ఇచ్చిన హావిూలను అమలు చేసి చూపుతాం
డిప్యూటి సిఎం మల్లు భట్టివిక్రమార్క
ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 1 : కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పిందే చేస్తాం..చేయగలిగేదే చెప్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముదిగొండ మండల సీతారాంపురం సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ…తనను ఈ స్థాయిలో ఉంచింది మధిర నియోజకవర్గ ప్రజలే అని.. సీతారాంపురం గ్రామస్థులు చల్లగా ఉండాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని.. పనుల విషయంలో అధికారుల పర్యవేక్షణ తప్పని సరి అని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలు తప్పక అమలు చేసి తీరుతామన్నారు. రాష్ట్రంలో పేదలకు 2 వందల యూనిట్లు విద్యుత్, 5 వందలకే గ్యాస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. పేదల కోసం రూ.10 లక్షలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేయ బోతున్నట్లు తెలిపారు. మధిర నియోజకవర్గ ప్రజల వోటుకు గౌరవం తెచ్చే విధంగా పనిచేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వంలో మంత్రులుగా కంకణ బద్ధులై పనిచేస్తున్నామన్నారు. ఉద్యోగులను గత ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని…కాంగ్రెస్ ప్రభుత్వం వారిని తిరిగి ఆదుకుంటుందని తెలిపారు.
ప్రతి మాట..ప్రతి వాగ్దానం నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టేందుకు రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలను అందజేస్తామన్నారు. నిరుద్యోగులు గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడ్డారన్నారు. రూ.2.75 కోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించాలనే ఉదేశ్యంతో ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన అతికొద్ది రోజుల్లోనే గ్రూప్ 1నోటిఫికేషన్ కూడా విడుదల చేశామన్నారు. రాష్టంలో ప్రతి బిడ్డ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలనేదే ఈ ప్రభుత్వా లక్ష్యమన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట.. ప్రతి వాగ్దానం నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఎవరిని మోసం చేయాలని ఆలోచన తమకు లేదన్నారు. పదేళ్లు ప్రజలకు భ్రమలు కల్పించి పబ్బం గడుపుకోవాలనే ఆలోచన అంతకన్నా లేదన్నారు. వందేళ్ళ చరిత్ర కలిగిన ఈ పార్టీ మరో వందేళ్లు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలన సాగించి ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రజలను మోసం చేసి పాలన సాగిస్తే రానున్న రోజులు ఇంటికి పంపిస్తారని.. ప్రజలకు అంకితమై పని చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడిరచారు.