య ఆరోపణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. కనీస మర్యాదలను కూడా అతిక్రమించి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీపడుతున్న మూడు పార్టీలుకూడా ఎదుటివారి తప్పులను ఎత్తిచూపుతున్న తీరును పరిశీలిస్తే ఈ పార్టీలన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయాయన్నది స్పష్టమ వుతున్నది. దానికి ఆయా పార్టీలు ఏవో సాకులు చెబుతున్నా తెలంగాణ ప్రజానీకానికి మాత్రం అన్యాయం జరిగిందన్నది ఆ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు చెప్పకనే చెబుతున్నాయి. అమలుకాని పలు హామీలనిచ్చి అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బిఆర్‌ఎస్‌ ఆరోపిస్తుంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలను వందరోజుల్లో అమలు చేస్తామని నమ్మపలికింది. కాని, వందరోజులు కాదు, నాలుగు నెలలు దాటినా ఆ హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చలేకపోయిన అంశాన్ని ఈ ఎన్నికల సందర్భంగా పదేపదే ఎత్తిచూపుతుంది బిఆర్‌ఎస్‌. రైతాంగంపైన కపట ప్రేమను ఒలకబోస్తున్న కాంగ్రెస్‌ రైతాంగానికి ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీని అమలు చేయలేకపోయింది. అలాగే వరిపంటకు ఇస్తానన్న అయిదు వందల రూపాయల బోనస్‌ ఈ సీజన్‌లో ఇవ్వకపోవడాన్ని కూడా బిఆర్‌ఎస్‌ ఎత్తిచూపుతుంది.

రైతు బంధు విషయంలో పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్‌ వల్ల పూర్తిస్థాయిలో ఇవ్వలేకపోయామని కాంగ్రెస్‌ చెబుతుంటే, పెంచి ఇస్తామన్న మాట నిలబెట్టుకోలేదని బిఆర్‌ఎస్‌ వాదిస్తుంది. వీటన్నిటి దృష్ట్యా ఇప్పుడు తెలంగాణ ప్రజలు మళ్ళీ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారంటుంది బిఆర్‌ఎస్‌. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ కాంగ్రెస్‌పైన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఏడాదిపాటు కూడా కొనసాగదన్న ఆయన వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. కెసిఆర్‌ మాటల వెనుక ఏదైనా గూడపుఠాణి నడుస్తున్నదా? నిజంగానే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడదోసే ఏదైనా కుట్ర జరుగుతున్నదా అన్నదిప్పుడు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు తెలంగాణ ప్రజల మస్తిష్కాను తొలుస్తున్నది. కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నట్లు బిఆర్‌ఎస్‌, బిజెపి కలిసినా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడదోసే అవకాశాలులేవు. పైగా బిఆర్‌ఎస్‌ నుంచి తాజాగా గెలిచిన ఎంఎల్‌ఏలు ఒకరి తర్వాత ఒకరుగా కాంగ్రెస్‌ బాటపడుతున్న నేపథ్యంలో కెసిఆర్‌ వ్యాఖ్యలను ఎలా అర్థంచేసుకోవాన్న చర్చకూడా జరుగుతుంది. ఇదిలా ఉంటే బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ మరో రెండు సంచలనాత్మక ప్రకటనలు చేశారు. అందులో ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్‌రెడ్డి కాషాయ తీర్థం తీసుకుంటాడన్న బాంబు పేల్చారు. వాస్తవానికి కెసిఆర్‌ కూడా తాజాగా ఇదే అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. వీరికున్న సమాచారమేమోగాని, ఇటీవల కాలంలో ఇదే విషయాన్ని  బిఆర్‌ఎస్‌ నాయకులు పదేపదే వల్లిస్తుండడంతో ప్రజల్లో అనుమాన బీజాలు నాటుకుంటున్నాయి.

