‘కృష్ణా’పై రెండు పార్టీల డ్రామాలు

 బిఆర్‌ఎస్‌కు వోటేస్తే డ్రైనేజీలో వేసినట్టే

హామీలను విస్మరించిన కాంగ్రెస్‌ను కడిగి పారేయండి
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకుపైగా గెలవబోతుంది
ప్రజాహిత యాత్రలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌
వొచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌తో సహా ఎవరితోనూ పొత్తు ఉండదని వెల్లడి
వేములవాడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 12 : కృష్ణా నదీ జలాల వాటాపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు డ్రామాలాడుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ మండిపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రజలను వాటి నుంచి దారి మళ్లించేందుకు కృష్ణా జలాల అంశాన్ని తెరపైకి తెచ్చిందంటూ సంజయ్‌ విమర్శించారు. కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ప్రజా హిత పాదయాత్ర మూడవ రోజు సోమవారం వేములవాడ నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా వేములవాడ రూరల్‌ మండలంలోని బాలరాజ్‌ పల్లి, నమిలిగుండుపల్లి, చెక్కపల్లి, వట్టెంల, నూకలమర్రి, వేములవాడ పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 512 టీఎంసీలు రావాల్సి ఉండగా, 299 టీఎంసీలకే అంగీకరించి గత 10 ఏళ్లలో 812 టీఎంసీల నీటిని ఏపీకి దోచిపెట్టి బీఆర్‌ఎస్‌ మోసం చేస్తే… పోతిరెడ్డిపాడుకు గండిపెట్టి 4 వందలకు పైగా టీఎంసీల నీటినీ సీమకు కట్టబెట్టి కాంగ్రెస్‌ మోసం చేసిందని బండి సంజయ్‌ విమర్శించారు. రెండు పార్టీలు కలిసి దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి ప్రజల నోట్లో మట్టికొట్టారని ఆయన మండిపడ్డారు. దేవుడిని నమ్మని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలకు ఎందుకు వోటేయాలని ప్రశ్నించారు. రాముడిని మొక్కెటోళ్లంతా అయోధ్య గుడి కట్టిన బీజేపీకి వోటేయండని, దేవుడక్కర్లేదు..దేవుడిని మొక్కని వాళ్లు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లకు వోటేయండని అన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు ఇస్తానని కేసీఆర్‌ మోసం చేసిండని బండి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేములవాడ పట్టణంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి రెండుసార్లు కూలి ఆ పనులు 5 ఏళ్లుగా  సాగుతూనే ఉన్నాయన్నారు. బ్రిడ్జి నుండి రాజన్న ఆలయం బద్ది పోచమ్మ గుడి వద్ద నుండి పోలీస్‌ స్టేషన్‌ వరకు రహదారి విస్తరణ కోసం జనం ఎదురు చూస్తున్నారన్నారు. గుడి చెరువు పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. పట్టణ మురికి నీరంతా గుడి చెరువులోకి వొస్తున్నాయని, మురికి కాలువ నీరు గుడి చెరువులోకి వొచ్చి కలుషితమవుతుందన్నారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం 575 కోట్ల 95 లక్షలకుపైగా నిధులిచ్చాడని వివరించారు. వేములవాడ నియోజకవర్గంలో నిర్మిస్తున్న రోడ్ల నిధులన్నీ కేంద్రానివేనన్నారు. ఎములాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిధులిస్తామని, ప్ర్రసాదం స్కీమ్‌ కింద ప్రతిపాదనలు పంపాలని కోరినా అప్పటి బిఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. బీఆర్‌ఎస్‌కు వోటు వేస్తే డ్రైనేజీలో వేసినట్లేనని, తనను మళ్లీ ఎంపీగా గెలిపిస్తే రాజన్న, కొండగట్టు అంజన్న ఆలయాలను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. వొచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా బీజేపీ గెలవబోతుందని అయన అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సాకులు చెబుతుందన్నారు. దేశం కోసం కష్టపడుతున్న మోదీకి వోటేసి మూడోసారి ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి చెన్నమనేని వికాస్‌ రావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రతాప్‌ రామకృష్ణ, రూరల్‌ మండల అధ్యక్షుడు జక్కుల తిరుపతి, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
వొచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌తో సహా ఎవరితోనూ పొత్తు ఉండదని వెల్లడి
రానున్న లోక్‌ సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఎవరితోనూ పొత్తులు ఉండవని బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలో తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్‌తో కలిసి పొత్తుతో వెళతారన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన కరీంనగర్‌లో విూడియాతో మాట్లాడుతూ…తెలంగాణలో బీజేపీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని..బీజేపీతో పొత్తు ఉంటుందని బీఆర్‌ఎస్‌ నేతలు సిగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునే మూర్ఖకత్వపు పార్టీ తమది కాదన్నారు. ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పుకునే దమ్ము బీఆర్‌ఎస్‌కు లేదని అన్నారు. తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు రాగానే ప్రజలను మభ్యపెడుతున్నారని, ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ది మూడో స్థానమేనని, మూడో స్థానానికి వెళ్లే పార్టీతో పది స్థానాలు గెలిచే బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు కొత్త డ్రామాలు ఆడుతున్నాయని బండి సంజయ్‌ అన్నారు. ఇదిలావుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో శ్రీ మార్కండేయ స్వామి వారి ఆలయం పవర్‌ ఫుల్‌గా మారనుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. అయోధ్య శ్రీ రామ మందిరానికి ఎంతో మంది భక్తులు సహాయ సహకారాలు అందించారిన, అదే విధంగా ఈ మార్కండేయ గుడికి కూడా సహాయ సహకారాలు అందించాలని కోరారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీ శివభక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారిని ఎంపీ బండి సంజయ్‌ దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో  ఆలయ అర్చకులు, పద్మశాలి సంఘం నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి..ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయ నిర్మాణానికి భక్తులు అందరూ భాగస్వాములు అవ్వాలని కోరారు. గుడి నిర్మాణానికి తనవంతు సహాయం అందిస్తానన్నారు ఎంపీ బండి సంజయ్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page