తాగునీరు అందని గ్రామాలను గుర్తించేందుకు సర్వే
తాగునీటికి నియోజకవర్గానికో రూ.కోటి ప్రత్యేక నిధులు
కృష్ణా గోదావరితో పాటు కొత్త ప్రాజెక్టుల వినియోగం
రోడ్లు లేని 422 గ్రామాలు, 3177 ఆవాసాలకు తారు రోడ్లు
స్వయం సహాయక సంఘాలకు చేయూతగా కొత్త కార్యక్రమాలు
పంచాయతీరాజ్ సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి30:
వందకు వంద శాతం తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చినట్లు గత ప్రభుత్వం చెప్పుకోవటంతో నష్టమే తప్ప లాభం లేకుండా పోయిందని ముఖ్యమంత్రి అన్నారు. దీంతో కేంద్రం నుంచి తెచ్చుకునేందుకు వీలున్న జల జీవన్ మిషన్ నిధులు రాకుండా పోయాయని అన్నారు. అందుకే వాస్తవాలను దాచిపెట్టి గొప్పలకు పోవాల్సిన అవసరం లేదని అధికారులను అప్రమత్తం చేశారు. ఇప్పటికీ రాష్ట్రంలో చాలా చోట్ల తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తండాలు, గూడెలు, అటవీ గ్రామాలకు నీళ్లు అందటం లేదని అన్నారు. ఎన్నికలప్పుడు తాను ఖానాపూర్ కు వెళితే తాగునీటికి ఇబ్బంది పడుతున్నట్లు చాలా గ్రామాల ప్రజలు తన దృష్టికి తెచ్చిన విషయం గుర్తు చేశారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాలకు, ఎన్ని హాబిటేషన్లకు తాగునీరు అందటం లేదో సమగ్రంగా సర్వే చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నెలాఖరుతో సర్పంచుల పదవీకాలం ముగిసిపోతుందని, అధికారులే తాగునీటి బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని చెప్పారు. సంబంధిత ఇంజనీర్లు అన్ని గ్రామాలకు వెళ్లి నిజ నిర్ధారణ బృందం చేసినట్లుగానే పక్కాగా తాగునీరు అందని హాబిటేషన్ల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. జలజీవన్ మిషన్ నిధులు రాబట్టుకునేలా కొత్తప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించాలని అన్నారు.
వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచేఅన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెషల్డెవెలప్మెంట్ ఫండ్ కింద కేటాయించిన రూ.10 కోట్లలో ఒక కోటి రూపాయలను తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అన్నిప్రాజెక్టులు, రిజర్వాయర్లలో లభ్యమయ్యే నీటిని ప్రజల తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యంగా అందించాలని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఉన్న స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, వాళ్లకు ఆర్థికంగా చేయాతను అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థిని విద్యార్థులు, పోలీసులకు అందించే యూనిఫామ్లు కుట్టించే పనిని ఈ సంఘాల మహిళలకు అప్పగించాలని సూచించారు. అవసరమైతే తగిన శిక్షణను ఇచ్చి వారిని ప్రోత్సహించాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేనిగ్రామాలు, హాబిటేషన్లకు రోడ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 422గ్రామ పంచాయతీలు,3177 ఆవాసాలకు ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేదని అధికారులు సీఎం నివేదించారు.
వీటన్నింటికీ తారు రోడ్లు వేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఉపాధి హామీ నిధులను లింక్ చేసి వీటిని పూర్తి చేయాలనిచెప్పారు. ఈ బడ్జెట్లోనే అందుకు అవసరమైననిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.సీఎంతో పాటు ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, రోడ్లు భవనాల శాఖ మంత్రికోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధితవిభాగాల అధికారులు
పాల్గొన్నారు.