మంగళవారం ఆదిలాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం బూత్‌ స్థాయి నాయకుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే బిజెపీ వ్యక్తా..కాంగ్రెస్‌ వ్యక్తా..అన్నది తేల్చిచెప్పాలంటూ కెసిఆర్‌ రేవంత్‌ను నిలదీశారు. లోకసభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో చాలామర్పులు చోటుచేసుకోనున్నాయి. అందులో భాగంగా రేవంత్‌రెడ్డి ఖచ్చితంగా బిజెపిలోకి జంప్‌చేసే అవకాశాలున్నాయంటాడు కెటిఆర్‌. అందుకాయన కొన్ని ఉదాహరణలను కూడా ప్రస్తావించారు. చౌకీదార్‌ చోర్‌ హై అని రాహుల్‌ గాంధీ అంటే ‘మోదీ మేరా బడా బాయ్‌’ అని రేవంత్‌రెడ్డి అనడాన్ని, ఆదాని ఫ్రాడ్‌ అని రాహుల్‌ అంటే, ఆయన నా ఫ్రెండ్‌ అంటాడు రేవంత్‌. గుజరాత్‌ మాడల్‌ గోల్‌మాల్‌ అని రాహుల్‌ అంటే గుజరాత్‌ మాడల్‌ తెలంగాణకు తెస్తామంటున్న రేవంత్‌రెడ్డి తీరు చెప్పకనే చెబుతున్నదన్నది కెటిఆర్‌ ఆరోపణ. ఇదిలాఉంటే పార్లమెంటు అభ్యర్థులను నిలబెట్టే విషయంలో కూడా ఈ పార్టీలు ఒకరికొకరు నిందారోపణలు చేసుకుంటున్నాయి. బిజెపి అభ్యర్థులు గెలిచే విధంగా కాంగ్రెస్‌ కొన్ని చోట్ల డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందంటే, మీరే బిజెపి గెలుకోసం డమ్మీలను నిలబెట్టారని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నాయి. చిత్రమేమంటే ఈ రెండు పార్టీల ఆరోపణలు నిజంగానే నిజమైతే ఈ రెండు కూడా ఎవరికివారుగా బిజెపికి అనుకూలంగా మారుతున్నాయా అన్న అనుమానం కలుగకపోదు. సికింద్రాబాద్‌, చేవెళ్ళ మల్కాజిగిరి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ల్లో బిజెపి గెలుపుకోసం బిఆర్‌ఎస్‌ డమ్మీ అభ్యర్ధులను నిలబెట్టిందన్నది కాంగ్రెస్‌ ఆరోపిస్తుండగా, మహబూబ్‌నగర్‌, చేవెళ్ళ, మల్కాజిగిరి, భువనగిరి, జహీరాబాద్‌ల్లో బిజెపి అభ్యర్థుల గెలుపుకోసం బిఆర్‌ఎస్‌ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందన్నది కాంగ్రెస్‌ ఆరోపణ.

కాగా, కాంగ్రెస్‌ అటు బిఆర్‌ఎస్‌, ఇటు బిజెపిపైన విరుచుకుపడుతున్నది. వాస్తవంగా ఈ రెండు అవగాహనతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయన్నది కాంగ్రెస్‌ ఆరోపణ. పదేళ్ళపాటు అధికారంలోఉన్న బిఆర్‌ఎస్‌ ప్రజా ధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయడమే కాదు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందంటూ  ప్రచార సభలో బిఆర్‌ఎస్‌పైన తీవ్రంగా విరుచుకుపడుతున్న కాంగ్రెస్‌..ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బిఆర్‌ఎస్‌కు రాదని ఘంటాపథంగా చెబుతుంది. ఇటీవల కాంగ్రెస్‌కు రెండు స్థానాలు కూడా రావని బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ చేసిన ప్రకటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విరుచుకుపడ్డాడు. పదేళ్ళపాటు కెసిఆర్‌ ఇలానే మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మిస్తూ వొచ్చారని, కాని, వాస్తవ పరిస్థితిని తెలుసుకున్న తెలంగాణ ప్రజలు ఆయన్ను అధికారానికి దూరం చేశారంటూ, ఇప్పటికీ కొందరు బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏలు అక్కడ ఇముడలేక కాంగ్రెస్‌లో చేరుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బిఆర్‌ఎస్‌ పదేళ్లపాలనలో జరిగిన అనేక ఆకృత్యాలు, అక్రమాలు, భూ దందాలు, ఫోన్‌ ట్యాపింగ్‌, ధరణి అమలులో ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నిటితో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఇచ్చిన హామీలన్నిటినీ ఒకదాని వెనుక ఒకదాన్ని అమలు చేస్తూ, సవరించుకుంటూ వొస్తున్న విషయాన్ని కాంగ్రెస్‌ ప్రజల ముందు వివరించే ప్రయత్నం చేస్తున్నది. ఇదిలా ఉంటే బిజెపిపైన కూడా కాంగ్రెస్‌ తీవ్ర ఆరోపణలు చేస్తున్నది.

