ఒక్కొక్కరుగా దూరమౌతున్న వైనం
పరోక్షంగా మోదీ గెలుపుకు దోహదం
బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఏకు అనుకూలంగా పరిణామాలు
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్, జనవరి 26 : దేశ ప్రధాని నరేంద్రమోదీని, బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ఏకమైన ‘ఇండియా కూటమి’( ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్‌క్లూజివ్ అలియన్స్) లక్ష్యం నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. కూటమిలో జరుగుతున్న పరిణామలను చూస్తుంటే లోకసభ ఎన్నికల నాటికి మోదీ గెలుపు నల్లేరుపైన నడకగా మరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా ఇండియా కూటమిలో జరుగుతున్న పరిణామాలు అదే సంకేతాన్నిస్తున్నాయి. భారత రాజకీయాల్లోనే కాకుండా, ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు మోదీ అసాధారణ వ్యక్తిగా ఎదిగిపోయాడు. ఇప్పటికే రెండు సార్లు ఆయన్ను దేశ ప్రధానమంత్రి పదవి అలంకరించింది. ఇప్పుడు మూడవసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టే దిశగా రాజకీయ వాతావర్ణం ఏర్పడబోతున్నట్లు కనిపిస్తున్నది. దేశంలో ఏర్పడుతున్న పరిణామాలను రాజకీయంగా తనకు అనుకూలంగా మల్చుకోవడంలో మోదీ సిద్దహస్తుడన్నది ఇప్పటికే ప్రచారంలోఉంది. గత ఎన్నికల ముందు పరిస్థితులను ఒకసారి ఆవలోకనం చేసుకుంటే అప్పటికి పదేళ్ళుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చాలన్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బిజెపికి నాడు ప్రజలు పట్టంకట్టారు. ఆ తర్వాత 2019లో ఎన్నికల నాటికి సర్జికల్ స్ట్రైక్ ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టింది. శత్రుదేశ గడ్డపైన మన సైనిక బలగాలను దింపి వారి రహస్య స్థావరాన్ని మట్టుపెట్టడంలో సైన్యం కనబర్చిన సాహాసచర్యలవెనుక మోదీ ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలేనన్నది నాడు ప్రజల్లో విస్తృత ప్రచారానికి కారణమైంది.
దానికి తగినట్లుగా జి20 దేశాల శిఖరాగ్ర సమావేశాల నిర్వహణ ద్వారా ఆయన మేటి అనిపించుకున్నారు. అలాగే రగులుతున్న కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370 ఆర్టికల్ రద్దునిర్ణయం ఆయన గౌరవాన్ని పెంచాయి. అయితే వ్యవసాయరంగంలో ప్రవేశపెట్టిన చట్టాల పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడం, విధిలేక వాటిని వెనక్కు తీసుకున్న సంఘటనతోపాటు గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడంలాంటి కొన్ని చిక్కుముడులు ఈసారి బిజెపి గెలుపు అవకాశాలను తగ్గిస్తుందన్న ఆలోచనలో విపక్షాలున్నాయి. ఆదే ఆలోచనతో కూటమి కట్టిన విపక్షాలకు ఆయోధ్య రామమందిర ప్రారంభోత్సవం తీవ్ర నిరాశను కలిగించింది. అయితే బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం మోదీని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్ళింది. దేశవ్యాప్తంగా హిందువుల్లో దాగి ఉన్న భక్తిభావాన్ని వెల్లడిరచే విధంగా కొనసాగిన ఈ కార్యక్రమం దేశ ప్రజల హృదయాలను దోచుకుంది. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ముందు ఆయన నిష్టగా నిర్వహించిన క్రతువు పలువురిని ఆకట్టుకుంది. ఆయనే ఇక హిందూ మత పరిరక్షకుడన్న భావన ప్రజల్లో బలపడిరది. ఈ పరిస్థితిలో ఆయన్ను రాజకీయంగా ఢీ కొనడం అంత సులభమేమీ కాదని విపక్షాలకు అర్థమైనట్లుంది. ముఖ్యంగా అయోధ్య కార్యక్రమంలో పాల్గొనే విషయంలో వ్యతిరేకించిన కాంగ్రెస్‌తో జతకడితే వొచ్చే నష్టాన్ని కూటమిలోని పార్టీలు బేరీజు వేసుకోవడం ప్రారంభించాయి.
కూటమి కట్టేప్పుడు కాంగ్రెస్ తప్పకుండా భాగస్వామిగా ఉండాలని పట్టుపట్టిన వారే కాంగ్రెస్‌ను దూరం పెట్టే ఆలోచనలో పడ్డారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో సమిష్టిగా బిజెపిని ఓడిరచాలనుకున్న ఈ పార్టీలు తమ రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ పోటీ చేసేందుకు స్థానాలను కల్పించే విషయంలో విభేదిస్తున్నాయి. తనకు బలమున్న రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాల్లో పోటీచేయాలనుకుంటున్న కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట సీట్ల సర్దుబాటు విషయంలో వత్తిడిచేయడాన్ని సహించలేక పోతున్నాయి. తాము ఇచ్చిన స్థానాలకే కాంగ్రెస్ పరిమితం కావాలంటున్నాయి ఆపార్టీలు. బిజెపికి వ్యతిరేకంగా ఏ కూటమి వొచ్చినా కాంగ్రెస్‌ను కూటమిలో చేర్చుకోవాలని మొదటి నుండీ వాదించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే పోటీచేస్తామని స్పష్టంచేసింది. కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్‌కు గాని, వామపక్షానికి గాని స్థానాలను కేటాయించేదే లేదంటుంది. అదే విధంగా పంజాబ్‌లో కూడా ‘ఆప్’ కూడా అదే విషయాన్ని వెల్లడిరచింది.
ఇక బీహార్ విషయానికొస్తే కూటమి నిర్మాణంలో విశేషంగా కృషిచేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ పెద్ద బాంబుపేల్చారు. కూటమికి తననే నాయకుడిగా ఎంచుకుంటారని, కూటమి తరఫున తానే ప్రధాని అభ్యర్థిగా ఉంటాననుకున్న నితీష్ అశయం నెరవేరకుండా పోయింది. కూటమి నాయకుడి పదవిని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించడంతో ఆయన కూటమి ఆశయాలకు భిన్న ఆలోచనలో పడ్డారు. నిన్నటి వరకు ఆర్జెడితో కూడి ఉన్నవాడల్లా ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుని బిజెపితో చేతులు కలిపేందుకు సిద్దమయ్యారు. ఇది ఒక విధంగా ఇండియా కూటమికి తీవ్ర దెబ్బగా మారింది. అలాగే మహారాష్ట్రలో ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ వ్యవహారశైలి కూడా అస్పష్టంగా ఉండ డంలాంటి పరిస్థితులు ఎన్డిఏ మరోసారి అధికారంలోకి రావడానికి అనుకూలమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.