బిజెపిలో చేరిన నాగర్‌కర్నూల్ ఎంపి రాములు
కండువా కప్పి ఆహ్వానించిన బిజెపి నేతలు
తెలంగాణలో బిఆర్ఎస్ పని అయిపోయిందన్న డా.లక్ష్మణ్
న్యూదిల్లీ,ఫిబ్రవరి29: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీని వీడిన నాగర్‌కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరారు. గురువారం దిల్లీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చంద్రశేఖర్, బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. కాగా, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, రాములుకు మధ్య విభేదాలు ముదిరాయి. తానే ఎంపీ అభ్యర్థిని అంటూ బాలరాజు ప్రచారం చేసుకుంటుండటంతో రాములు బీఆర్ఎస్ను వీడినట్లు తెలుస్తుంది. తెలంగాణలో అధికారం కోల్పోయి ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన బీఆర్ఎస్ కు వరస షాక్ లు తగులుతున్నాయి. గులాబీ పార్టీ నుంచి బీజేపీ, కాంగ్రెస్ లోకి చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిపోతోంది. తాజాగా నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు, ఆయన కుమారుడు భరత్ లు బీజేపీలో చేరారు. ఇంఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో కాషాయ జెండా కప్పుకున్నారు. పార్టీ సభ్యత్వం అందుకున్నారు. వీరితో పాటు లోక్ నాథ్ రెడ్డి, రఘునందన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డిలు బీజేపీలోకి చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ మాట్లాడుతూ మచ్చలేని మనిషి ఎంపీ రాములు అని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీది ముగిసిపోయిన అధ్యాయం అని, అది మునిగిపోయిన పడవ అని అన్నారు. బీఆర్ఎస్ నియంతృత్వ పాలన భరించలేక ప్రజలు ఓడిరచారన్నారు. ఎంపీ రాములు సేవలు బీజేపీకి ఎంతో అవసరం అవుతాయని వ్యాఖ్యానించారు. పదేళ్లలో ప్రధాని మోదీ చేసిన సంక్షేమ పథకాలే.. రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలు గెలిపిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
రోజు దేశంలో ఏదో ఒక ప్రాంతం నుంచి సమాజం కోసం పనిచేసే వారు బీజేపీలో చేరుతున్నారు. ప్రధాని నేతృత్వంలో పదేళ్లలో పేదరికానికి వ్యతిరేకంగా మోదీ యుద్ధం చేస్తున్నారు. పేదలకు ఇళ్లు, గ్యాస్, నీళ్లు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారని తరుణ్ చుగ్ వివరించారు. దేశ ఖ్యాతి, వికసిత భారత్ లక్ష్యాన్ని, పేదరిక నిర్ములన కోసం ప్రధాని చేస్తున్న పనిని చూసి చూసి బీజేపీలో చేరుతున్నట్లు ఎంపీ రాములు స్పష్టం చేశారు. ఇక రాములు చేరికను స్వాగతించిన రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్.. తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా మారుతోందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ మునిగిపోయిన నావ.. కారు రిపేర్ అయ్యే పరిస్థితి లేదు. మార్పులో భాగంగా కాంగ్రెస్ లాభపడిరది. కానీ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితి చూస్తున్నాం. తెలంగాణలో బీజేపీ బలపడుతోంది. చాలామంది మా పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తెలంగాణలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మోదీని మూడోసారి ప్రధానిని చేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు. ఎంపీ రాములు బీజేపీలో చేరడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయనమన్నారు. ఇంకా చాలా మంది బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరుతారని అన్నారు. గత పదేళ్లలో తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసి.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించిందన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పదికి పైగా ఎంపీ స్థానాలు గెలచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని.. ఇక, కాంగ్రెస్-బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని లక్ష్మణ్ తెలిపారు.