కేంద్రంలో అధికాంలో ఉన్న బిజెపి గత పదేళ్ళుగా ఇచ్చిన వాగ్ధానాలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమవటమే గాక,  ఈ ఎన్నికల వేళ మరికొన్ని సరికొత్త వాగ్ధానాలతో మళ్ళీ ప్రజల ముందుకు వొస్తున్నదని కాంగ్రెస్‌ ఆరోపిస్తున్నది. దేశంలో నిరుద్యోగం తారస్థాయికి చేరినా బిజెపి ప్రభుత్వం పట్టించుకోలేదని, గతంలో ఆధికారంలోకి వొచ్చేముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పిన విషయాన్ని కాంగ్రెస్‌ తన ప్రచారాస్త్రంలో వాడుకుంటుంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న బిజెపి అందుకు బిన్నంగా రైతు ఆదాయం తగ్గే విధంగా చర్యలు తీసుకుంటుందంటుంది కాంగ్రెస్‌. 2014లో ఆంధప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను కూడా బిజెపి నెరవేర్చలేకపోవడాన్ని కాంగ్రెస్‌తో పాటు బిఆర్‌ఎస్‌ కూడా ఏకరువు పెడుతున్నది. బిజెపి మళ్ళీ అధికారంలోకి వొస్తే రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన చేస్తుందన్నది కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణల్లో ప్రధానమైంది. బిజెపికి దేశ ప్రయోజనాలకంటే స్వప్రయోజనాలే ముఖ్యమని చెబుతున్న కాంగ్రెస్‌ కేంద్రంలో తాము అధికారంలోకి వొచ్చిన వంద రోజుల్లోనే ప్రజల ముందుంచిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలుపర్చి చూపిస్తామంటుంది.

ఇటీవల జాతీయ స్థాయిలో ‘సంకల్ప ప్ర’ పేరున విడుదల చేసిన మేనిఫెస్టో, గ్యారంటీకార్డు ప్రజల భద్రతా కార్డుగా చెప్పుకుంటున్న బిజెపి కేవలం వోట్లను దండుకోవడానికేనంటుంది. బిఆర్‌ఎస్‌ అనేక తప్పిదాలపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం వెనుక ఈ రెండు పార్టీలు అంతర్గత ఒప్పందంతో ఉన్నాయన్నది స్పష్టమవుతున్నదన్నది కాంగ్రెస్‌ ఆరోపణ. కాగా బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం లాగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా రైతులను, ప్రజలను మోసం చేస్తున్నదని బిజెపి ఆరోపిస్తున్నది. వందరోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అసెంబ్లీలో వోట్లు దండుకున్న కాంగ్రెస్‌ దాన్ని అమలు పర్చకుండా, పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆగస్టు 15 కల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని పలకడం కేవలం వోట్ల కోసమేనని ఆ పార్టీ విమర్శిస్తుంది.

ఆనాడు  సోనియా జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్‌ 9న ఏకకాలంలో రుణమాఫీ చేస్తామన్న విషయాన్ని కాంగ్రెస్‌ మరిచిపోయిందంటున్న బిజెపి, యాసంగిలో రైతులకు ఇస్తామన్న బోనస్‌ చెల్లించడానికి వచ్చిన అవరోధమేంటని ప్రశ్నిస్తున్నది. బిఆర్‌ఎస్‌ నాయకులు అవినీతిపరులంటూనే వారికి కాంగ్రెస్‌ కండువ కప్పడం పట్ల బిజెపి నాయకత్వం నిలదీస్తున్నది. రాజకీయాల్లో ప్రతిపక్షాలు ఉంటేనే ప్రజాస్వామ్య పరిఢవిల్లుతుందని చెబుతున్న కెసిఆర్‌ తానే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన విషయాన్ని విస్మరించాడంటూ,  కాలం ఎంత త్వరగా గుణపాఠం నేర్పిస్తుందనేందుకు ఆయన మాటలే నిదర్శనమంటున్నారు బిజెపి నాయకులు. బిఆర్‌ఎస్‌ మునిగిపోయిన నావ కాగా, కాంగ్రెస్‌ మునగబోయే నావ అని భవిష్యత్‌ అంతా బిజెపిదే నంటున్నారు ఆ పార్టీ నాయకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page