నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
రేపు లోక్‌ సభలో ఆర్థిక మంత్రి వోటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌
ప్రస్తుత లోక్‌ సభకు చివరి సమావేశాలు

న్యూ దిల్లీ, జనవరి 30 : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొత్త భవనంలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో చివరి బడ్జెట్‌ సమావేశం మొదలవుతుంది. ఉభయ సభలను ఉద్దేశించి ముర్ము ప్రసంగిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం నాడు ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను లోక్‌ సభలో ప్రవేశ పెడతారు. ఏప్రిల్‌-మే నెలలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. ఎన్నికల నేపథ్యంలో విధానపర ప్రకటనలు ఏమి ఉండకపోవచ్చు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు పార్లమెంట్‌ ఆమోదం తెలిపితే ఏప్రిల్‌- జులైకి కావాల్సిన నిధులను ప్రో రేటా ప్రాతిపదికన భారత సంఘటిత నిధి నుంచి తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం 2024-25 ఏడాదికి జూన్‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెడుతుంది. ఇక ఆర్థిక మంత్రిగా వరసగా ఆరోసారి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌  సమర్పిస్తున్నారు.

ఐదు సార్లు పూర్తిస్థాయి బడ్జెట్‌  సమర్పించారు. ఈ సారి ఓటాన్‌ అకౌంట్‌ బ్జడెట్‌ ప్రతిపాదిస్తారు. వరసగా ఆరోసారి బ్జడెట్‌ సమర్పించిన మహిళ నేతగా నిర్మలా సీతారామన్‌ రికార్డు సృష్టించారు. మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్‌ అత్యధికంగా పది సార్లు బ్జడెట్‌ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత స్థానంలో నిర్మలా సీతారామన్‌ నిలుస్తారు. అరుణ్‌ జైట్లీ, పి చిదంబరం, యశ్వంత్‌ సిన్హా, మన్మోహన్‌ సింగ్‌ ఐదు సార్లు బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ తర్వాత బడ్జెట్‌ ప్రతిపాదించిన మహిళా నేతగా నిర్మలా సీతారామన్‌ నిలిచారు. ప్రస్తుత సమావేశాల్లో 19 బిల్లులు ఆమోదించే అవకాశం ఉంది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ తదితర విషయాల్లో పాతపద్దతినే అవలంబించే ఛాన్స్‌ ఉంది.

ప్రస్తుత లోక్‌ సభకు చివరి సమావేశాలు
నేటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్‌ సమావేశాలు ప్రస్తుత లోక్‌ సభకు చివరి సమావేశాలు. ఏప్రిల్‌- మే నెలలో సార్వత్రిక ఎన్నికల జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి బడ్జెట్‌ ప్రతిపాదిస్తారు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌  సెషన్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఉదయం 11.30 గంటలకు సమావేశానికి హాజరుకావాలని లోక్‌ సభలో ప్రాతినిధ్యం వహిస్తోన్న అన్ని పార్టీల నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. చివరి బడ్జెట్‌  సెషన్‌ కావడంతో పార్లమెంట్‌ సమావేశాలు మంచి వాతావరణంలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక భద్రతా ఏర్పాట్ల గురించి అన్ని పార్టీలకు కేంద్ర ప్రభుత్వం వివరించనుంది. సభా సజావుగా జరిగేలా సహకరించాలని ప్రతిపక్షాలను కేంద్ర ప్రభుత్వం కోరనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page