నిజాలను తెలపడంలో రాజీ పడని అమర్•’మూడు దారులు’ రాయడం అభినందనీయం•పుస్తక పరిచయ సభలో జస్టిస్ జె.చలమేశ్వర్భావితారలకు నిజాలు తెలియజేసే ప్రయత్నమే ‘మూడు దారులు’•జరిగిన వస్తావాలను ఎక్కడ వక్రీకరించలేదు•పుస్తక రచయిత, జర్నలిస్ట్ దేవులపల్లి అమర్
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 : తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై నిజాలను తెలపడంలో రాజీ పడకుండా దేవులపల్లి అమర్ ‘మూడు దారులు’ పుస్తకం రచించడం అభినందనీయం అని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ రచించి, రూప పబ్లికేషన్స్ ఇండియా లిమిటెడ్ న్యూ దిల్లీ ప్రచురించిన ‘మూడు దారులు'(రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు) పుస్తక పరిచయ సభ సీనియర్ జర్నలిస్ట్ చక్రధర్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ జె.చలమేశ్వర్ మాట్లాడుతూ ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచిన రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రకు ముందు పాదయాత్ర తర్వాత తనలో ఎంతో మార్పు వొచ్చిన విషయాన్ని తనతో పంచుకున్నట్లు ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ గుర్తు చేసుకున్నారు. తెలుగు ప్రజలు పడే కష్టాలు తనకు కూడా తెలుసని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు, వైఎస్.రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన రెడ్డి ఈ ముగ్గురూ ముఖ్యమంత్రులుగా తమదైన ముద్ర వేసుకున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల 40 ఏళ్ల ఏళ్ళ చరిత్ర ఈ ముగ్గురితో ముడిపడి వున్న ఈ చారిత్రక పరిణామాలను ఒక సీనియర్ జర్నలిస్టుగా దగ్గర నుంచి పరిశీలించగలిగిన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని దేవులపల్లి అమర్, తన అనుభవ సారాన్ని ఈ పుస్తకంలో విస్తరంగా ప్రస్తావించారని అన్నారు. ఎన్టీఆర్, వైయస్సార్, జగన్ మోహన్ రెడ్డిలు పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లారని అన్నారు. దేవులపల్లి అమర్ మాట్లాడుతూ మూడు దారులు పుస్తకంలో తాను వస్తావాన్ని ఎక్కడ వక్రీకరించలేదని అన్నారు. జరిగిన సంఘటనల మీద ఇందులో తన అభిప్రాయాలను వ్యక్తం చేశానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చరిత్రను భావి తారలకు ఈ పుస్తకం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశానని అన్నారు. దిల్లీలో చాలా మందికి దక్షిణాదిలో ఏం జరుగుతుందనే విషయం తెలియదని, ఆ ప్రయత్నం కూడా వారు చేయరని అన్నారు. ఈ పుస్తకం రాయాలనే ఆలోచనకు దిల్లీలో బీజం పడిందని అన్నారు. అనంతరం ముఖ్య అతిథులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ పుస్తక పరిచయ సభకు సమన్వయకర్తగా సీనియర్ పాత్రికేయులు బిఎస్.రామకృష్ణ వ్యవహరించగా సీనియర్ పాత్రికేయులు కల్లూరి భాస్కరం పుస్తక పరిచయం చేసారు.